Ind Vs Eng 2nd Test Updates: రెండో టెస్టులో ఆ మార్పులు చేయండి.. బర్మింగ్ హామ్ వికెట్ కు అందుకు ఫేమస్.. మాజీ క్రికెటర్ సూచన
బర్మింగ్ హామ్ వికెట్ ట్రెడిషనల్ గా బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది.టాప్, మిడిలార్డర్లో స్పెషలిస్టు బ్యాటర్లు ఉండటంతో అదనపు బౌలర్ ను తీసుకోవాలని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దాస్ గుప్తా సూచించాడు.

Deep Dasgupta Comments: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. శుభమాన్ గిల్ నూతన కెప్టెన్సీని ఓటమితో ఆరంభించాడు. అయితే రెండో టెస్టులో పలు రకాలా మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈక్రమంలో రెండో టెస్టులో టీమ్ కాంబినేషన్ గురించి భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో కనీసం రెండు మార్పులు చేయాలని సూచించాడు. ముఖ్యంగా గత మ్యాచ్ లో విఫలమైన సాయి సుదర్శన్ స్థానంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించాలని సూచించాడు. నిజానికి గత మ్యాచ్ లో సాయి నెం.3లో బ్యాటింగ్ చేసి ఘోరంగా విఫలమయ్యాడు. డకౌట్ తోపాటు 30 పరుగులతో ఉస్సూరుమనిపించాడు. దీంతో ఈ మ్యాచ్ లో అతడిని తప్పించి, నెం.3లో కరుణ్ నాయర్ ఆడించాలని సూచించాడు.
రెండు విధాలుగా..
ఇక ఆరో స్థానంలో నితీశ్ ని ఆడిస్తే బ్యాటింగ్ బలం పెరగడంతోపాటు మరో సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ దొరుకుతాడాని, తను కొద్ది ఓవర్లు బౌలింగ్ చేయగలడని దాస్ గుప్తా సూచించాడు. ఇక కరుణ్ నాయర్ నెం.3లో బాగా ఆడతాడని, గతంలో మంచి ప్రదర్శన చేయడంతోపాటు ఇటీవల ఇంగ్లాండ్ లోనే జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో తను నెం.3లోనే బ్యాటింగ్ చేసి రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు. భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన ఇద్దరు ప్లేయర్లలో కరుణ్ ఒకరు. గతంలో ఇంగ్లాండ్ పైనే తను ట్రిపుల్ సెంచరీ బాదాడు. అప్పుడు నెం.3లోనే ట్రిపుల్ సెంచరీని తను సాధించాడు. దేశవాళీల్లోనూ తను టాపార్డర్ లోనే బ్యాటింగ్ చేసి, టన్నుల కొద్ది పరుగులు సాధించాడు. ఇక బర్మింగ్ హామ్ లో జరిగే రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ ను ఆడించాలని సూచించాడు. తను నెం.8లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాడని తెలిపాడు.
బ్యాటింగ్ వికెట్..
ఇక ట్రెడిషనల్ గా బర్మింగ్ హామ్ వికెట్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని, ఈ క్రమంలో నెం.8లో కుల్దీప్ ను ఆడించొచ్చని తెలిపాడు. తొలి ఐదుగురు నికార్సయిన బ్యాటర్లు కావడంతోపాటు పిచ్ కూడా బ్యాటింగ్ కు అనుకూలించడంతో కుల్దీప్ ను నెం.8లో ఆడించొచ్చని పేర్కొన్నాడు. కుల్దీప్ ను ఆడించినట్లయితే రవీంద్ర జడేజాను పక్కన పెట్టే అవకాశాలున్నాయి. తను తొలి టెస్టులో విఫలమయ్యాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే తాజాగా తను ట్రైనింగ్ సెషన్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో తన ఆడటంపై ఊహగానాలు చెలరేగుతున్నాయి. జట్టు పరిస్థితిని బట్టి, తను రెండో టెస్టులో ఆడితేనే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. ఇక ఇంగ్లాండ్ తో ప్రారంభమైన ఐదు టెస్టుల ఈ సిరీస్ లో తొలి టెస్టు ఓడిన భారత్ 0-1తో వెనుకంజలో నిలిచింది. దీంతో రెండో టెస్టులో గెలిచి, ఎలాగైన సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. అలాగే కెప్టెన్ శుభమాన్ గిల్, కోచ్ గౌతం గంభీర్ లకు కూడా రెండో టెస్టులో గెలుపు తప్పనిసరి అని భావిస్తున్నారు.




















