BCCI New Selection Committee: వేటు వేసిన చేతన్ శర్మకే మళ్లీ పగ్గాలు! టీమ్‌ఇండియా సెలక్షన్ కమిటీ రెడీ!
BCCI New Selection Committee: టీమ్‌ఇండియా సరికొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక దాదాపుగా పూర్తైంది! బీసీసీఐ ఎంపిక చేసిన క్రికెట్ పాలకుల కమిటీ ఏడుగురు సభ్యులను ఎంపిక చేసినట్టు తెలిసింది.
BCCI New Selection Committee:
టీమ్‌ఇండియా సరికొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక దాదాపుగా పూర్తైంది! బీసీసీఐ ఎంపిక చేసిన క్రికెట్ పాలకుల కమిటీ ఏడుగురు సభ్యులను ఎంపిక చేసినట్టు తెలిసింది. టీ20 ఓటమి తర్వాత ఉద్వాసన పలికిన చేతన్ శర్మకే తిరిగి పగ్గాలు అప్పగిస్తున్నారని సమాచారం.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఎంపిక సరిగ్గా లేదని, దూకుడైన ఆటగాళ్లను తీసుకోవడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. దాంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్‌తో క్రికెట్ సలహాదారుల కమిటీని నియమించింది. సెలక్టర్ల ఎంపిక బాధ్యతను అప్పగించింది. కొందరు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన కమిటీ ఏడుగురు సభ్యులను ఎంపిక చేశారని తెలిసింది. చీఫ్ సెలక్టర్‌గా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వెంకటేశ్ ప్రసాద్ కనీసం షార్ట్ లిస్ట్ అవ్వలేదని సమాచారం.
సరికొత్త సెలక్షన్ కమిటీకి చేతన్ శర్మే తిరిగి ఛైర్మన్‌గా ఉంటారని వినికిడి! అదే కమిటీలోని హర్వీందర్ సింగ్ మళ్లీ ఎంపికయ్యారని సమాచారం. ఇన్నాళ్లూ జూనియర్ సెలక్షన్ కమిటీలో పనిచేసిన శ్రీధరన్ శరత్ సౌత్ జోన్ నుంచి సీనియర్ విభాగంలోకి ప్రమోట్ అయ్యాడట. తూర్పు నుంచి ఎస్‌ఎస్ దాస్, పశ్చిమం నుంచి సలిల్ అంకోలా ముందంజల్ ఉన్నారని అంటున్నారు. వచ్చే వారం న్యూజిలాండ్ సిరీస్‌కు కొత్త కమిటీయే టీమ్‌ఇండియాను ఎంపిక చేయనుంది.
కొత్త సెలక్షన్ కమిటీ (అంచనా)
- చేతన్ శర్మ (ఛైర్మన్)
- హర్వీందర్ సింగ్
- ఎస్‌ఎస్ దాస్
- శ్రీధరన్ శరత్
- సలిల్ అంకోలా
బీసీసీఐ షార్ట్ లిస్ట్ (అంచనా)
- చేతన్ శర్మ
- హర్వీందర్ సింగ్
- అమే ఖురేషియా
- అజయ్ రాత్రా
- శివ సుందర్ దాస్
- శ్రీధరన్ శరత్
- కానర్ విలియమ్స్
- సలిల్ అంకోలా
'క్రికెట్ సలహాదారుల కమిటీ నివేదికను బీసీసీఐ పరిశీలిస్తోంది. త్వరలోనే సెలక్టర్ల పేర్లను ప్రకటించనుంది. అందరూ అర్హతలు ఉన్నవారే. న్యూజిలాండ్ సిరీసుకు జట్టును కొత్త సెలక్షన్ కమిటీయే ఎంపిక చేస్తుంది' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 'సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని శరత్‌ను మేమే కోరాం. సీనియర్లు, జూనియర్ల మధ్యన అతడు వారధిగా ఉంటాడని మా విశ్వాసం. అతడు జూనియర్లతో చక్కగా పనిచేశాడు. వారి గురించి బాగా తెలుసు. వారిప్పుడు సీనియర్ జట్టులోకి వస్తున్న నేపథ్యంలో అతడి అనుభవం ఎంతో విలువైంది' అని ఆ అధికారి వెల్లడించారు.
View this post on Instagram