ENG vs PAK, Highlights: 1992 నాట్ రిపీట్! ఫైనల్లో పాక్ చిత్తు - ఇంగ్లాండే విశ్వవిజేత
ENG vs PAK, Highlights: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 విజేతగా ఇంగ్లాండ్ ఆవిర్భవించింది. మెల్‌బోర్న్ వేదికగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఫైనల్లో అద్వితీయ విజయం అందుకుంది. పాక్ జట్టును ఓడించింది.
ICC T20 WC 2022, ENG vs PAK: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 విజేతగా ఇంగ్లాండ్ ఆవిర్భవించింది. మెల్‌బోర్న్ వేదికగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఫైనల్లో అద్వితీయ విజయం అందుకుంది. బంతితో కఠిన పోటీనిచ్చిన పాకిస్థాన్‌ను ఓడించింది. బంతి బంతికీ పెరిగిన ఒత్తిడిని చిత్తు చేసింది. రెండోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ప్రత్యర్థి నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లిష్ జట్టు 5 వికెట్లు మిగిలుండగానే ఛేదించింది. 2019 వన్డే ప్రపంచకప్ మొనగాడు బెన్‌స్టోక్స్ (52; 49 బంతుల్లో 5x4, 1x6) అజేయంగా పోరాడి మరోసారి తన పేరు నిలబెట్టుకున్నాడు. బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. కెప్టెన్ జోస్ బట్లర్ (26; 17 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు. అంతకు ముందు పాక్‌లో బాబర్ ఆజామ్ (32; 28 బంతుల్లో 2x4), షాన్ మసూద్ (38; 28 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్లు.
పవర్ ప్లేలో 3 వికెట్లు
ఓపెనర్లు ఉన్న ఫామ్‌కి ఇంగ్లాండ్ సునాయాసంగా విజయం అందుకోవాలి! ఓవర్ క్యాస్ట్ కండీషన్స్ ఉండటం, రెండో ఇన్నింగ్స్ సాగుతున్నంత సేపూ చిన్న చిన్న చినుకులు పడుతుండటం పాక్ బౌలర్లకు అనుకూలంగా మారింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన సీమ్, బౌన్స్‌తో ఆంగ్లేయులను ఇబ్బంది పెట్టారు. పవర్ ప్లే ముగిసే సరికే 3 వికెట్లు పడగొట్టారు. ఇన్నింగ్స్ ఆరో బంతికే అలెక్స్ హేల్స్ (1)ను షాహిన్ అఫ్రిది బౌల్డ్ చేశాడు. 32 వద్ద ఫిల్‌సాల్ట్ (10), 45 వద్ద బట్లర్‌ను హ్యారిస్ రౌఫ్ పెవిలియన్ పంపించాడు. బట్లర్ దూకుడుగా ఆడి బౌండరీలు రాబట్టడంతో పవర్‌ప్లేలో రావాల్సిన రన్స్ వచ్చాయి. 7-15 ఓవర్ల మధ్య ఆంగ్లేయులపై పాక్ బౌలర్లు ఒత్తిడి పెంచారు. బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ బంతులతో ముచ్చెమటలు పట్టించారు.
బెన్‌స్టోక్స్ ది హీరో!
బెన్‌స్టోక్స్ ఆఖరి వరకు ఉండటం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. మరో వికెట్ పడకుండా అతడు నిలబడ్డాడు. హ్యారీ బ్రూక్ (20)తో కలిసి సింగిల్స్, డబుల్స్ తీశాడు. 13వ ఓవర్ వరకు వికెట్ ఇవ్వకపోవడంతో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ సిచ్యువేషన్‌లో బ్రూక్‌ను షాదాబ్ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. వసీమ్ తన ఆఖరి రెండు ఓవర్లలో చాలా బంతుల్ని బీట్ చేశాడు. అయితే స్టోక్స్‌కు మొయిన్ అలీ (19) అండగా నిలిచాడు. బ్రూక్ క్యాచ్ అందుకున్న అఫ్రిది మోకాళ్లు గాయపడటంతో మళ్లీ బౌలింగ్ చేయలేకపోయాడు. ఇఫ్తికార్ వేసిన 16వ ఓవర్లో స్టోక్స్ ఆఖరి 2 బంతుల్ని 4, 6గా మలిచాడు. తర్వాతి ఓవర్లో మొయిన్ మూడు బౌండరీలు కొట్టాడు. సమీకరణం 12 బంతుల్లో 7కు మారడంతో అలీ ఔటైనా ఇంగ్లాండ్ గెలిచేసింది.
కరన్, రషీద్ హిట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ బ్యాటర్లను ఇంగ్లిష్ బౌలర్లు వణికించారు. ఓవర్ క్యాస్ట్ కండిషన్స్‌ను ఉపయోగించుకొని చక్కని లెంగ్తుల్లో బంతులు విసిరారు. స్వింగ్, బౌన్స్‌తో ప్రత్యర్థికి మెరుగైన ఆరంభం దక్కనీయలేదు. ఓపెనర్లు రిజ్వాన్ (15), బాబర్ ఆజామ్ (32) షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. జట్టు స్కోరు 29 వద్ద కరన్ వేసిన బంతికి రిజ్వాన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి పాక్ 39/1తో నిలిచింది.
వన్‌డౌన్‌లో వచ్చిన హ్యారిస్ (8)ను రషీద్ బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో బాబర్, మసూద్ 24 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. అద్భుతమైన గూగ్లీతో బాబర్‌ను ఔట్ చేసి రషీద్ ఈ జోడీని విడగొట్టాడు. తన స్పిన్‌తో పరుగుల్నీ నియంత్రించాడు. మరికాసేపటికే స్టోక్స్ బౌలింగ్‌లో ఇఫ్తికార్ ఔటయ్యాడు. కష్టాల్లో పడ్డ జట్టును షాదాబ్ (20) ఆదుకొనే ప్రయత్నం చేశాడు. రెండు పరుగుల వ్యవధిలోనే మసూద్, షాదాబ్ పెవిలియన్ చేరడంతో రన్‌రేట్ తగ్గిపోయింది. ఆఖర్లో టపటపా వికెట్లు పడటంతో పాక్ 138/7 వద్ద ఆగిపోయింది.
WHAT A WIN! 🎉
— T20 World Cup (@T20WorldCup) November 13, 2022
England are the new #T20WorldCup champions! 🤩#PAKvENG | #T20WorldCupFinal | 📝 https://t.co/jOrORwR5v9 pic.twitter.com/zWYOAP9690