Sagar Dhankar Murder Case: సుశీల్ ఇక జైలుకే! సాగర్ హత్యకేసులో తీవ్ర అభియోగాలు నమోదు
Sagar Dhankar murder case: ఒలింపిక్ పతక విజేత, రెజ్లింగ్ ఆటగాడు సుశీల్ కుమార్ కథ ముగిసినట్టే! దిల్లీ కోర్టు అతడు సహా 17 మందిపై తీవ్ర అభియోగాలు నమోదు చేసింది.
Sagar Dhankar Murder Case: ఒలింపిక్ పతక విజేత, రెజ్లింగ్ ఆటగాడు సుశీల్ కుమార్ కథ ముగిసినట్టే! దిల్లీ కోర్టు అతడు సహా 17 మందిపై తీవ్ర అభియోగాలు నమోదు చేసింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కడ్ హత్య కేసులో హత్యానేరం, హత్య చేసేందుకు ప్రయత్నించడం, దోపిడీ, చట్ట విరుద్ధంగా గుమిగూడటం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్లు నమోదు చేసింది. అంతేకాకుండా పారిపోయిన మరో ఇద్దరిపైనా అభియోగాలు మోపింది.
సరిగ్గా ఏడాది క్రితం దిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కడ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సుశీల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గుంపు దాడిలో సాగర్‌ను హాకీ కర్రలు, ఇతర ఆయుధాలతో చితకబాదిన తర్వాత సుశీల్ తప్పించుకొని పారిపోయాడు. దాదాపుగా మూడు వారాల పాటు అతడు దొరకలేదు. దాంతో పోలీసులు వేర్వేరు బృందాలుగా విడిపోయి చాలా రాష్ట్రాల్లో గాలించారు.
గతేడాది మే 4న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో సాగర్‌తో పాటు అతడి మిత్రులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సాగర్ సైతం చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో సుశీల్ కుమారే ప్రధాన నిందితుడని దిల్లీ పోలీసులు స్టేటస్ రిపోర్టులో తెలిపారు. సహ నిందితుడితో కలిసి అతడే ఆయుధాలు, మనుషులను ఏర్పాటు చేశాడని పేర్కొన్నారు. హరియాణా నుంచి కొందరు క్రిమినల్స్‌ను తీసుకొచ్చి బాధితుడిని కిడ్నాప్ చేశారని వెల్లడించారు.
అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మే 14న సుశీల్ కుమార్ దిల్లీ రోహిణీ కోర్టును సంప్రదించాడు. పక్షపాత ధోరణితో తనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారని పేర్కొన్నాడు. తాను ఎవరినీ గాయపర్చలేదని వెల్లడించాడు. కానీ కోర్టు అతడి విజ్ఞప్తిని తోసి పుచ్చింది. ప్రధాన నిందితుడిగా చేర్చింది. సుశీల్ కుమార్ రెజ్లింగ్‌లో దేశానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు.
A Delhi Court frames charges u/s of murder, attempt to murder, rioting, unlawful assembly & other sections incl criminal conspiracy against Olympian Sushil Kumar & 17 others in junior wrestler Sagar Dhankar murder case. Court has also framed charges against 2 absconding accused. pic.twitter.com/xhOuiaIWJ8
— ANI (@ANI) October 12, 2022