Asia Cup Points Table 2022: భారత్, అఫ్గాన్ నెంబర్ వన్ - హాంకాంగ్ గెలిస్తే పాక్ పరిస్థితి ఏంటి?
Asia Cup 2022: ఆసియా కప్ ఊహించిన దాని కన్నా ఉత్సాహంగా కొనసాగుతోంది. టీమ్‌ఇండియా వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. హాంకాంగ్‌పై గెలిచి సూపర్-4కు చేరుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది.
Asia Cup Points Table 2022: ఆసియా కప్-2022 ఊహించిన దాని కన్నా ఉత్సాహంగా కొనసాగుతోంది. మ్యాచులన్నీ రసవత్తరంగా సాగుతున్నాయి. టీమ్‌ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సూపర్-4కు చేరుకుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్థాన్ తొలి గెలుపు కోసం ఎదురు చూస్తోంది. హాంకాంగ్‌పై విజయం అందుకొని సూపర్-4కు చేరుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక రెండు గ్రూపుల్లో ఏ జట్టు ఎన్ని పాయింట్లతో ఉందంటే!
హాంకాంగ్‌పై పాక్ ఆశలు!
గ్రూప్-ఏలో టీమ్‌ఇండియా నంబర్ వన్ పొజిషన్లో ఉంది. తొలి మ్యాచులో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఇక బుధవారం జరిగిన పోరులో హాంకాంగ్‌పై భారీ తేడాతో విజయం అందుకుంది. 4 పాయింట్లు, 1.096 నెట్‌రన్‌రేట్‌తో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఓటమి పాలైనప్పటికీ పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేట్ (-0.175) మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. హాంకాంగ్ -2.00 రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు తలపడే మ్యాచు విజేత సూపర్-4కు అర్హత సాధిస్తుంది.
అఫ్గాన్ దూకుడు
గ్రూప్-బిలో అఫ్గానిస్థాన్ దుమ్మురేపుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. మొదట శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్‌ను భారీ తేడాతో ఓడించింది. 2.467 రన్‌రేట్, 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సూపర్-4కు దూసుకెళ్లింది. శ్రీలంకతో పోలిస్తే కాస్త మెరుగైన రన్‌రేట్ వల్ల బంగ్లాదేశ్ (-0.731) రెండో స్థానంలో ఉంది. శ్రీలంక మరీ దారుణంగా -5.176 రన్‌రేట్‌తో ఆఖర్లో ఉంది. ఈ రెండు జట్లు తలపడే లీగు మ్యాచులో గెలిచిన వారు సూపర్-4కు వెళ్తారు.
భారత్ x హాంకాంగ్ పోరులో ఏం జరిగింది?
ఆసియాకప్ టోర్నీలో భారత్ ఖాతాలో మరో విజయం పడింది. బుధవారం హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం హాంగ్ కాంగ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
నింపాదిగా ఆడిన హాంగ్ కాంగ్
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. అయితే అలాగని వికెట్లు కూడా వరుసగా కోల్పోలేదు. చాలా నెమ్మదిగా ఆడుతూ పూర్తి ఓవర్ల పాటు హాంగ్ కాంగ్ ఆలౌట్ కాకుండా నిలబడింది. బాబర్ హయత్ (41: 35 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), కించిత్ షా (30: 28 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, అవేష్ ఖాన్ తలో వికెట్ తీశారు. అర్ష్ దీప్ సింగ్ (నాలుగు ఓవర్లలో 44), అవేష్ ఖాన్ (నాలుగు ఓవర్లలో 53) ధారాళంగా పరుగులు సమర్పించారు. మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ కూడా సరదాగా ఒక ఓవర్ వేశాడు. తన ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి.