Ruturaj Gaikwad: కెప్టెన్‌గా చేసినందుకు థ్యాంక్స్ - మా కల అదే : రుతురాజ్ గైక్వాడ్
ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో జరగాల్సి ఉన్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్‌ను సారథిగా నియమించిన విషయం తెలిసిందే.
Ruturaj Gaikwad: ఆసియా క్రీడల్లో పాల్గొనబోయే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఇటీవలే వెల్లడించగా.. ఈ జట్టుకు టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ సారథిగా వ్యవహరించనున్నాడు. ప్రధాన జట్టు వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో ఉండే నేపథ్యంలో ఐపీఎల్‌తో పాటు దేశవాళీలో అదరగొడుతున్న ఆటగాళ్లను బీసీసీఐ.. హాంగ్జౌ (చైనా)కు పంపనుంది. కాగా తనకు సారథ్య పగ్గాలు అప్పజెప్పడంపై రుతురాజ్ స్పందించాడు. తనను సారథిగా నియమించినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన రుతురాజ్.. ఆసియా కప్‌లో స్వర్ణం నెగ్గడమే తమ లక్ష్యమని వెల్లడించాడు.
కెప్టెన్‌గా నియమితుడయ్యాక రుతురాజ్ మాట్లాడుతూ.. ‘ఇంత గొప్ప అవకాశమిచ్చిన బీసీసీఐకి, టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లకు కృతజ్ఞతలు. భారత జట్టుకు ఆడటం ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది. అదీగాక ఇలాంటి బిగ్ ఈవెంట్స్‌లో నాతో పాటు టీమ్‌లోని ఇతర మెంబర్స్‌కు కూడా ఇదొక గొప్ప అవకాశం. మేమందరమూ యువ ఆటగాళ్లం. గత ఏడాది, రెండేండ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్నాం. ఇండియా ‘ఏ’తో పాటు కొంతమంది భారత జట్టు తరఫున కూడా ఆడాం...
ఆసియా క్రీడలలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం, దేశం కోసం పతకం గెలవడం అనేది జట్టులో భాగమైన ప్రతి ఒక్కరికీ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుందని నేను భావిస్తున్నా. మా అందరి కల భారత్‌ను విజేతగా నిలబెట్టడమే. స్వర్ణ పతకం గెలిచి పోడియం వద్ద జాతీయ గీతం వినిపించేలా చేయడమే మాకు ముందున్న లక్ష్యం. గతంలో ఇలాంటి ఈవెంట్లను టీవీలలో చూసేవాడిని. ఇండియాకు ఆడుతూ అథ్లెట్లు పతకాలు తీసుకురావడం గొప్ప అనుభూతిని కలిగించేది. ఇప్పుడు ఆ అవకాశం మాకు వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుని పతకం తీసుకొస్తే దానికంటే ప్రత్యేకమైన అనుభూతి మరోటి ఉండదు..’అని తెలిపాడు. బీసీసీఐ ట్విటర్‌లో రుతురాజ్ వీడియోను పోస్ట్ చేసింది.
🗣️ “𝑻𝒉𝒆 𝒅𝒓𝒆𝒂𝒎 𝒘𝒐𝒖𝒍𝒅 𝒃𝒆 𝒕𝒐 𝒘𝒊𝒏 𝒕𝒉𝒆 𝒈𝒐𝒍𝒅 𝒎𝒆𝒅𝒂𝒍, 𝒔𝒕𝒂𝒏𝒅 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒑𝒐𝒅𝒊𝒖𝒎 𝒂𝒏𝒅 𝒔𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒏𝒂𝒕𝒊𝒐𝒏𝒂𝒍 𝒂𝒏𝒕𝒉𝒆𝒎 𝒇𝒐𝒓 𝒕𝒉𝒆 𝒄𝒐𝒖𝒏𝒕𝒓𝒚”
— BCCI (@BCCI) July 15, 2023
A happy and proud @Ruutu1331 is excited to lead #TeamIndia at the #AsianGames 😃 pic.twitter.com/iPZfVU2XW8
రుతురాజ్ ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం అతడు ఎంపికైనా తొలి టెస్టులో మత్రం రుతురాజ్‌కు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక ఆసియా క్రీడల విషయానికొస్తే సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ జరుగబోయే ఈ మెగా ఈవెంట్‌లో క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు జరుగుతాయి. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ టీమ్‌లో జితేశ్ శర్మ, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబేలతో పాటు ప్రభ్‌సిమ్రన్ సింగ్, తిలక్ వర్మ, సాయి కిషోర్ లకు సెలక్టర్లు చోటు కల్పించారు.
ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్టు : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రన్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్స్ : యష్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial