Border Gavaskar Trophy: భారత్- ఆస్ట్రేలియా రెండో టెస్ట్- పలు రికార్డులకు వేదిక కానున్న ఫిరోజ్ షా మైదానం!
Border Gavaskar Trophy: రేపు ఢిల్లీ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అలాగే ఈ మ్యాచ్ ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులకు వేదిక కానుంది. మరి ఆ రికార్డులేంటో చూసేద్దామా..
Border Gavaskar Trophy: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఆతిథ్య ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తుచేసింది. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ కు చాలా సానుకూలాంశాలు కనిపించాయి. దాదాపు 6 నెలలు ఆటకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. మ్యాచ్ లో మొత్తం 7 వికెట్లు తీయటంతోపాటు బ్యాట్ (70) తో విలువైన పరుగులు చేశాడు. అలాగే అశ్విన్ సత్తా చాటాడు. అక్షర్ పటేల్ (84) ఆకట్టుకున్నాడు. స్పిన్ కు సహకరించిన పిచ్ పై కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ (120)తో అదరగొట్టాడు. దీంతో ఆసీస్ కు ఓటమి తప్పలేదు.
ఇప్పుడిక ఇరు జట్లు రెండో టెస్టుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపట్నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. దీంట్లోనూ గెలిచి ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ చూస్తుంటే.. మరోవైపు ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. అయితే ఆతిథ్య జట్టుకు అదంత సులభం కాదు. ఎందుకంటే రికార్డులు అలా ఉన్నాయి. 1959 తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఢిల్లీలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. అంటే ఆసీస్ ఇక్కడ టెస్ట్ గెలిచి దాదాపు 63 ఏళ్లవుతోంది. అలానే ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. కొందరు ఆటగాళ్లు కొన్ని వ్యక్తిగత మైలురాళ్లకు అడుగు దూరంలో ఉన్నారు. మరి రికార్డులు సృష్టించే అంశాలేంటే చూసేద్దామా..
UNPLAYABLE delivery by Ravindra Jadeja to get rid of Steve Smith 🔥🇮🇳 #IndvsAus pic.twitter.com/IbNAL9efMg
— Sushant Mehta (@SushantNMehta) February 9, 2023
- రవీంద్ర జడేజా (61 టెస్టులు) ఇంకొక్క వికెట్ తీస్తే టెస్ట్ క్రికెట్ లో 250 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. అశ్విన్ (45), అనిల్ కుంబ్లే (55), బిషన్ సింగ్ బేడీ (60), హర్భజన్ సింగ్ (61) తర్వాత ఈ మైలురాయిని అందుకున్న 5వ భారత క్రికెటర్ గా నిలుస్తాడు.
- అక్షర్ పటేల్ (10 టెస్టులు) మరో 2 వికెట్లు సాధిస్తే టెస్టుల్లో 50 వికెట్లను చేరుకుంటాడు. అశ్విన్ (9 టెస్టులు) తర్వాత ఈ మార్కును అత్యంత వేగంగా అందుకున్న రెండో భారత బౌలర్ గా నిలుస్తాడు.
- ఆస్ట్రేలియాపై కుంబ్లే తర్వాత 100 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా నిలవడానికి అశ్విన్‌కు 3 వికెట్లు అవసరం.
- మరోసారి 5 వికెట్ల హాల్ సాధిస్తే అశ్విన్ స్వదేశంలో కుంబ్లే 25 ఫిఫర్ ల రికార్డును బద్దలు కొట్టవచ్చు.
- ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఇంకో 5 వికెట్లు తీస్తే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 100 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరిస్తాడు. అతని సహచరులెవరూ అతని దరిదాపుల్లో లేరు.
- ఏబీ డివీలియర్స్ (8765), వీవీఎస్ లక్ష్మణ్ (8781) లను అధిగమించడానికి స్టీవ్ స్మిత్ కు 73 పరుగులు అవసరం.
- ఛతేశ్వర్ పుజారా ఈ మ్యాచ్ తో తన వందో టెస్ట్ ఆడబోతున్నాడు. అతని కన్నా ముందు 12 మంది భారత ఆటగాళ్లు ఈ మార్కును చేరుకున్నారు. ప్రస్తుత జట్టులో విరాట్ కోహ్లీ మాత్రమే పుజారా కన్నా ముందున్నాడు.
- పుజారా మరో 100 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాపై 2వేల పరుగులు చేసిన 4వ భారత ఆటగాడిగా నిలుస్తాడు.
Brilliant @ashwinravi99 deception and control #INDvsAUS pic.twitter.com/ZhA7O67q6F
— simon hughes (@theanalyst) February 9, 2023