BCCI Media Rights: మీడియా హక్కులు అంబానీకి - మరింత సంపన్నం కానున్న బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్వహించిన మీడియా హక్కుల (స్వదేశంలో భారత్ ఆడబోయే మ్యాచ్‌లు)ను అంబానీకి చెందిన వయాకామ్ 18 దక్కించుకుంది.
BCCI Media Rights: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు బంగారు బాతుగుడ్డుగా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డిజిటల్ రైట్స్‌తో పాటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రసార హక్కులనూ దక్కించుకున్న ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని వయాకామ్ 18.. తాజాగా స్వదేశంలో వచ్చే ఐదేండ్లకు గాను టీమిండియా ఆడబోయే ద్వైపాక్షిక మ్యాచ్‌ల ప్రసార హక్కులనూ సొంతం చేసుకుంది. భారత క్రికెట్ ప్రసార హక్కులపై గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూ.. రూ. 5,963 కోట్లకు దక్కించుకుంది. భారత క్రీడా రంగంలో డిస్నీ హాట్ స్టార్ (స్టార్ నెట్వర్క్)తో పాటు సోనీలను కనుమరుగు చేసి ప్రసార హక్కులను తన గుప్పిట బంధించింది.
గురువారం ముగిసిన బీసీసీఐ మీడియా రైట్స్ ఈ వేలంలో భారత్.. తదుపరి ఐదేండ్ల (2023 - 2028) వరకూ స్వదేశంలో ఆడబోయే మ్యాచ్‌ల డిజిటల్, టీవీ ప్రసారాలను వయాకామ్ దక్కించుకుంది. ఈ వేలంలో హాట్ స్టార్, సోనీ పోటీపడ్డా వయాకామ్ దెబ్బకు అవి నిలువలేకపోయాయి. డిజిటల్ రైట్స్‌ను రూ. 3,101 కోట్లకు దక్కించుకున్న అంబానీ సంస్థ.. టీవీ హక్కులకు రూ. 2,862 కోట్లు (మొత్తం రూ. 5,963 కోట్లు) చెల్లించింది.
ఆసీస్‌తో వన్డే సిరీస్‌తోనే మొదలు..
సెప్టెంబర్‌లో భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడబోయే వన్డే సిరీస్‌తో ఈ ఒప్పందం మొదలుకానుంది. ఈ ఐదేండ్ల కాలంలో భారత్.. స్వదేశంలో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20లు ఆడనుంది. ఇందులో అగ్రశ్రేణి జట్టు అయిన ఆస్ట్రేలియాతో 21 మ్యాచ్‌లు, ఇంగ్లాండ్‌తో 18, న్యూజిలాండ్‌తో 11, సౌతాఫ్రికాతో 10, వెస్టిండీస్‌తో 10, అఫ్గానిస్తాన్‌తో ఏడు, శ్రీలంకతో ఆరు, బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌లలో తలపడనుంది. ఈ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్ డిజిటల్ హక్కులూ వయాకామ్ వద్దే ఉన్నాయి. గతేడాది ముగిసిన ఈ వేలంలో వయాకామ్.. ఏకంగా రూ. 26 వేల కోట్లు చెల్లించి ఐపీఎల్ డిజిటల్ హక్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఒక్కో మ్యాచ్‌కు రూ. 67.78 కోట్లు..
వచ్చే ఐదేండ్లలో భారత్ ఆడబోయే ఒక్కో మ్యాచ్‌కు వయాకామ్ రూ. 67.78 కోట్లు చెల్లించనుంది. గత సైకిల్ (2018 - 2023)లో హాట్ స్టార్ ఒక్కో మ్యాచ్‌కు రూ. 61.38 కోట్లు చెల్లించింది. అంటే గత సైకిల్‌తో పోలిస్తే ఇప్పుడు ఒక్కో మ్యాచ్‌కు సుమారు ఏడు కోట్ల రూపాయలు పెరిగింది. గత ఒప్పందంలో భాగంగా 2018-2023 సైకిల్‌లో భారత్ 102 మ్యాచ్‌లు ఆడటంతో ఆ డీల్ విలువ రూ. 6,138 కోట్లు తగ్గింది. ఓవరాల్‌గా చూస్తే ఈ ఐదేండ్లలో ఒప్పందపు విలువ తగ్గినా మ్యాచ్‌లను బట్టి చూస్తే (మ్యాచ్‌కు సుమారు ఏడు కోట్ల అధికాదాయం) ఇది పెరిగింది.
Congratulations @viacom18 🤝 for winning the @BCCI Media Rights for both linear and digital for the next 5 years. India Cricket will continue to grow in both spaces as after @IPL, and @wplt20, we extend the partnership @BCCI Media Rights as well. Together we will continue to…
— Jay Shah (@JayShah) August 31, 2023
మొత్తం వాళ్లకే..
ప్రస్తుతం భారత క్రీడారంగంలో ఏ క్రీడకు సంబంధించి మొబైల్స్‌లో లైవ్ చూడాలంటే వయాకామ్ 18 (జియో సినిమా) ఓపెన్ చేయకతప్పని పరిస్థితి.. ప్రస్తుతానికి ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ హక్కులు తప్ప క్రికెట్‌లో భారత్ (స్వదేశంలో) ఆడే ప్రతి మ్యాచ్ జియోలో చూడాల్సిందే. వయాకామ్ 18 వద్ద ప్రస్తుతానికి ఉన్న మీడియా హక్కుల వివరాలు..
- బీసీసీఐ మీడియా రైట్స్ (ద్వైపాక్షిక సిరీస్‌లు)
- ఐపీఎల్ డిజిటల్ రైట్స్
- ఉమెన్స్ ప్రీమియర్ లీగ్
- సమ్మర్ ఒలింపిక్స్
- ఫిఫా వరల్డ్ కప్
- ఎన్‌బీఎ
- బీడబ్ల్యూఎప్ వరల్డ్ టూర్ (బ్యాడ్మింటన్)
- ఏటీపీ మాస్టర్స్ 1000 (టెన్నిస్)
- అబుదాభి టీ10
- డైమండ్ లీగ్ (అథ్లెటిక్స్)
- లా లిగ (ఫుట్‌బాల్)
- ఎస్ఎ20 (సౌతాఫ్రికాలో జరిగే మినీ ఐపీఎల్)
- సిరీ ఎ (యూరప్ ఫుట్‌బాల్ లీగ్)
- లీగ్ 1 (ఫుట్‌బాల్)
ప్రస్తుతానికి జియో సినిమా యాప్‌లో ఈ ప్రసారాలు ఉచితంగానే అందిస్తున్నా రాబోయే రోజుల్లో వీటికి సబ్‌స్క్రిప్షన్ పెట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. భారత క్రీడారంగంపై గుత్తాధిపత్యాన్ని దక్కించుకున్న వయాకామ్ 18 త్వరలో మరెన్ని షాకులిస్తుందో చూడాలి. ఇక తాజాగా మీడియా రైట్స్ ద్వారా ఆరు వేల కోట్ల రూపాయలు రావడంతో ఇదివరకే సంపన్న బోర్డుగా ఉన్న బీసీసీఐకి కాసుల పంట కురవనుంది.
VIACOM18 asking for media rights for Indian home games be like: #JawanTrailer #Viacom18 pic.twitter.com/fhzo2hLWxr
— 12th Khiladi (@12th_khiladi) August 31, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial