Ganguly Vs Harbhajan Singh: గంగూలీ కోసం కన్నీళ్లు పెట్టుకున్న హర్భజన్ సింగ్ - ప్రాణమున్నంత వరకూ..
Sourav Ganguly: భారత క్రికెట్ పుస్తకంలో గంగూలీకి తప్పనిసరిగా ఒక పేజీ ఉంటుంది. తన సారథ్య కాలంలో జట్టును ఎన్నో శిఖరాలు అధిరోహించేలా చేశాడు. అలాగే ఆటగాళ్లతో మంచి స్నేహ సంబంధాలను మెయింటేన్ చేసేవాడు.

Sourav Ganguly News: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటే అదో బ్రాండ్ అనడంలో సందేహం లేదు. 1999లో జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత టీమ్కు అగ్రెసివ్ బిహేవియర్ నేర్పిన సారథి తనే. ముఖ్యంగా 2000-2005 మధ్య తన సారథ్య కాలంలో జట్టు ఎన్నో విజయాలు సాధించింది. ఎంతగానో పేరు తెచ్చుకుంది. 1983 తర్వాత తొలిసార వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ప్రవేశించింది. అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఇలా ఎన్నో ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలో కనిపిస్తున్నంత దూకుడు గంగూలీలో కూడా ఉండేది. ఇక ఆటగాళ్లను బ్యాక్ చేసే విషయంలో తనకు తానే సాటి. అందుకే చాలామంది ఆటగాళ్లకు దాదా అంటే ఎంతో ఇష్టం. దాదా గురించి టర్బోనేటర్, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గతంలో పంచుకున్న ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతోంది. ఆ వీడియోలో గంగూలీ గొప్పతనాన్ని భజ్జీ వర్ణించాడు. తాజాగా బెంగాల్‌కు చెందిన మనోజ్ తివారీ.. భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్.. దాదాను అవమానించడాని తెలియడంతో, అతడి గొప్పతనాన్ని వివరిస్తూ గంగూలీ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
Harbhajan Singh got emotional when he was explaining the importance of Sourav Ganguly in his life. He gave him the status of an elder brother.
— AT10 (@Loyalsachfan10) January 9, 2025
Harbhajan Singh marte dum tak inke sath khada rahega❤️ pic.twitter.com/71pYLMBMau
ప్రాణం ఉన్నంత వరకు..
1998లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన భజ్జీ కొద్ది కాలానికే తెరమరుగయ్యాడు. ఆ తర్వాత 2001 ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చాడు. కేవలం మూడు టెస్టుల సిరీస్‌లోనే తను 32 వికెట్లు తీసి బీజీటీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 24 ఏళ్లు గడిచినప్పటికీ అది ఇంకా బ్రేక్ కాలేదు. ఈ నెలలోనే జరిగిన బీజీటీలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దాన్ని సమం చేశాడు. అలాంటి భజ్జీ ఒకనొక సమయంలో టీమ్ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఆ సమయం తనకు చాలా కష్టంగా గడిచింది. ఆ సమయంలో తనకు దాదా చాలా అండగా ఉన్నాడని ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. ఒకసారి టీమ్‌లో తాను చోటు కోల్పోయానని, అలాగే ఎన్సీఏ నుంచి కూడా తనను బయటకు పంపించారని భజ్జీ తెలిపాడు. అదే సమయంలో తాను కొన్ని తప్పలు చేసిన మాట వాస్తవమేనని, తన తండ్రి కూడా ఆ టైమ్‌లోనే దూరమయ్యాడని భజ్జీ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో దాదా తనను ఎంతగానో బ్యాక్ చేశాడని, తనకు పెద్దన్నయ్య ఉన్నా కానీ, దాదా అంత చేసేవాడు కాదనీ కొనియాడాడు. తన ప్రాణమున్నంత వరకు దాదాకు అండగా నిలుస్తానని కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పాడు.
ఈ కోణం ఎప్పుడూ చూడలేదు..
మరోవైపు ఈ వీడియో ఇంటర్వ్యూ సమయంలో అక్కడే ఉన్న దాదా కూడా ఎమోషనల్ అయ్యాడు. భజ్జీ తనకు ఇరవై ఏళ్లుగా తెలుసని, అయితే ఎప్పుడూ ఈ విషయాలు పంచుకోలేదని వ్యాఖ్యానించాడు. ఇక ఆటగాళ్లను వెనకేసుకు రావడంతో పాటు విదేశాల్లో సిరీస్‌లను సాధించే విషయంలో గంగూలీ తనదైన స్టైల్ ఏర్పర్చాడు. 2002 నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్లో భారత్ గెలిచాక, తన షర్ట్ విప్పి, గాలిలో గిరాగిరా తిప్పడాన్ని ఇప్పటికీ భారత అభిమానులు గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత కాలంలో ఏకంగా బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ మారిన సంగతి తెలిసిందే. ఏదేమైనా తనతో కలిసి ఆడిన ఆటగాళ్లతో దాదాకు మంచి సంబంధాలు ఉన్నాయని అతని అభిమానులు తెగ మురిసిపోతున్నారు.




















