ENG vs SL Match Highlights: ఇంగ్లండ్ సెమీస్ ఆశలు గల్లంతే! లంక చేతిలో బ్రిటీష్ జట్టు ఘోర ఓటమి
ENG vs SL ODI World Cup 2023: ప్రపంచకప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ చతికిలపడింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
![ENG vs SL Match Highlights: ఇంగ్లండ్ సెమీస్ ఆశలు గల్లంతే! లంక చేతిలో బ్రిటీష్ జట్టు ఘోర ఓటమి ENG vs SL ODI World Cup 2023 Match Highlights Oct 26 Sri Lanka Won By 8 Wickets Against England Chinnaswamy Stadium ENG vs SL Match Highlights: ఇంగ్లండ్ సెమీస్ ఆశలు గల్లంతే! లంక చేతిలో బ్రిటీష్ జట్టు ఘోర ఓటమి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/5e65a97f41960806e41e6da1fd1a373f1698328403691872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రపంచకప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ చతికిలపడింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. లంక బౌలర్ల ధాటికి కేవలం 156 పరుగులకే బ్రిటీష్ జట్టు కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లు సమష్టిగా రాణించడంతో 33.5 ఓవర్లలో కేవలం 156 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో 25.4 ఓవర్లలోనే కేవలం రెండువికెట్లే కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్ ఆశలను కూల్చేసింది. సధీర సమర విక్రమ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా....నిసంక మిగిలిన పనిని పూర్తి చేసి లంకకు కీలక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో లంక సెమీస్ ఆశలు సజీవంగా ఉండగా ఇంగ్లండ్ ద్వారాలు మాత్రం దాదాపుగా మూసుకుపోయాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బ్రిటీష్ బ్యాట్స్‌మెన్లను... లంక బౌలర్లు క్రీజులో కుదురుకోనివ్వలేదు. ఆరంభంలో శుభారంభం లభించినా ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. తొలి వికెట్‌కు జానీ బెయిర్ స్టో- డేవిడ్ మలన్ 45 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని విడదీసిన మాథ్యూస్ ఇంగ్లండ్ పతనాన్ని ప్రారంభించాడు. 25 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసిన డేవిడ్ మలన్‌ను మాధ్యూస్ అవుట్ చేశాడు. ఇక అప్పటినుంచి బ్రిటీష్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జో రూట్ కేవలం 3 పరుగులకే రనౌట్ అవ్వడంతో 57 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వికెట్ల పతనం కాసేపు ఆగింది. గత ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ జట్టును మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ 31 బంతుల్లో 3 ఫోర్లతో క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించిన జానీ బెయిర్ స్టోను రజిత అవుట్ చేశాడు. దీంతో 68 పరుగుల వద్ద బ్రిటీష్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది.
68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను లాహిరో కుమారా కోలుకోలేని దెబ్బకొట్టాడు. మొదటి ఎనిమిది పరుగులు చేసిన జోస్ బట్లర్‌ను అవుట్ చేసిన లాహిరో కుమారా..ఆ తర్వాత ఒక్క పరుగే చేసిన లివింగ్‌స్టోన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 68 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పర్వాలేదనిపించే స్థితిలో ఉన్న బ్రిటీష్ జట్టు ఒక్కసారిగా 85 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
స్టోక్స్ పోరాడుదాం అనుకున్నా...
ఆ తర్వాత మొయిన్ అలీతో కలిసి బెన్ స్టోక్స్ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఇన్నింగ్స్ గాడిన పడుతున్న సమయంలో 15 బంతుల్లో 15 పరుగులు చేసిన మొయిన్ అలీని మాధ్యూస్ అవుట్ చేశాడు. అనంతరం క్రిస్ వోక్స్ రజిత బౌలింగ్ డకౌట్ అవుటయ్యాడు. ఆదుకుంటాడని గంపెడు ఆశలు పెట్టుకున్న బెన్ స్టోక్స్‌ను కుమారా అవుట్ చేశాడు. 73 బంతుల్లో 6 ఫోర్లతో 43 పరుగులు చేసిన స్టోక్స్ కుమారా బౌలింగ్‌లో హేమంతకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 137 పరుగులకు బ్రిటీష్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. తర్వాత అదిల్ రషీద్, మార్క్ వుడ్ స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో కేవలం ఒకే ఒక్క సిక్స్ కొట్టగా అది కూడా డేవిడ్ లిల్లినే కొట్టాడు. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు బ్రిటీష్ జట్టు తీవ్రంగా తడబడింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం అర్ధ శతకం కూడా చేయలేదు. అయిదుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. లంక బౌలర్లు సమష్టిగా రాణించారు. లాహీరో కుమారా 7 ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు నెలకూల్చాడు. కాసున్ రజిత 2, ఏంజెలో మాధ్యూస్ 2, తీక్షణ ఒక వికెట్ తీశారు.
ఆడుతూ.. పాడుతూ...
అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. తొమ్మిది పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది అనిపించింది. కానీ పాథుమ్ నిసంక, సధీర సమరవిక్రమ ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు. నిసంక 83 బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్సులతో 77 పరుగులు చేయగా.... సధీర సమరవిక్రమ 54 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో 65 పరుగులు చేసి మరో వికెట్ పడకుండా లంకకు అవసరమైన విజయాన్ని అందించారు. లంక కోల్పోయిన రెండు వికెట్లను డేవిడ్ విల్లీనే తీశాడు. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో నాకౌట్‌కు చేరాలన్న ఇంగ్లండ్ ఆశలు దాదాపుగా తెరపడింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)