BCCI Central Contracts 2022-23: హార్దిక్ పాండ్యకు డబుల్ ప్రమోషన్! అతడి వెంటే సూర్యకుమార్!
BCCI Central Contracts 2022-23: టీమ్‌ఇండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యకు ప్రమోషన్ రానుంది! త్వరలో ఎంపిక చేసే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో వీరికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
BCCI Central Contracts 2022-23:
టీమ్‌ఇండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యకు ప్రమోషన్ రానుంది! త్వరలో ఎంపిక చేసే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో వీరికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పుడున్న స్థాయి నుంచి మెరుగైన గ్రేడ్‌కు ఉన్నతీకరిస్తారని తెలిసింది.
బీసీసీఐ ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఆటగాళ్ల కాంట్రాక్టుల వ్యవహారం తెరపైకి రానుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కుర్రాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య త్వరలోనే టీ20 పగ్గాలు అందుకుంటాడని సమాచారం. పదేపదే గాయపడుతున్న రోహిత్ శర్మ స్థానంలో అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అతడు అదరగొట్టిన సంగతి తెలిసిందే.
మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. బంతి ఎటువైపు వేసినా సిక్సర్లు దంచుతున్నాడు. వినూత్నమైన షాట్లతో అలరిస్తున్నాడు. అతడి స్ట్రైక్‌రేట్‌తో పాటు సగటు సైతం ఎక్కువగానే ఉంటోంది. టీ20 విధ్వంసాలనే వన్డేల్లోనూ చూపిస్తున్నాడు. దాంతో త్వరలోనే అతడు టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని తెలుస్తోంది. మిడిలార్డర్లో అతడికి అవకాశం ఇస్తారని అంటున్నారు.
ప్రస్తుతం హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ గ్రేడ్-సిలో ఉన్నారు. కుంగ్‌ఫూ పాండ్యకు డబుల్ ప్రమోషన్ రానుంది. కెప్టెన్సీతో పాటు గ్రేడ్ మారనుంది. రాబోయే రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లు ఉన్నాయి. 2023 సెప్టెంబర్లో వన్డే, 2024లో టీ20 ప్రపంచకప్ ఉన్నాయి. రెండేళ్ల తర్వాత జరిగే పొట్టి క్రికెట్‌కు రోహిత్ శర్మ, మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే యువ బ్రిగేడ్‌ను రూపొందించాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది.
ఆల్ ఫార్మాట్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కూ ప్రమోషన్ దక్కనుంది. రవీంద్ర జడేజా తరచూ గాయపడుతుండటంతో అక్షర్‌కు అవకాశాలు దక్కుతున్నాయి. అతడికి గ్రేడ్-ఏ కాంట్రాక్టు దక్కొచ్చు. ఈ మధ్యే జరిగిన వన్డే, టెస్టు మ్యాచుల్లో శుభ్‌మన్ గిల్ మంచి ప్రదర్శన చేశాడు. బహుశా అతడికి గ్రేడ్-బి ఇస్తుండొచ్చు. బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చేస్తున్న శార్దూల్ ఠాకూర్ కాంట్రాక్టు గ్రేడ్-సికి తగ్గొచ్చని తెలిసింది.
View this post on Instagram