India Final XI Controversy: టీమిండియా ఫైనల్ లెవన్‌ను తప్పు పట్టిన భజ్జీ - అతడినే కొనసాగించి ఉంటే బాగుండేదని చురకలు
Brisbane Test: రోహిత్ శర్మ నాయకత్వంలోని ప్రస్తుత భారత జట్టు కూర్పులో తేడాలున్నట్లు పలువురు మాజీలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ల ఎంపికపై ప్రశ్నలు లేవదీస్తున్నారు.
Rohit Sharma News: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత టీమ్ సెలెక్షన్‌పై పలువురు మాజీలు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా మ్యూజికల్ చైర్స్ మాదిరిగా స్పిన్నర్లను రొటేట్ చేయడంపై మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా తీవ్ర విమర్శలు చేశాడు. అసలు ఏ బేసిస్ మీద స్పిన్నర్లను సెలెక్టు చేస్తున్నారంటూ మండిపడ్డాడు. నిజానికి పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కాదని వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో అశ్విన్‌ను తుదిజట్టులో ఆడించారు. ఇప్పుడు మూడో టెస్టులో వీరిద్దరిని కాదని వెటరన్ రవీంద్ర జడేజాను ఆడిస్తున్నారు. తాజాగా దీనిపై భారత మాజీ క్రికెటర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ విమర్శలు చేశాడు. తను ఈ విషయంపై మాట్లాడితే వివాదం అవుతుందని టీమ్ మేనేజ్మెంట్‌ను ఉద్దేశించి సుతిమెత్తగా చురకలు అంటించాడు.
స్పిన్నర్లపై నమ్మకం లేదేమో..!!
మ్యాచ్ సందర్భంగా కామెంటరీ చేస్తున్న భజ్జీ.. భారత టీమ్ సెలెక్షన్‌ను తప్పుట్టాడు. తమ స్పిన్నర్లపై నమ్మకం లేకనే తలో మ్యాచ్‌లో ఒకరి చొప్పున ఆడిస్తున్నారేమోనని సెటైర్ వేశాడు. నిజానికి తొలి టెస్టులో సీనియర్లు అశ్విన్, జడేజాలలో ఒక్కరిని ఆడించాల్సి ఉండగా, సుందర్ ను తుదిజట్టులోకి తీసుకున్నారని గుర్తు చేశాడు. అయితే రెండో టెస్టుకల్లా అతని స్థానంలో అశ్విన్‌ను తీసుకోవాల్సిన ఆంతర్యమేంటని ప్రశ్నించాడు. ఇక రెండోటెస్టులో బాగానే బౌలింగ్ చేసి, వికెట్ కూడా సాధించిన అశ్విన్‌ను మార్చి జడేజాను ఎందుకు జట్టులోకి తీసుకున్నట్లు అని ప్రశ్నించాడు.
తర్వాతి టెస్టులో జడ్డూ ఉంటాడో.. లేడో..!!
ఇక మెల్‌బోర్న్‌లో జరిగే నాలుగో టెస్టులో జడేజాను ఉంచుతారో, లేక మరో స్పిన్నర్‌ను ఏమైనా ఆడిస్తారేమోనని భజ్జీ వ్యంగస్త్రాలు సంధించాడు. నిజానికి భారత బౌలర్లలోనే అశ్విన్ చాలా అనుభవం కలవాడు. అతని ఖాతాలో 537 వికెట్లు ఉన్నాయి. దిగ్గజం అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా ఖ్యాతి గడించాడు. అలాంటి అశ్విన్ ను పక్కన పెట్టడం సరికాదని హర్బజన్ వ్యాఖ్యానించాడు. ఇక ఈ జాబితాలో దిగ్గజం కపిల్ దేవ్ 434 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా, 417 వికెట్లతో భజ్జీ నాలుగో ప్లేస్ దక్కించుకున్నాడు. 300 వికెట్లకు పైబడి వికెట్లతో జడ్డూ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటికైనా సరైన జట్టు కూర్పు చేసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ కు భజ్జీ చురకలు అంటించాడు. ఇక మూడో టెస్టులో భారత్ ఎదురీదుతోంది. ఆసీస్ సాధించిన 445 తొలి ఇన్నింగ్స్ స్కోరుకు జవాబిస్తూ.. తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 51 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇంకా 394 పరుగుల వెనుకంజలో ఉంది.
Also Read: Ind Vs Aus 3rd Test Highlights: బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం