World cup final 2025: భారత్- దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచ కప్ ఫైనల్ గురించి 5 ముఖ్యమైన విషయాలు
India vs south africa Final | భారత్ మహిళల జట్టు, దక్షిణాఫ్రికాతో 2025 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడనుంది. కొత్త ఛాంపియన్ కోసం అసలుసిసలైన పోరు జరగనుంది.

Ind vs SA ODI world Cup Final | మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. భారత మహిళా క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరగనుంది. ఈ టైటిల్ పోరు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ అండ్ టీమ్ ఉత్కంఠభరిత సెమీఫైనల్లో చాంపియన్ టీం అయిన ఆస్ట్రేలియాను ఛేజింగ్ లో ఓడించింది. ఇండియా మూడోసారి ఫైనల్ ఆడుతోంది, అయితే దక్షిణాఫ్రికా చరిత్రలో ఇదే మొదటి వన్డే ప్రపంచ కప్ ఫైనల్. కానీ రెండు జట్లలో ఎవరు గెలిచినా ఇది వారికి తొలి వన్డే వరల్డ్ కప్ టైటిల్. కొత్త ఛాంపియన్ అవతరించేందుకు మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు. ఈ ప్రపంచ కప్‌కు సంబంధించిన 5 ముఖ్యమైన విషయాలు ఇక్కడ అందిస్తున్నాం.
మహిళల ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు ప్రైజ్ మనీ ఎంత
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ టిక్కెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో నేటి మధ్యాహ్నం జరగనుంది. ఈసారి విజేత జట్టుకు గత ఎడిషన్‌తో పోలిస్తే చాలా ఎక్కువ మొత్తం లభిస్తుంది. ఐసీసీ అధ్యక్షుడు జై షా టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ప్రైజ్ మనీని ప్రకటించారు. ఇది పురుషుల ప్రపంచ కప్ విజేత జట్టు కంటే ఎక్కువని తెలిసిందే.
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలిచిన జట్టుకు 4.48 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ అందిస్తారు. భారత కరెన్సీలో దాదాపు 40 కోట్ల రూపాయలు. 2023 పురుషుల ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు 4 మిలియన్ డాలర్లు లభించాయి. అంతకంటే ఎక్కువ నేటి విజేత దక్కించుకుంటుంది. నేడు ఓడిపోయే జట్టుకు సైతం 2.24 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 20 కోట్లు లభిస్తాయి.
బీసీసీఐ ఎంత మొత్తం ఇస్తుంది?
ఒకవేళ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత జట్టు నేడు దక్షిణాఫ్రికాను ఓడిస్తే, బీసీసీఐ కూడా మహిళల జట్టుపై డబ్బుల వర్షం కురిపించవచ్చు. నివేదికల ప్రకారం, నేడు గెలిస్తే ఇండియా టీంకు టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఎంతైతే ఇచ్చారో అంతే మొత్తం బహుమతిగా ఇస్తుంది.
గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ గెలిచినందుకు బీసీసీఐ టీమిండియాకు 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఇప్పుడు భారత మహిళల టీం, సిబ్బందికి కూడా భారత్ విజేతగా నిలిస్తే బీసీసీఐ ఇదే మొత్తాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.
ప్రపంచ కప్ 2025లో టాప్ రన్ స్కోరర్‌గా స్మృతి మంధానా
ప్రపంచ కప్ ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో స్మృతి మంధానా రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ఉన్నారు. మంధానా 8 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీలు సాయంతో 389 పరుగులు చేసింది. వోల్వార్ట్ 8 మ్యాచ్‌ల్లో 470 పరుగులు చేసింది. స్మృతి మంధానా నేడు సెంచరీ సాధించి సత్తా చాటాలని చూస్తోంది. లారా వోల్వార్ట్ తక్కువ స్కోరుకు అవుట్ అయితేనే మంధానా సెంచరీ చేస్తే టాప్ స్కోరర్ అవుతుంది.
మారిజానే కాప్ అరుదైన ఘనత
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మారిజానే కాప్ మహిళల ప్రపంచ కప్‌లో 50 వికెట్ల రికార్డుకు దగ్గరగా ఉంది. సెమీఫైనల్‌లో ఆమె 5 వికెట్లు తీసింది, దాంతో ఆమె ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్‌గా నిలిచింది. మహిళల ప్రపంచ కప్‌లో 50 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా ఆమె నిలవనుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 44 వికెట్లు ఉన్నాయి. ఈ ఘనత సాధించడానికి మరో 6 వికెట్లు తీయాలి. సెమీఫైనల్‌లో ఆమె బౌలింగ్ తీరు చూస్తుంటే ఇది అసాధ్యం అనిపించదు.
చరిత్రలో మొదటిసారి ఇలాంటి ఫైనల్
మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఫైనల్‌లో ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్ లేకపోవడం ఇదే మొదటిసారి. భారత జట్టు సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరగా.. దక్షిణాఫ్రికా టీం ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికాలలో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ అవుతారు.





















