Harmanpreet Kaur Fined: టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు భారీ జరిమానా విధించిన ఐసీసీ
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. ఆమె మ్యాచ్ ఫీజులో భారీ కోత విధించింది.
Harmanpreet Kaur Fined: బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా శనివారం ముగిసిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరించిన తీరుపై ఐసీసీ కన్నెర్రజేసింది. స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టడం, అంపైర్‌తో వాగ్వాదానికి దిగడం, మ్యాచ్ ముగిశాక అంపైర్ల గురించి వ్యాఖ్యానించడం వంటివి తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో హర్మన్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించినట్టు ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
శనివారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఐసీసీ ప్రతినిధి క్రిక్ బజ్‌తో మాట్లాడుతూ.. ‘హర్మన్ చేసింది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఆన్ ఫీల్డ్ ఇన్సిడెంట్‌కు గాను ఆమెకు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడనుంది. ఇక మ్యాచ్ ముగిశాక ప్రజంటేషన్ సెర్మనీలో ఆమె అంపైర్లపై చేసిన వ్యాఖ్యలకు గాను 25 శాతం కోత విధించున్నారు..’ అని వెల్లడించారు. అంతేగాక ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్లు కూడా ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.
భారత్ - బంగ్లా మ్యాచ్‌లో భాగంగా ఆతిథ్య జట్టు నిర్దేశించిన 226 పరుగుల ఛేదనలో హర్మన్ ఔట్ అవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నహిదా అక్తర్ వేసిన 34వ ఓవర్లో నాలుగో బంతికి హర్మన్.. స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించగా బంతి ఆమె ప్యాడ్‌కు తాకి స్లిప్ ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ తన్వీర్ అహ్మద్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వేలు పైకి లేపాడు. దీనిపై హర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బ్యాట్‌తో స్టంప్స్‌ను కొట్టింది. పెవిలియన్ వైపునకు వెళ్తూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. బంగ్లా వాదన ఏంటంటే.. ఎల్బీ కాకున్నా బాల్ బ్యాట్ తాకి ఉంటే స్లిప్స్ లో క్యాచ్ పట్టినట్టు కూడా కనబడుతోంది కదా..? దానికి హర్మన్ ఇంత రాద్దాంతం చేయడం ఎందుకని ఆ జట్టు అభిమానులు వాపోతున్నారు. అయితే డీఆర్ఎస్ లేకపోవడంతో అసలు బంతి బ్యాట్‌కు తాకిందా..? ఎల్బీ కరెక్టేనా..? అన్నది సస్పెన్స్‌గానే ఉండిపోయింది.
The controversial dismissal of Harmanpreet Kaur #CricketTwitter #BANvIND pic.twitter.com/XEGdTMgRJd
— Female Cricket (@imfemalecricket) July 22, 2023
ఇక మ్యాచ్ ముగిశాక ప్రెజెంటేషన్ సెర్మనీలో హర్మన్ అంపైర్లు వ్యవహరించిన తీరు సరిగా లేదని, అంపైర్ల నిర్ణయాలు తమను తీవ్ర నిరాశకు గురిచేశాయని వ్యాఖ్యానించింది. ఇది కూడా తీవ్ర వివాదాస్పదమైంది. బంగ్లాదేశ్‌కు తర్వాత వచ్చేప్పుడు ఇటువంటి అంపైరింగ్‌కు ముందుగానే ప్రిపేర్ అయి వస్తామని చెప్పింది.
ఇదిలాఉండగా మ్యాచ్ అయిపోయి ట్రోఫీతో ఇరు జట్లు ఫోటోలు దిగే క్రమంలో కూడా హర్మన్ చేసిన వ్యాఖ్యలపై బంగ్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మ్యాచ్ టై గా ముగియడంతో సిరీస్ కూడా 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లూ ట్రోఫీని పంచుకున్నాయి. ట్రోఫీతో ఫోటో దిగే క్రమంలో హర్మన్‌ప్రీత్ బంగ్లా ప్లేయర్లను ఉద్దేశిస్తూ.. ‘మీరే వస్తున్నారేంటి..? అంపైర్లను కూడా తీసుకురండి. వాళ్లకూ ఈ విజయంలో భాగముంది..’ అని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial