AB de Villiers: తూచ్! విరుష్క విషయంలో తప్పు చేశా- మాట మార్చిన డివిలియర్స్
Virat Kohli: తాను గత వీడియోలో పెద్ద పొరపాటు చేశానని తనకు అందిన సమాచారమంతా తప్పేనని అంగీకరించాడు.విరాట్ అనుష్క జోడి రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టాడు.
AB de Villiers Apologises: విరుష్క జోడీ రెండో బిడ్డను స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నారని ఇటీవల దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఇటీవల వ్యాఖ్యానించాడు. కుటుంబం కోసం టెస్టులకు దూరమైనట్లు పేర్కొన్నాడు. తీరా, ఇప్పుడు ఏబీడీ ఇప్పుడు మాట మార్చాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడంతో అభిమానుల్లో అయోమయం మొదలైంది. తాను గత వీడియోలో పెద్ద పొరపాటు చేశానని తనకు అందిన సమాచారమంతా తప్పేనని అంగీకరించాడు. విరాట్ అనుష్క జోడి రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టాడు. దీనిపై విరాట్ కుటుంబమే స్పష్టత ఇస్తుందని కూడా చెప్పాడు. అక్కడ ఏం జరుగుతుందనేది తెలియదని... విరాట్ త్వరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని అన్నాడు. విరామం తీసుకోవడానికి కారణమేదైనా కోహ్లీ మరింత బలంగా తిరిగి రావాలని ఎదురు చూస్తున్నానని ఏబీడీ తెలిపాడు.
ఏబీడీ అప్పుడు ఏమన్నాడు..?
టీమ్ఇండియా(Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరోసారి తండ్రి కాబోతున్నాడని అప్పట్లో ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. యూట్యూబ్ లైవ్‌లో ఏబీ డివిలియర్స్ అభిమానులతో ముచ్చటించాడు. విరాట్ కోహ్లీతో మాట్లాడారా? అతను బాగున్నారా? అని ఓ అభిమాని ఆయన్ని అడిగాడు. ‘‘ఇటీవల అతడితో చాటింగ్ చేశా. ఎలా ఉన్నావు అని అడిగా. క్షేమంగా ఉన్నానని చెప్పాడు. అతను తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడు. అందుకే ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నా. కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు అతడు తన కుటుంబంతో ఉండటం ముఖ్యం. విరాట్ తన ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇస్తున్నాడని చాలా మంది భావిస్తుండొచ్చు. కానీ, అది తప్పు. కోహ్లీని మేం కూడా మిస్ అవుతున్నాం. అతడు కచ్చితంగా సరైన నిర్ణయం తీసుకున్నాడని డివిలియర్స్ అన్నాడు.
మిగిలిన టెస్టులకూ దూరం..!
గాయాలతో సతమతమవుతున్న టీమిండియా(Team India)కు పెద్ద షాక్ తగిలింది. మూడో టెస్ట్ నుంచి విరాట్ కోహ్లీ(Virat Kohli) జట్టులోకి వస్తాడనుకుంటున్న వేళ... విరాట్ అందుబాటులో ఉండడన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ ఈ నెల 15నుంచి రాజ్‌కోట్‌లో మొదలయ్యే మూడో టెస్టుతో పాటు రాంచీలో జరిగే నాలుగో టెస్టుకు జట్టులోకి వచ్చే అవకాశాలు లేనట్లు వార్తలు వస్తున్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఈనెల 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి 27 వరకు రాంచీలో జరగనున్నాయి. ధర్మశాలలో మార్చి 7నుంచి మొదలయ్యే ఆఖరి టెస్టుకైనా కోహ్లీ అందుబాటులో ఉంటాడా అన్నది అనుమానంగా మారింది. జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయంపై కోహ్లి బీసీసీఐకి ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. విరాట్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.