ENG vs NED: పసికూన ముందు భారీ లక్ష్యం, బెన్ స్టోక్స్ శతకం
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో పరాజయాల పరంపర కొనసాగిస్తున్న ఇంగ్లండ్..నెదర్లాండ్స్ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
ప్రపంచకప్‌లో పరాజయాల పరంపర కొనసాగిస్తున్న ఇంగ్లండ్..నెదర్లాండ్స్ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. డచ్ జట్టు మొదట్లో పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేసేందుకు కష్టపడింది. కానీ చివర్లో బెన్ స్టోక్స్ భారీ షాట్లతో అలరించడంతో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 339 పరుగులు భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు ఇంగ్లండ్‌కు తొలిసారి పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. జాని బెయిర్ స్టో, డేవిడ్ మలన్ తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. 17 బంతుల్లో 15 పరుగులు చేసిన బెయిర్ స్టోను దత్త్ పెవిలియన్‌కు పంపాడు. కానీ డేవిడ్ మలన్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 74 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సులతో 87 పరుగులు చేసి శతకం దిశగా సాగుతున్న మలన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం మళ్లీ ఇంగ్లండ్ వికెట్ల పతనం ప్రారంభమైంది. 35 బంతుల్లో 28 పరుగులు చేసిన రూట్ బౌల్డ్ అవ్వగా.... 16 బంతుల్లో 11 పరుగులు చేసిన బ్రూక్ కూడా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 11 బంతుల్లో అయిదే పరుగులు చేసి అవుటయ్యాడు. 2 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి పటిష్ట స్థితిలో కనిపించిన బ్రిటీష్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి 178 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొయిన్ అలీ కూడా 15 బంతుల్లో నాలుగు పరుగులు చేసి వెనుదిరగడంతో 192 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది.
ఇక ఇంగ్లండ్ పతనం వేగంగా ముగుస్తుందనుకున్న తరుణంలో గత ప్రపంచకప్ హీరో, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రాణించాడు. బెన్ స్టోక్స్ 84 బంతుల్లో 6 ఫోర్ లు, 6 భారీ సిక్సర్ లతో 108 పరుగులు చేసాడు. స్టోక్స్ చివర్లో విధ్వంసం సరుసటయించడంతో ఇంగ్లాండ్ స్కోర్ 300 పరుగులు దాటింది. అతనికి క్రిస్ వోక్స్ సహకారం అందించాడు. వోక్స్ 45 బంతుల్లో ఐదు 4 లు, ఒక సిక్స్ తో 51 పరుగులు చేశాడు. వీరిద్దరూ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వాండర్ మెర్వ్ 3, ఆర్యన్ దత్త్ 2, వాన్‌బీక్ 2, మీక్రన్ 1, డీ లీడే ఒక్క వికెట్ తీశారు.
ప్రపంచ కప్‌లో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ కేవలం ఒక విజయాన్ని మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఏ ఇంగ్లండ్ జట్టు కూడా ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోలేదు. అందుకే నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని బ్రిటీష్ జట్టు చూస్తోంది. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్‌కు కాస్తైన పరువు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.