Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో తెలుగు తేజం దూకుడు, రెండో సెంచరీకి అడుగు దూరంలో రికీ భుయ్
Duleep Trophy Highlights | రికీ భుయ్ మరో పది పరుగులు చేస్తే టోర్నీలో రెండో సెంచరీ పూర్తవుతుంది. ఇండియా డీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇండియా బీ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం హాఫ్ సెంచరీ చేశాడు.
అనంతపురం: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో 3వ రోజు తెలుగు తేజం రికీ భుయ్ దూకుడు కొనసాగిస్తున్నాడు. మరో పది పరుగులు చేస్తే టోర్నీలో రెండో సెంచరీ పూర్తి చేసుకోనున్నాడు. ఇండియా– డీ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ చేశాడు. ఇండియా– బీ జట్టులో ఆల్‌రౌండ్ వాషింగ్‌టన్ సుందర్ అర్ధ సెంచరీ చేశాడు. ఇండియా– సీతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా– ఏ జట్టు క్రీడాకారులు రియాన్ పరాగ్, శాశ్వత్‌రావత్ అర్ధ సెంచరీలతో రాణించారు.
రికీ భుయ్ మెరుపు ఇన్నింగ్స్ :
ఇండియా డీ 244/5:*
ఇండియా డీ జట్టు క్రీడాకారుడు రిక్కీభుయ్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆంధ్ర కుర్రాడు చూడచక్కని షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. కేవలం 87 బంతుల్లో 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సహాయంతో 90 పరుగులతో నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నాడు. రిక్కీ భుయీకి తోడుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 (7 ఫోర్లు, ఒక సిక్సర్), సంజు సామ్సన్ 45 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. దేవదత్ పడిక్కిల్ 3, శ్రీకర్ భరత్ 2 పరుగులతో నిరాశపరిచ్చారు. దీంతో ఆటముగిసే సమయానికి ఇండియా– డీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది.
ఇండియా– బీ బౌలర్లు ముకేష్ కుమార్ 3, నవదీప్‌శైనీ 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు ఉదయం ఓవర్‌నైట్ స్కోర్ 210/6తో ప్రారంభించిన ఇండియా– బీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో వాషింగ్‌టన్ సుందర్ 82 (7 ఫోర్లు, ఒక సిక్సర్) పరుగులు చేశాడు. ఇండియా– డీ జట్టు బౌలర్లలో సౌరభ్‌కుమార్ 5, అర్ష్‌దీప్ సింగ్ 3, ఆదిత్యథాక్‌రే 2 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇండియా– డీ జట్టు 311 పరుగుల ఆధిక్యతతో ఉంది.
ఇండియా– ఏ 270/6:*
ఇండియా ఏ క్రీడాకారులు రియాన్ పరాగ్, శాశ్వత్ రావత్ అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. రియాన్ పరాగ్ 101 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 73, శాశ్వత్ రావత్ 67 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 53 పరుగులు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 34, కుమార్ కుషగ్ర 40 పరుగులు చేశారు. ఇండియా ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. ఇండియా సీ జట్టు బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, గౌరవ్‌కుమార్, మనవ్ సుతార్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు ఇండియా సీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓవౖర్‌నైట్ స్కోర్ 216/7తో ప్రారంభించిన 71 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అభిషేక్ పోరెల్ 82 పరుగులు చేశాడు. ఇండియా ఏ బౌలర్లు అవేష్‌ఖాన్, అకీబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం ఇండియా ఏ జట్టు 333 పరుగుల ఆధిక్యంలో ఉంది.