Rahul Dravid PC: సీనియర్లను సాగనంపుతారా? ద్రవిడ్ రెస్పాన్స్ ఏంటంటే!
Rahul Dravid PC: ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటామని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఇక్కడి నుంచి మెరుగవ్వడం గురించి ఆలోచిస్తామని పేర్కొన్నాడు.
IND vs ENG, Rahul Dravid: ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటామని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఇక్కడి నుంచి మెరుగవ్వడం గురించి ఆలోచిస్తామని పేర్కొన్నాడు. బిగ్‌బాష్ వంటి లీగుల్లో ఆడకపోవడంతో పిచ్‌లను సరిగ్గా అర్థం చేసుకోలేదని అంగీకరించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌నకు సుదీర్ఘ సమయం ఉండటంతో సీనియర్ల భవితవ్యంపై మాట్లాడటం తొందర పాటే అవుతుందన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలయ్యాక ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.
'అవును, మేమీ రోజు స్థాయికి తగినట్టు ఆడలేదు. ఇక్కడి నుంచి మెరుగవ్వాల్సిన అంశాలపై మేం దృష్టి సారించాలి. ఎక్కువ పరుగులు సెమీస్ వంటి మ్యాచుల్లో సాయంగా మారతాయి. మేం అందుకోసమే ప్రయత్నించాం. టోర్నీలో ఇంతకు ముందు 180+ టార్గెట్స్ ఇచ్చాం. పిచ్ నెమ్మదిగా, మందకొడిగా ఉందని కుర్రాళ్లు చెబుతున్నారు. మేం కనీసం 15-20 పరుగుల లోటుతో ఉన్నాం. హార్దిక్ బాగా ఆడాడు. ఈ వికెట్‌పై 180+ స్కోరు చేయాల్సింది' అని ద్రవిడ్ అన్నాడు.
టీమ్‌ఇండియా ఆటగాళ్లను బిగ్‌బాష్ లీగులో ఆడనిస్తారా అని ఓ ఇంగ్లిష్ జర్నలిస్టు ప్రశ్నించగా ఆ నిర్ణయం బీసీసీఐ చేతిలో ఉందని ద్రవిడ్ స్పష్టం చేశాడు. భారత్‌లో క్రికెట్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు బిగ్‌బాష్ ఆడటం సంక్లిష్టంగా మారుతుందన్నాడు. 'చాలామంది ఆటగాళ్లు ఇక్కడికొచ్చి బిగ్‌బాష్ లీగు ఆడుతున్నారనడంలో సందేహం లేదు. వారు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు. అదీ రోజు కనిపించింది. కానీ భారత క్రికెట్‌కు ఇది సంక్లిష్టం. సీజన్ పీక్ దశలో ఉన్నప్పుడు ఇలాంటి టోర్నీలు జరుగుతున్నాయి. ఏదేమైనా నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ' అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని ద్రవిడ్ అన్నాడు. 'సీనియర్ల భవితవ్యం గురించి ఇప్పుడే మాట్లాడటం తొందర పాటు అవుతుంది. వచ్చే టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా చాలా సమయం ఉంది' అని వెల్లడించాడు.
IND vs ENG Semi Final Highlights: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో టీమ్‌ఇండియా కథ ముగిసింది! 15 ఏళ్ల ఎదురు చూపులు ఫలించలేదు. ఐసీసీ ట్రోఫీ కోసం 130 కోట్ల మంది భారతీయులు మరో ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే! అడిలైడ్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్లో భారత్ ఓటమి చవిచూసింది. 169 పరుగులను డిఫెండ్ చేసుకోలేక తెల్లముఖం వేసింది. కనీసం ఒక్క వికెట్టైనా పడగొట్టలేక అవమానం మూటగట్టుకుంది.
మరోవైపు ఈ టార్గెట్‌ను ఇంగ్లాండ్ సునాయాసంగా ఛేదించింది. 16 ఓవర్లకే 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. పాకిస్థాన్‌తో బిగ్ ఫైనల్ ఆడేందుకు మెల్‌బోర్న్‌కు దూసుకెళ్లింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (80; 49 బంతుల్లో 9x4, 3x6), అలెక్స్ హేల్స్ (86; 47 బంతుల్లో 4x4, 7x6) టీమ్‌ఇండియా బౌలింగ్‌ను చితకబాదేశారు. అంతకు ముందు విరాట్ కోహ్లీ (50; 40 బంతుల్లో 4x4, 1x6), హార్దిక్ పాండ్య (63; 33 బంతుల్లో 4x4, 5x6) రాణించారు.