Ind vs eng 5Th Test Updates: బెన్‌స్టోక్‌కు గాయం? 5వ టెస్టుకు దూరం కానున్నాడా? ఇంగ్లాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తప్పదా?
ఈ సిరీస్ లో ఆల్ రౌండర్ గా స్టోక్స్ విశేషంగా రాణిస్తున్నాడు. వరుసగా రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. ఐదో టెస్టుకు తను ఆడటం కాస్త డౌట్ ఫుల్ గా మారింది.

Is Ben Stokes Injured..?: ఇండియాతో ఈనెల 31 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టుకు ఇంగ్లాండ్ కి ఎదురు దెబ్బ తగిలే అవకాశముంది. ఆ జట్టు కెప్టెన్ కమ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశముంది. నిజానికి నాలుగో టెస్టు నాలుగో ఇన్నింగ్స్ లో కేవలం 11 ఓవర్లు మాత్రమే తను బౌలింగ్ చేశాడు. కుడిచేతి భుజం గాయం కారణంగా తను ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. నాలుగో రోజు అస్సలు బౌలింగ్ చేయని స్టోక్స్.. ఐదో రోజు మాత్రం 11 ఓవర్లు బౌలింగ్ చేసి, కీలకమైన కేఎల్ రాహుల్ వికెట్ తీశాడు. ఆ తర్వాత మళ్లీ ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తర్వాత టెస్టులో తను ఆడబోయే విషయంపై నర్మగర్భంగా చెప్పాడు. ముఖ్యంగా నాలుగో టెస్టులో తాను చాలా అలసి పోయినట్లు పేర్కొన్నాడు. బ్యాటర్ గా 140 పరుగుల భారీ స్కోరు చేయడంతోపాటు, చాలా ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీశాడు. దీంతో మైదానంలో ఎక్కువ సేపు గడిపి, అలసిపోయినట్లు తెలిపాడు.
వరుసగా రెండోసారి..
ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును స్టోక్స్ దక్కించుకున్నాడు. జో రూట్, శుభమాన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు సెంచరీలు చేసినప్పటికీ, స్టోక్స్ ఆల్ రౌండ్ ప్రతిభతో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. మూడో టెస్టులోనూ తనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ తరపున 12 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను తను దక్కించుకున్నట్లయింది. దీంతో జో రూట్ (13) తర్వాత అత్యధిక సార్లు ఈ పురస్కారాన్ని దక్కించుకున్న ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక టెస్టుల్లో ఎప్పుడూ ఇంగ్లాండ్ పాటించే ఆనవాయితీకి ఈసారి బ్రేక్ పడే అవకాశముంది.
ఈసారి లేటుగా..
ఈ సిరీస్ ను గమనించినట్లయితే, తమ ప్లేయింగ్ లెవన్ ను మ్యాచ్ కు దాదాపు రెండు రోజుల ముందుగా ఇంగ్లీష్ జట్టు ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఐదో టెస్టులో ఈ సంప్రదాయానికి బ్రేక్ పడే అవకాశముంది. నాలుగో టెస్టులో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడం, ఆ తర్వాత సుదీర్ఘంగా ఫీల్డింగ్, బౌలింగ్ చేయడంతో జట్టు ఆటగాళ్లు అంతా అలిసి పోయారు. వీరిలో ఎవరు చివరి టెస్టుకు అందుబాటులో ఉంటారో.. అనే దానిపై మీమంస నెలకొంది. స్టోక్స్ కూడా అనుమానమే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు కోలుకునేందుకు సమయమిచ్చి, ఆ తర్వాత తుది జట్టు కూర్పు చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. దీంతో ఐదో టెస్టు టాస్ టైంలోనే జట్టు వివరాలు వెల్లడి కావచ్చని తెలుస్తోంది. ఇక ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్ లో ముగిసిన నాలుగో టెస్టు డ్రా అయిన సంగతి తెలిసిందే. దీంతో ఐదో టెస్టులో సమరోత్సాహంతో బరిలోకి దిగి ఆ టెస్టులో గెలుపొంది, సిరీస్ ను 2-2తో సమం చేయాలని టీమిండియా భావిస్తోంది.




















