BAN vs SL ODI: నాగిని డాన్స్ ఎవరిదో? - నేడే శ్రీలంక - బంగ్లాదేశ్ ఫస్ట్ ఫైట్
Asia Cup 2023: ఆసియా కప్ - 2023లో నేడు డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుంది. పల్లెకెల వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది.
BAN vs SL ODI: వన్డే ప్రపంచకప్‌కు ముందు కీలక ఆటగాళ్లు దూరమై గాయాలతో సతమతమవుతున్న బంగ్లాదేశ్, శ్రీలంకలు నేడు (గురువారం) ఆసియా కప్‌లో తొలి పోరులో ఢీకొనబోతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ రెండు దేశాల ఆటగాళ్లు ఫీల్డ్‌లో చేసే అతి, ఒకరిమీద ఒకరు పెంచుకున్న వైరంతో బంగ్లా - లంక మ్యాచ్ కూడా హై ఓల్టేజ్ డ్రామాగా సాగుతూ ఇరు దేశాలలో అభిమానులకు ఫుల్ క్రికెట్ మజాను అందిస్తున్నది. మరి బంగ్లా పులల నాగిని డాన్స్‌కు లంక సింహాలు తోకముడుస్తాయా..? తొలి పోరులో నాగిని డాన్స్ ఎవరిది..?
గాయాల లంక..
దుష్మంత చమీర, దిల్షాన్ మధుశంక, లాహిరు కుమార, వనిందు హసరంగ.. నలుగురు కీలక బౌలర్లు లేకుండానే లంక బరిలోకి దిగుతోంది. పైన పేర్కొన్నవారిలో ముగ్గురు లంక పేస్ బౌలింగ్‌కు కర్త, కర్మ, క్రియలు. ఇక స్టార్ స్పిన్నర్ హసరంగ కూడా గాయం కారణంగా ఆసియా కప్ నుంచి తప్పుకున్నాడు. వీరి నిష్క్రమణ లంక టీమ్‌ను వీక్ చేసిందని చెప్పక తప్పదు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) లో లంకకు విజయాలు అందించడంలో ఈ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వీరి స్థానాన్ని లంక యువ బౌలర్లు మహీశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, కసున్ రజిత ఏ మేరకు నిర్వహిస్తారనేది ఆసక్తికరం.
బ్యాటింగ్‌లో లంక కాస్త బెటర్‌గానే ఉంది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నె, పతుమ్ నిస్సంకలతో పాటు వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ మంచి టచ్‌లోనే ఉన్నారు. మిడిలార్డర్‌లో సమరవిక్రమ, చరిత్ అసలంక తో పాటు కెప్టెన్ దసున్ శనక ఆల్ రౌండ్ బాధ్యతలు పోషించాల్సి ఉంది. మరి షకిబ్ అల్ హసన్ బౌలింగ్ ఎటాక్‌ను లంక బ్యాటర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. స్వదేశంలో ఆడుతుండటం లంకకు కలిసొచ్చేదే.
బంగ్లాదీ అదే దారి..
శ్రీలంక అంత కాకపోయినా బంగ్లాదేశ్‌నూ గాయాలు వేధిస్తున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందే స్టార్ బ్యాటర్, మాజీ సారథి తమీమ్ ఇక్బాల్ ఆసియా కప్ నుంచి గాయం కారణంగా తప్పుకోగా వైరల్ ఫీవర్‌తో లిటన్ దాస్ కూడా దూరమయ్యాడు. స్టార్ పేసర్ ఎబాదత్ హోసెన్‌దీ అదే పరిస్థితి. షకిబ్ నేతృత్వంలో ముందుకు సాగుతున్న బంగ్లాదేశ్‌కు స్టార్ ప్లేయర్లు దూరమైనా ఇటీవలే స్వదేశంలో అఫ్గాన్‌ను ఓడించి సిరీస్ దక్కించుకున్న ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్న బంగ్లా టైగర్స్.. లంకతో వైరం అంటేనే విరుచుకుపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
బంగ్లా టీమ్‌లో కొన్ని కొత్త ముఖాలు కనిపిస్తున్నా షకిబ్, నజ్ముల్ శాంతో, ముష్ఫీకర్ రహీం, టస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మిరాజ్, మహ్మద్ నయీం వంటి సీనియర్లు కూడా ఉన్నారు. ఎబాదత్ దూరమవడంతో టస్కిన్‌కు తోడుగా షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్‌లు పేస్ బాధ్యతలు చూడనున్నారు. కెప్టెన్ షకిబ్ తో పాటు మెహిది హసన్ కూడా స్పిన్ వేయగలడు. మరి బంగ్లా బౌలింగ్ దళం వీక్‌గా కనిపిస్తున్న శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
పిచ్ : పల్లెకెల పిచ్ పేసర్లతో పాటు బ్యాటింగ్‌కూ అనుకూలంగా ఉంటుంది. ఇటీవలే ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లలో పేసర్లతో పాటు బ్యాటర్లూ పండుగ చేసుకున్నారు. వాతావరణం కూడా పొడిగా ఉండనుండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు.
The Tigers will take on the Lankan Lions in a mouth watering clash tomorrow in Kandy!
— AsianCricketCouncil (@ACCMedia1) August 30, 2023
Can Shanaka and his men make the best use of the home conditions? 🦁#AsiaCup2023 #BANvSL pic.twitter.com/QfLrC2nSuA
తుది జట్లు (అంచనా)
శ్రీలంక : దిముత్ కరుణరత్నె, పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, దసున్ శనక (కెప్టన్) దుషన్ హేమంత, మహీశ్ తీక్షణ, బినురా ఫెర్నాండో, కసున్ రజిత
బంగ్లాదేశ్ : మహ్మద్ నయీం, తాంజిద్ హసన్/అనముల్ హక్, నజ్ముల్ హోసేన్ శాంతో, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫీకర్ రహీం, అఫిఫ్ హోసెన్, మెహిది హసన్ మిరాజ్, టస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, షోరిఫుల్ ఇస్లాం
మ్యాచ్ వెన్యూ, టైమింగ్స్ :
శ్రీలంక లోని పల్లెకెల వేదికగా జరుగబోయే మ్యాచ్.. భారత కాలమానం 3 గంటలకు మొదలుకానుంది.
లైవ్ స్ట్రీమింగ్ :
స్టార్ నెట్వర్క్ ఆసియా కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తోంది. డిస్నీ హాట్ స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లను వీక్షించొచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial