Asian Games 2023: ఏసియన్ గేమ్స్‌లో ఆడనున్న టీమిండియా - కెప్టెన్‌గా గబ్బర్?
ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనా వేదికగా ఏసియన్ గేమ్స్ - 2023 క్రీడలు జరుగనున్నాయి. ఈసారి ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను కూడా చేర్చారు.
Asian Games 2023: టీమిండియా రాబోయే మూడు నాలుగు నెలల్లో ఊపిరిసలపనంత బిజీగా గడపబోతోంది. ప్రస్తుతానికి రెస్ట్ మోడ్‌లో ఉన్న మెన్ ఇన్ బ్లూ.. జులై నుంచి వెస్టిండీస్ పర్యటన తర్వాత ఫుల్ బిజీ కానున్నారు. ఆగస్టు - సెప్టెంబర్‌లో ఆసియా కప్ - 2023 తర్వాత రోహిత్ సేన వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండగానే ద్వితీయ శ్రేణి భారత జట్టు క్రేజీ టోర్నమెంట్ ఆడనుంది. ఈ జట్టుకు టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఏసియన్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడంతో ఈ టోర్నీలో భారత జట్టు పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
షెడ్యూల్‌తోనే అసలు సమస్య
వాస్తవానికి ఏసియన్ గేమ్స్ గతేడాది జరగాల్సింది. కానీ చైనాలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో మేలో జరగాల్సిన గేమ్స్ కాస్తా ఈ ఏడాదికి వాయిదాపడ్డాయి. చైనాలోని హాంగ్జో వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 08 వరకూ ఏసియన్ గేమ్స్ జరుగనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో చైనా ఉంది. అయితే ఈ షెడ్యూల్ టీమిండియాకు అస్సలు సెట్ కావడం లేదు. దీంతో గతంలో ఏసియన్ గేమ్స్ కు భారత పురుషుల జట్టును పంపడం కుదరదని బీసీసీఐ తెలిపింది. సరిగ్గా ఇదే సమయానికి ఇండియాలో వరల్డ్ కప్ ఉండటంతో బీసీసీఐ ఏసియన్ గేమ్స్ మీద విముఖత వ్యక్తం చేసింది.
Shikhar Dhawan likely to lead Indian team in the Asian Games. [PTI] pic.twitter.com/fOjtkvqmz5
— Johns. (@CricCrazyJohns) June 29, 2023
వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే జట్టుతో సంబంధం లేకుండా ద్వితీయ శ్రేణి జట్టుతో ఆసియా క్రీడలు ఆడాలని బీసీసీఐ భావిస్తున్నది. శిఖర్ ధావన్ సారథ్యంలో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ తో పాటు దేశవాళీ, ఐపీఎల్ లో మెరుస్తున్న ఆటగాళ్లతో ఏసియన్ గేమ్స్ కు టీమ్ ను పంపించాలని బీసీసీఐ ప్రణాళికలను రచిస్తున్నది.
బీసీసీఐకి అవసరం..
ఈసారి ఆసియా క్రీడల్లో పాల్గొనడం బీసీసీఐకి కీలకం. 2028 లాస్ ఏంజెల్స్ లో జరుగబోయే ఒలింపిక్ క్రీడలలో క్రికెట్ ను చేర్చాలని కోరుతున్నవారిలో ఐసీసీకి బీసీసీఐ ఫుల్ సపోర్ట్ గా నిలుస్తున్నది. దానిని దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ.. ఆసియా క్రీడలకు టీమ్‌ను పంపిస్తున్నట్టు సమాచారం. గతేడాది బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడలకు కూడా భారత్ (మహిళల జట్టు) టీమ్ ను పంపింది. హర్మన్ ప్రీత్ కౌర్ సేన రజతం నెగ్గింది.
ఉమెన్స్ టీమ్ అయితే పక్కా..
పురుషుల క్రికెట్ టీమ్‌ను బీసీసీఐ పంపుతుందా..? లేదా..? అన్నదానిపై స్పష్టత లేకున్నా మహిళల క్రికెట్ టీమ్ అయితే ఆసియా క్రీడలకు వెళ్లనుంది. జులైలో బంగ్లాదేశ్ టూర్ నుంచి వచ్చిన తర్వాత భారత మహిళల జట్టుకు పెద్దగా టోర్నీలు కూడా ఏం లేవు. దీంతో హర్మన్‌ప్రీత్ సేన ఆసియా క్రీడలలో ఆడనుంది. పురుషుల టీమ్ ను పంపేది లేనిది జులై 7న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ తర్వాతే స్పష్టత రానుంది.