Asia Cup 2023: 15 ఏళ్లలో తొలిసారి ఆ మాట చెప్పిన కోహ్లీ - అయినా సిద్ధమే అంటూ ధీమా
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిన్న పాకిస్తాన్ తో మ్యాచ్ ముగిశాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ మొత్తంలో కోహ్లీ ఇలా వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి కాబోలు..
Asia Cup 2023: వయసు మీదపడుతున్నా ఇప్పటికీ టీమిండియాలోనే కాదు, ప్రపంచ క్రికెట్‌లో ఫిట్‌నెస్ పరంగా టాప్ క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉంటాడు. వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తుతాడు. వన్డే క్రికెట్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే కోహ్లీ.. సోమవారం పాకిస్తాన్‌లో కూడా సెంచరీలో ఫోర్లు, సిక్సర్ల కంటే సింగిల్స్, డబుల్సే ఎక్కువ. కానీ మ్యాచ్ ముగిశాక కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇన్నేళ్ల తన క్రికెట్ కెరీర్‌లో బహుశా ఎప్పుడూ చెప్పని విధంగా ‘నేను అలిసిపోయాను’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో తొలిసారి ఇలా అనిపిస్తోందని కోహ్లీ చెప్పాడు.
ఓపిక లేదు..
పాకిస్తాన్‌తో మ్యాచ్ ముగిశాక కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రెజెంటేషన్‌లో భాగంగా విరాట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అవార్డు తీసుకునేందుకు వచ్చిన కోహ్లీ.. అక్కడే ఉన్న సంజయ్ మంజ్రేకర్‌తో ‘ఇంటర్వ్యూను త్వరగా ముగించండి. నేను చాలా అలిసిపోయా..’అని అన్నాడు. అప్పుడు మంజ్రేకర్.. ‘జస్ట్ కొన్ని ప్రశ్నలు అంతే..’ అని రిప్లై ఇచ్చాడు. ఆ మాటకు చిన్నగా నవ్విన కోహ్లీ తర్వాత మంజ్రేకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘నా 15 ఏళ్ల క్రికెట్‌లో ఇలాంటిది తొలిసారి చూస్తున్నా. అదృష్టవశాత్తూ మేం టెస్ట్ ప్లేయర్స్. టెస్టులలో ఒకరోజు ఆట ముగిశాక మరోరోజు వచ్చి ఎలా ఆడాలనేది మాకు తెలుసు. త్వరగా కోలుకోవడం చాలా ముఖ్యం. ఇవాళ చాలా ఉక్కపోతగా ఉంది. ఈ నవంబర్‌లో నాకు 35 ఏళ్లు నిండుతాయి. అందువల్ల నేను రికవరీ గురించి జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పాడు.
కాగా నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ చేసిన శతకంలో 34 పరుగులు మాత్రమే ఫోర్లు, సిక్సర్ల రూపంలో వచ్చాయి. మిగిలిన 66 పరిగెత్తినవే. పరిస్థితులకు తగ్గట్టు ఆడిన కోహ్లీ.. మిడిల్ ఓవర్స్‌లో స్ట్రైక్ రొటేట్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చాడు. భారత ఇన్నింగ్స్ 40 వ ఓవర్‌కు చేరాక బ్యాట్‌కు పనిచెప్పాడు. చివరి ఐదు ఓవర్లలో అయితే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
That's Virat Kohli for you. Another classic Kohli inns 👏🏽 #INDvPAK pic.twitter.com/74ryLFQReD
— Wasim Jaffer (@WasimJaffer14) September 11, 2023
ఆ డిఫరెంట్ షాట్‌పై..
భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కోహ్లీ కొట్టిన షాట్ అందరినీ అబ్బురపరిచింది. ఫహీమ్ అష్రఫ్ వేసిన ఆఖరి ఓవర్లో నాలుగో బంతికి వికెట్లు వదిలిపెట్టి లెగ్ సైడ్ దిశగా భారీ షాట్ కొట్టేందుకు సమాయత్తమైన కోహ్లీ బంతి పడి బ్యాట్‌కు చేరే క్రమంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని తన బ్యాట్ పొజిషన్‌ను కాస్త మార్చి స్లిప్స్‌లో రివర్స్ ర్యాంప్ ఆడి బాల్‌ను బౌండరీకి తరలించాడు. సాధారణంగా ఇలాంటి షాట్లను టీ20లలో బ్యాటర్లు ఎక్కువగా ఆడుతుంటారు. ఎంత టీ20 ఫీవర్ ముంచెత్తుతున్నా కోహ్లీ ఇంకా సాంప్రదాయ షాట్లను వీడలేదు. తాజాగా కోహ్లీ కొట్టిన ఈ షాట్ పై అతడు స్పందిస్తూ.. ‘నేను అప్పటికే సెంచరీ చేశాను. సాధారణంగా అలాంటి షాట్లను నేను ఆడను. ఆ షాట్ ఆడినప్పుడు కూడా నాకు బాగా అనిపించలేదు. నేను, కెఎల్ రాహుల్ సాంప్రదాయ క్రికెటర్లం. ఇలాంటి ఫ్యాన్సీ షాట్లను మేం పెద్దగా ట్రై చేయం’అని చెప్పుకొచ్చాడు.
నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ.. 94 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial