IND vs ENG 1st Test Highlights: ఉప్పల్ టెస్టులో భారత్‌కు షాక్, స్వల్ప తేడాతో ఇంగ్లాండ్ విజయం
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అనూహ్య ఓటమిని చవి చూసింది. తొలి ఇన్సింగ్‌లో భారీ స్కోరు చేసిన భారత జట్టు రెండో ఇన్సింగ్‌లో చతికిలపడడంతో ఓటమి తప్పలేదు. 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
England Beat India By 28 Runs In First Test Match : ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు (Team India) అనూహ్య ఓటమిని చవి చూసింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్సింగ్‌లో భారీ స్కోరు సాధించిన భారత జట్టు రెండో ఇన్సింగ్‌లో చతికిలపడడంతో ఓటమి తప్పలేదు. బౌలర్లకు పిచ్ అనుకూలించడంతో స్వల్ప లక్ష్యాన్ని చేరుకోవడంలో తడబడిన భారత్ 28 పరుగుల తేడాతో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ జట్టులో టామ్ హార్టీలీ ఏడు వికెట్లతో భారత్ జట్టు నడి విరిచి అపూరూపమైన విజయాన్ని అందించి పెట్టాడు.
తొలి ఇన్సింగ్‌లో ఆధిక్యం సాధించిన భారత్..
తొలి టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు అనుకున్నట్టుగా బజ్ బాల్ వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నం చేసింది. తొలి రోజు నుంచీ జోరుగా ఆడే ప్రయత్నం చేసిన ఇంగ్లాండ్ జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోవడంతో తొలి ఇన్నింగ్‌లో 64.3 ఓవర్లలో పది వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రావ్లే 20(40), డకెట్ 35(39) పరుగులు చేయగా, ఆ తరువాత వచ్చిన బ్యాటర్ ఒల్లీ పోప్ 1(11) వెంటనే ఔటయ్యాడు. పోప్ ఔటైన తరువాత క్రీజులోకి వచ్చిన రూట్, బెయిర్ స్టో వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రూట్ 39(60), బెయిర్ స్టో 37(58) పరగులు చేశారు. ఆ తరువాత వచ్చిన స్టోక్స్ కెప్టెన్ ఇన్సింగ్ ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించి పెట్టాడు. 88 బంతులు ఆడిన స్టోక్స్ ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు సహాయంతో 70 పరుగులు చేశాడు. టెయిలెండర్లలో టామ్ హార్టిలీ 24 బంతుల్లో 23 పరుగులు, చేయగా, మార్క్ వుడ్ 24 బంతుల్లో 11 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో ఫోక్స్ 4(24), రెహన్ అహ్మద్ 13(18), జాక్ లీచ్ 0(3) డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో బుమ్రా రెండు, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, అశ్విన్ మూడేసి వికెట్లు తీసి సత్తా చాటారు.
అదరగొట్టిన భారత్.. భారీ ఆధిక్యం
తొలి ఇన్సింగ్‌లో భారత్ బ్యాటర్లు అదరగొట్టడంతో భారీ ఆధిక్యం లభిచింది. తొలి ఇన్సింగ్‌లో 121 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన భారత ఆటగాళ్లు 436 పరుగులకు ఆలౌట్ అయ్యారు. బ్యాటర్లు రాణించడంతో తొలి ఇన్సింగ్‌లో భారత్‌కు 190 పరుగులు ఆధిక్యం లభించింది. దీంతో భారత్ తొలి టెస్టులో విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించడంతో ఆ జట్టు మెరుగైన స్కోరు సాధించింది. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్ విజంభణతో ఒకానొక దశలో ఇంగ్లాండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమవుతుందని భావించారు. అయితే, ఆ జట్టు ఆటగాడు ఒల్లీ పోప్ పట్టువదలని విక్రమార్కుడిలా భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించిపెట్టాడు. రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రావ్లే 31(33), డకెట్ 47(52) పరుగులు చేయగా, ఆ తరువాత వచ్చిన ఒల్లీ పోప్ 278 బంతుల్లో 21 ఫోర్లు సహాయంతో 196 పరుగులు చేసి తుది వరకు నిలిచి జట్టు మెరుగైన స్కోర్ చేసేందుకు దోహదం చేశాడు. జట్టులోని మిగిలిన ఆటగాళ్లు రూట్ 2(6), బెయిర్ స్టో 10(24), కెప్టెన్ స్టోక్స్ 6(33) పరుగులకే పరిమితమయ్యారు. వికెట్ కీపర్ ఫోక్స్ 81 బంతుల్లో 34 పరుగులు, రెహాన్ అహ్మద్ 53 బంతుల్లో 28 పరుగులు, టామ్ హార్టిలీ 52 బంతుల్లో 34 పరుగులు చేసి పోప్‌కు సహకారాన్ని అందించారు. వీరి సహాయంతో పోప్ జట్టు పోరాడగలిగే పరుగులను సాధించగలిగింది. ఆ తరువాత వచ్చిన మార్ వుడ్ 0(7) డకౌట్ కావడంతో 420 పరుగులకు రెండో ఇన్సింగ్‌ను ఇంగ్లాండ్ జట్టు ముగించింది.
చేతులెత్తేసిన భారత్ బ్యాటర్లు..
తొలి ఇన్సింగ్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన భారత ఆటగాళ్లు రెండో ఇన్సింగ్స్‌లో పూర్తిగా విఫలమయ్యారు. స్వల్ప స్కోరుకు కీలక ఆటగాళ్లు పరిమితం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ 58 బంతుల్లో ఏడు ఫోర్లు సహాయంతో 39 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ విఫలమయ్యారు. 35 బంతులు ఆడి 15 పరుగులు మాత్రమే చేశాడు. సుబ్ మన్ గిల్ 0(2) డకౌట్ కాగా, కేఎల్ రాహుల్ 22(4‘8), అక్షర్ పటేల్ 17(42), శ్రేయాస్ అయ్యర్ 13(31), రవీంద్ర జడేజా 2(20) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆ తరువాత వచ్చిన వికెట్ కీపర్ శ్రీఖర్ భరత్ 28(59), రవిచంద్రన్ అశ్విన్ 28(84) పరుగులు చేసి జట్టును విజయ తీరాలవైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వీరిద్దరూ ఒకే పరుగు వ్యవధిలో వికెట్లను సమర్పించుకోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆ తరువాత వచ్చిన బుమ్రా 6(18), మహ్మద్ సిరాజ్ 12(20) పోరాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్టిలీ ఏడు వికెట్ల తీసి భారత్ జట్టు వెన్నుముక విరిచాడు. జో రూట్, జాక్ లీచ్ ఒక్కో వికెట్ తీశారు. ఇంగ్లాండ్ విజయంలో బౌలర్ టామ్ హార్టిలీ ఏడు వికెట్లతో కీలక పాత్ర పోషించగా, రెండో ఇన్సింగ్స్‌లో 196 పరుగులు చేసి జట్టు పోరాడేలా చేసిన ఒల్లీ పోప్ ముఖ్య భూమిక పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా పోప్ ఎంపికయ్యాడు. తొలి ఇన్సింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించినప్పటికీ ఓటమిపాలైన జట్టుగా భారత్ నిలిచింది. గతంలో 2015లో 192 పరుగులు మొదటి ఇన్సింగ్ ఆధిక్యం ఉన్నప్పటికీ శ్రీలంకతో ఓటమిపాలైన భారత్ మళ్లీ.. తొమ్మిదేళ్ల తరువాత అటువంటి పరాజయాన్ని మూటగట్టుకుంది.