Andhra Premier League 2025 Latest Updates: అందరి దృష్టి ఏపీఎల్ 2025 పైనే.. బరిలో టీమిండియా స్టార్లు.. ఎక్కడ చూడొచ్చంటే..?
ఇన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ చూసిన ప్రేక్షకులకు ఏపీఎల్ రూపంలో లోకల్ టాలెంట్ ను వీక్షించే అవకాశం దక్కింది. ఏపీఎల్ నాలుగో ఎడిషన్ ఈనెల 8 నుంచి ప్రారంభమైంది. బరిలో ఏడు జట్లు ఉన్నాయి.

APL 2025 Latest News: ప్రతిష్టాత్మక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇది నాలుగో సీజన్ కావడం విశేషం. భాతర క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, హనుమ విహారి, కేఎస్ భరత్, ఐపీఎల్ స్టార్ షేక్ రషీద్ వంటి ఆటగాళ్లు పాల్గొంటుండటంతో ఈసారి లీగ్ పై అందరి ఫోకస్ నెలకొంది. డిఫెండింగ్ చాంపియన్ గా వైజాగ్ వారియర్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతోంది. గతేడాది జరిగిన ఫైనల్లో ఉత్తరాంధ్ర లయన్స్ పై 87 పరుగులతో విజయం సాధించి, వారియర్స్ కప్పును ఎగురేసుకుపోయింది. ఈసారి లీగ్ లో చాలా మార్పులు జరిగాయి. మొత్తం ఏడు జట్లు ఈ టోర్నీలో తమ లక్కును పరీక్షించుకుంటున్నాయి. అవి, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్ షైనర్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్, సింహాంద్రి వైజాగ్ లయన్స్.
#APL2025 begins today in the beautiful city of Visakhapatnam.
— Ram Charan (@AlwaysRamCharan) August 8, 2025
All the best to the teams participating.
Sending special wishes to @vjasunshiners owned by the dearest @MythriOfficial
Hoping for a cracking tournament.@theacatweets pic.twitter.com/4wtDtvmtXl
బుల్స్ కెప్టెన్ నితీశ్..
ఈ టోర్నీలో మొత్తం 25 మ్యాచులు జరుగనున్నాయి. ఒక్కో జట్టు మరో టీమ్ తో ఏడేసి మ్యాచ్ లు ఆడనుంది. ఆగస్టు 8 నుంచి 25 వరకు మొత్తం 17 రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. 21 నుంచి ప్లే ఆఫ్స్ జరుగుతుండగా, 25న మెగా ఫైనల్ జరుగుతుంది. మ్యాచ్ లన్నీ విశాఖపట్నంలోని డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ- వీడిసీఏ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు. టోర్నీ తొలి పోరు కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ మధ్య ప్రారంభమైంది. భీమవరం బుల్స్ జట్టుకు నితీశ్ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే మోకాలి గాయం కారణంగా తను ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది. తొలి మ్యాచ్ సా.7.30 నుంచి ప్రారంభం కానుండగా, మిగతా సాయింత్రం మ్యాచ్ లన్నీ సా.6.30కే మొదలవుతాయి. మధ్యాహ్నం మ్యాచ్ లు మాత్రం మ.1 .30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఎక్కడ చూడొచ్చంటే..
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ అటు టీవీల్లోనూ, ఇటు డిజిటల్ గానూ చూసే చాన్స్ ఉంది. టీవీల్లో సోనీ స్పోర్ట్స్ 5 ఎస్డీ, హెచ్డీ, సోనీ స్పోర్ట్స్ 4 చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక డిజిటల్ గా ఫ్యాన్ కోడ్ యాప్ తోపాటు వెబ్ సైట్ లోనూ ఈ టోర్నీని చూడవచ్చు. తమ తమ వీలుని బట్టి, క్రికెట్ ప్రేమికులు ఈ టోర్నీని వీక్షించ వచ్చని నిర్వాహకులు తెలిపారు. ఏదేమైనా తెలుగు ప్లేయర్లతో నిర్వహించే ఈ టోర్నీ ద్వారా మరింత మంది లోకల్ ప్లేయర్లు వెలుగులోకి రావాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇప్పటిదాక మూడు ఎడిషన్లను ఆదరించినట్లుగానే ఈ ఎడిషన్ ను ఆదరించాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు. టీ 20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీ ద్వారా ధనాధన్ ఆటతీరు ప్రదర్శించే యువ ప్లేయర్లు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




















