Asia Cup 2025 IND vs PAK: భారత్-పాకిస్తాన్ మధ్య మరో హైవోల్టేజ్ మ్యాచ్.. ఇప్పటివరకూ టాప్ 5 స్కోరర్స్ వీరే
India vs Pakistan | ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Asia Cup 2025 IND vs PAK: ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 14న ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఎప్పుడూ హై-వోల్టేజ్ జనరేట్ చేస్తాయి. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో భారత్-పాకిస్తాన్ తలపడుతుంటే ఫ్యాన్స్ గుండె వేగం పెరుగుతుంది. భారత్, పాక్ తలపడ్డ మ్యాచ్‌లలో పలువురు బ్యాట్స్‌మెన్లు గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ టీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
టాప్ 5 బ్యాటర్లు వీరే..
విరాట్ కోహ్లీ (భారత్) - 492 పరుగులు
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు పాకిస్తాన్‌తో 11 టీ20 మ్యాచులు ఆడి మొత్తం 492 పరుగులు చేశాడు. అతడి సగటు 70.28గా ఉంది. ఇది కీలక సందర్భాల్లో ఎలా రాణించగలడో నిరూపిస్తుంది. పాకిస్తాన్‌పై కోహ్లీ అత్యుత్తమ స్కోర్ 82 పరుగులు (నాటౌట్), ఇది 2022 ఆసియా కప్‌లో వచ్చింది. కోహ్లీ 5 హాఫ్ సెంచరీలు చేయగా... ఆయన స్ట్రైక్ రేట్ 123.92.
మహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) - 228 పరుగులు
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ భారత్‌తో ఆడిన 5 మ్యాచుల్లో 228 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత జట్టుపై రిజ్వాన్ బెస్ట్ స్కోర్ 79 పరుగులు (నాటౌట్). అతడి సగటు 57.00 కాగా, స్ట్రైక్ రేట్ 111.76.
షోయబ్ మాలిక్ (పాకిస్తాన్) - 164 పరుగులు
పాకిస్తాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. భారత్‌తో 9 టీ20 మ్యాచుల్లో మాలిక్ 164 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 57 నాటౌట్. అతడి స్ట్రైక్ రేట్ 103.79 కాగా, సగటు 27.33. కానీ కొన్ని సందర్భాల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి పాక్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు.
మహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్) - 156 పరుగులు
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ భారత్‌తో ఆడిన 8 టీ20 మ్యాచుల్లో మొత్తం 156 పరుగులు చేశాడు. అతడి బెస్ట్ స్కోర్ 61 రన్స్. భారత్‌పై 2 అర్ధ సెంచరీలు చేశాడు. హఫీజ్ స్ట్రైక్ రేట్ 118.18గా ఉంది.
యువరాజ్ సింగ్ (భారత్) - 155 పరుగులు
భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్‌తో 8 టీ20 మ్యాచులాడిన యువీ 155 పరుగులు చేశాడు. యువరాజ్ బెస్ట్ స్కోర్ 72 పరుగులు. పాక్ తో మ్యాచ్‌ల్లో అతడి ఖాతాలో ఒక హాఫ్ సెంచరీ ఉంది.





















