BCCI Chief Selector: చీఫ్ సెలక్టర్ పదవి - ట్విస్ట్ ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్!
BCCI Chief Selector: చీఫ్ సెలక్టర్ పదవికి బీసీసీఐ తనను సంప్రదించినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
BCCI Chief Selector:
చీఫ్ సెలక్టర్ పదవికి బీసీసీఐ తనను సంప్రదించినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. తననెవరూ కలవలేదని స్పష్టం చేశాడు. అలాంటి ఆఫర్ ఏమైనా వచ్చిందా అని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రశ్నించగా 'లేదు' అని వీరూ జవాబిచ్చాడు.
ప్రస్తుతం బీసీసీఐ టీమ్‌ఇండియా చీఫ్ సెలక్టర్ కోసం వేట మొదలు పెట్టింది. ఓ మీడియా కంపెనీ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో రహస్య సమాచారం చెప్పడంతో మాజీ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో అప్పట్నుంచి మాజీ క్రికెటర్ శివ సుందర్ దాస్ తాత్కాలికంగా ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శరత్ (సౌత్), సుబ్రతో బెనర్జీ (సెంట్రల్), సలిల్ అంకోలా (వెస్ట్) ఆయనకు సహకారం అందిస్తున్నారు.
సెలక్టన్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం బీసీసీఐ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన వ్యక్తి చీఫ్ సెలక్టర్‌గా ఉంటారని తెలిపింది. దరఖాస్తు చేసుకొనే వ్యక్తికి కనీసం ఏడు టెస్టుల అనుభవం ఉండాలి. లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాలి. లేదా 10 టీ20లు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడాలి. క్రికెట్‌కు వీడ్కోలు పలికి కనీసం ఐదేళ్లు అవ్వాలి. దరఖాస్తు చేసుకొనేందుకు జూన్ 30 చివరి తేదీ.
టీమ్‌ఇండియా ఇప్పుడు పరిణామదశలో ఉంది. ఐసీసీ టోర్నీలో సెమీస్, ఫైనళ్లలో ఓడిపోతుండటంతో మార్పులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే సరైన చీఫ్ సెలక్టర్‌ను ఎంపిక చేయడం అవసరం. ఈ నేపథ్యంలో నార్త్ జోన్‌కు చెందిన వీరేంద్ర సెహ్వాగ్‌ను బీసీసీఐ సంప్రదించినట్టు గురువారం వార్తలు వచ్చాయి. కాకపోతే వేతనం మరీ తక్కువగా ఉండటంతో అతడు అంగీకరించడం లేదని సమాచారం వచ్చింది.
ప్రస్తుతం ఛైర్మన్ ఆఫ్ సెలక్టర్‌కు ఏడాదికి రూ.కోటి వరకు ఇస్తున్నారు. మిగిలిన నలుగురు సెలక్టర్లకు రూ.90 లక్షలు ఇస్తున్నారు. ఇంత తక్కువ మొత్తానికి వీరూ అంగీకరించడం లేదని వాదన.
క్రికెట్ పరంగా వీరేంద్ర సెహ్వాగ్ స్థాయి పెద్దది. అతడితో ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు చాలామంది స్పాన్సర్లు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా వాణిజ్య ప్రకటనల్లో ఆయన నటిస్తున్నారు. అంతేకాకుండా క్రికెట్ కామెంటరీ చేస్తున్నారు. సొంతంగా పాఠశాల నిర్వహిస్తున్నారు. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగులో కోచ్, క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పటికీ ఆయన అలాంటి వచ్చే అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటన్నిటితో పోలిస్తే రూ.కోటి ఎంత వరకూ సరిపోదు.
టీమ్‌ఇండియా క్రికెటర్ల వార్షిక వేతనమే గ్రేడ్లను బట్టి రూ.3 నుంచి రూ.10 కోట్లకు పైగా ఉంది. పైగా వాణిజ్య ఒప్పందాలతో రూ.కోట్లలో సంపాదిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు ఏకంగా రూ.100 కోట్ల మేర ఆర్జిస్తున్నారు. ఇక కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ సైతం ఏడాదికి రూ.10-15 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు చీఫ్ సెలక్టర్‌కు ఎందుకు తక్కువ ఇస్తున్నారో అర్థమవ్వడం లేదు. బహుశా సెహ్వాగ్ గనక అంగీకరిస్తే అతడి సాలరీ పెంచొచ్చు. కాకపోతే పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో ఇతరు ఎండార్స్‌మెంట్లు చేసుకోలేడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial