ICC Cricket WC 2023: వీరూ సెన్సేషనల్ కామెంట్స్! విరాట్ కోసం ప్రపంచకప్ గెలవాలట!!
ICC Cricket WC 2023: టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ కోసం ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను గెలవాలని సూచించాడు.
ICC Cricket WC 2023:
టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ కోసం ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను గెలవాలని సూచించాడు. 2011 నాటి వారసత్వాన్ని కొనసాగించాలని పేర్కొన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ లాగే విరాట్ టీమ్‌ఇండియా కోసం టన్నుల కొద్దీ పరుగులు చేశాడని గుర్తు చేశాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ షెడ్యూలు కార్యక్రమంలో అతడు మాట్లాడాడు.
వన్డే ప్రపంచకప్‌కు సరిగ్గా వంద రోజుల ముందు ఐసీసీ మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది. మొత్తం 46 రోజులు 48 మ్యాచులు జరుగుతాయి. పది జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో టోర్నీ ఆడతాయి. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన దేశాలు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఆ మ్యాచుల్లో గెలిచిన జట్లు అహ్మదాబాద్‌లో మెగా ఫైనల్లో తలపడతాయి. హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, దిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగళూరు, ముంబయి, కోల్‌కతాను వేదికలుగా ప్రకటించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టీమ్‌ఇండియా చివరిసారి 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచింది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంకను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. లెజెండరీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ఆడిన చివరి ప్రపంచకప్ అదే. దాంతో అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలన్న ఉద్దేశంతో టీమ్‌ఇండియా ఆటగాళ్లు కసిగా ఆడారు. యువరాజ్ సింగ్ ఏకంగా క్యాన్సర్‌తో పోరాడుతూ అదరగొట్టాడు. మాస్టర్ తర్వాత ఆ భారాన్ని విరాట్ మోశాడని సెహ్వాగ్ అంటున్నాడు. అతడికోసం కప్ గెలవాలని సూచిస్తున్నాడు.
'మేం సచిన్ తెందూల్కర్ కోసం ప్రపంచకప్ ఆడాం. మేం మెగా టోర్నీ గెలిస్తే ఆయనకు ఘన వీడ్కోలు అవుతుందని భావించాం. ఇప్పుడు విరాట్ అదే స్థానంలో ఉన్నాడు. అందరూ అతడి కోసం ప్రపంచకప్ గెలవాలి. అతనెప్పుడు 100 శాతానికి మించే కష్టపడతాడు. విరాట్ సైతం ఇందుకోసమే చూస్తున్నాడు. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో లక్ష మంది మ్యాచుని చూస్తారు. అక్కడి పిచ్‌లు ఎలా స్పందిస్తాయో అతడికి తెలుసు. ఈసారి టన్నుల కొద్దీ పరుగులు చేసి కప్ గెలిపిస్తాడనే నా నమ్మకం' అని సెహ్వాగ్ అన్నాడు.
అందరిలాగే తానూ భారత్, పాకిస్థాన్ హై ప్రొఫైల్ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని వీరూ చెప్పాడు. 'అందరూ అక్టోబర్ 15న భారత్, పాక్ మ్యాచ్ కోసమే చూస్తారు. నేనూ అంతే. ఆ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఏదేమైనా ఒత్తిడిని జయించే జట్టే గెలుస్తుంది. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఒత్తిడిని అధిగమిస్తోంది. భారత్‌పై ప్రపంచకప్ పోటీల్లో ఒక్కసారైనా గెలవలేదన్న భారం దాయాదిపై ఉంది. 1990 దశకంలో పాకిస్థాన్ ఒత్తిడిని బాగా అధిగమించేది. 2000 నుంచి భారత్ మెరుగ్గా హ్యాండిల్ చేస్తోంది. ఎవరైనా ఆటగాడు ప్రెజర్ లేదంటే అబద్ధమే! మేమూ అలాగే అనేవాళ్లం. కానీ మ్యాచ్ రోజు అలా ఉండదు. భారత్, పాకిస్థాన్ మ్యాచంటే భావోద్వేగాలు ఓ రేంజులో ఉంటాయి' అని సెహ్వాగ్ తెలిపాడు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ కచ్చితంగా సెమీ ఫైనల్ చేరుకుంటాయని వీరేంద్ర సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, ఐదుసార్లు ప్రపంచ విజేత ఆస్ట్రేలియా సెమీస్‌కు దూసుకొస్తాయని అంచనా వేశాడు. 'నన్ను అడిగితే సెమీస్ చేరే నాలుగు జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్' అని వీరూ చెప్పాడు.
Also Read: ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా షెడ్యూలు ఇదే! ఆసీస్, పాక్, ఇంగ్లాండ్‌తో మ్యాచులు ఇక్కడే!