Los Angeles Olympics 2028: ఒలింపిక్స్‌లోక్రికెట్ రీఎంట్రీ! భారత్ ఆడుతుందా? 128 ఏళ్ల తర్వాత ఏం జరగబోతోంది?
Los Angeles Olympics 2028: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో క్రికెట్ పునరాగమనం చేయనుంది. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్. ఫార్మాట్, జట్లు వివరాలు ఎలా ఉంటాయో ఇక్కడ చూడొచ్చు.

Los Angeles Olympics 2028: క్రికెట్ 128 సంవత్సరాల తర్వాత ఇప్పుడు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో తిరిగి రాబోతోంది. ఒలింపిక్స్ 2028లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో పునఃపరిచయం చేయనున్నారు. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ క్రికెట్ మ్యాచ్‌ల షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ఒలింపిక్స్ లో 6 పురుషుల, 6 మహిళల జట్లు పాల్గొంటాయి. క్రికెట్ మ్యాచ్‌లన్నీ పామోనా ఫెయిర్‌ప్లెక్స్‌లో నిర్వహిస్తారు. ఇది లాస్ ఏంజిల్స్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఎప్పుడు నుంచి ఈ మ్యాచ్‌లు ప్రారంభం
2028 ఒలింపిక్స్లో క్రికెట్ జులై 12 నుంచి ప్రారంభమవుతుంది. పురుషుల, మహిళల జట్ల మ్యాచ్‌లు జులై 12 నుంచి 19 వరకు జరుగుతాయి. అదే సమయంలో మహిళల జట్టు మెడల్ మ్యాచ్ జులై 20న, పురుషుల జట్టు మెడల్ మ్యాచ్ జులై 29న జరుగుతుంది.
6 జట్లు పాల్గొంటాయి, భారత్ ఆడుతుందా లేదా?
2028 ఒలింపిక్స్‌లో 6 పురుషుల, 6 మహిళల జట్లు పాల్గొంటాయి. ప్రతి జట్టులో 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఏ 6 జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటాయో ఇంకా తెలియరాలేదు. క్వాలిఫికేషన్ ప్రక్రియపై జులై 17-20 వరకు సింగపూర్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సమావేశంలో చర్చించవచ్చు.
నివేదికల ప్రకారం, జట్లు ర్యాంకింగ్‌ల ఆధారంగా క్వాలిఫై కావచ్చు. అయితే గత కొన్ని నెలలుగా క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌పై ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఒకవేళ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ జరిగితే, అందులో కొన్ని అసోసియేట్ దేశాలు కూడా పాల్గొనవచ్చు. క్వాలిఫికేషన్ ప్రక్రియ ఖరారైన తర్వాతే భారత జట్టు నేరుగా ర్యాంకింగ్‌ల ఆధారంగా క్వాలిఫై అవుతుందా లేదా క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ఆడి స్థానం సంపాదించాలా అనేది తెలుస్తుంది.
128 సంవత్సరాల క్రితం ఏ జట్టు క్రికెట్‌లో మెడల్ గెలిచింది
క్రికెట్ ఒలింపిక్స్లో 128 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తోంది. దీనికి ముందు, 1900 సంవత్సరంలో క్రికెట్ ఒలింపిక్స్‌లో నిర్వహించారు. ఆ సమయంలో గోల్డ్ మెడల్ కోసం గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య పోటీ జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్,ఫ్రాన్స్‌ను ఓడించి గోల్డ్ మెడల్ గెలుచుకుంది.




















