Manoj Tiwary Retirement: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మనోజ్ తివారి - కారణమిదే!
వెస్ట్ బెంగాల్ క్రీడా మంత్రి, బెంగాల్ రంజీ జట్టు సారథి మనోజ్ తివారి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
Manoj Tiwary Retirement: ఆరు రోజుల క్రితం రిటైర్మెంట్ ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన బెంగాల్ క్రీడా శాఖ మంత్రి, ఆ జట్టు రంజీ కెప్టెన్ మనోజ్ తివారి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. బెంగాల్ జట్టుకు రంజీ ట్రోఫీ అందించడం తన కల అని దానిని ఎలాగైనా వచ్చే ఏడాది సాధించి తీరుతానని ఆ తర్వాత మళ్లీ రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశీశ్ గంగూలీ (సౌరవ్ గంగూలీ సోదరుడు) చేసిన విజ్ఞప్తి మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నానని తెలిపాడు.
మంగళవారం ఈడెన్ గార్డెన్‌లో స్నేహశీశ్‌తో కలిసి మనోజ్ తివారి విలేకరులతో మాట్లాడుతూ .. ‘రాజ్ దా (స్నేహశీశ్) నన్ను కన్విన్స్ చేశాడు. రంజీ ట్రోఫీలో మరో ఏడాది ఆడాలని కోరాడు. అందుకే నేను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే రంజీ సీజన్‌లో బెంగాల్‌కు ఆడతా. కానీ ఆ తర్వాత మాత్రం రిటైర్మెంట్ వెనక్కి తీసుకోను..’ అని చెప్పాడు.
నా భార్యను అడిగా..
తాను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడంపై తన భార్యాను సలహాలు అడిగానని, ఆమె కూడా అందుకు సమ్మతం తెలపడం కూడా తనను మళ్లీ క్రికెట్ ఆడే విధంగా ప్రోత్సహించిందని తివారి తెలిపాడు. ‘నేను రిటైర్మెంట్ తర్వాత నా భార్యతో చర్చించా. తాను కూడా నేను మరో సీజన్ ఆడేందుకు మోటివేట్ చేసింది. గతేడాది బెంగాల్ జట్టుకు రంజీ చేరగా దానికి నేనే సారథ్యం వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ మరో ఏడాది ఆడమని చెప్పింది. నేను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాలా మంది అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నన్ను రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కోరుతూ మెసేజ్‌లు పెట్టారు..’ అని తెలిపాడు.
బెంగాల్ క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని.. అటువంటి క్యాబ్ కోసం తాను ఒక్క ఏడాదిని ఇవ్వడం పెద్ద విషయమే కాదని తివారి వ్యాఖ్యానించాడు. బెంగాల్ తరఫున తాను మరో ఏడాది ఆడి ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని, అప్పుడు మాత్రం యూటర్న్ ఉండదని అన్నాడు.
VIDEO | Cricketer Manoj Tiwary reverses retirement decision. "I will play for another year, will play Ranji Trophy next year and then retire," says Manoj Tiwary. pic.twitter.com/ksEXPNYbUr
— Press Trust of India (@PTI_News) August 8, 2023
బెంగాల్ జట్టు చివరిసారిగా 1989-90లో రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆ తర్వాత మూడు దశాబ్దాలలో ఆ జట్టు నాలుగు సార్లు ఫైనల్‌కు చేరినా కప్ కొట్టలేకపోయింది. 2005-06, 2006-07, 2019-20, 2022-23 సీజన్లలో ఆ జట్టు ఫైనల్‌లో భంగపడ్డది. గత సీజన్‌లో బెంగాల్.. సౌరాష్ట్ర చేతిలో ఓడింది. 2004లో బెంగాల్ రంజీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తివారి.. భారత్ తరఫున 2008 నుంచి 2015 వరకూ 12 వన్దేలు, 3 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించకపోయినా తివారీ దేశవాళీలో మాత్రం టాప్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. బెంగాల్ తరఫున రంజీలు ఆడిన తివారి.. 141 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 9,908 పరుగులు సాధించాడు. 169 లిస్ట్ - ఎ గేమ్స్‌లో 5,581 రన్స్ చేశాడు. 183 టీ20లలో 3,436 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో తివారీ ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial