Asia Cup 2023, PAK vs BAN: మరో దాయాదుల పోరుకు సర్వం సిద్ధం - సూపర్ 4 లో బోణీ కొట్టెదెవరు?
ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజ్ ముగిసింది. నేటి నుంచి సూపర్ - 4 పోరు మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌ను ఢీకొననుంది.
Asia Cup 2023, PAK vs BAN: ఆసియా కప్‌లో దాయాదుల (భారత్ - పాక్) పోరుకు ఉండే క్రేజే వేరు. ఆ స్థాయిలో కాకపోయినా ఇటీవల కాలంలో శ్రీలంక - బంగ్లాదేశ్‌తో, పాకిస్తాన్ - అఫ్గానిస్తాన్ మ్యాచ్ లు కూడా రసవత్తరంగానే సాగుతున్నాయి. కొంతకాలంగా బంగ్లాదేశ్ - అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లు కూడా ఇదే కోవలోకి వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు గొడవలు లేకపోయినా పాక్ - బంగ్లా సైతం దాయాదులే. అయితే ఇంతవరకూ పాకిస్తాన్‌ను పాకిస్తాన్‌లో ఓడించని బంగ్లాదేశ్.. ఆసియా కప్ - 2023లో తొలిసారి ఆ ముచ్చట తీర్చుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ రికార్డును మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నేడు పాక్ - బంగ్లా మధ్య లాహోర్ లోని గడాఫీ వేదికగా ఆసియా కప్‌లో సూపర్ - 4 స్టేజ్ తొలి మ్యాచ్ జరుగనుంది.
బంగ్లా సాధించేనా..?
శ్రీలంక.. అఫ్గానిస్తాన్‌ను ఓడించడంతో లక్కీగా సూపర్-4 చేరిన బంగ్లాదేశ్ ఇంతవరకూ పాకిస్తాన్‌తో (పాక్‌లో) మూడు ఫార్మాట్లలోనూ ఆడిన ఏ ఒక్క మ్యాచ్ లోనూ ఆ దేశాన్ని ఓడించలేదు. ఆసియా కప్‌లో కూడా పాక్ చేతిలో బంగ్లాకు పరాభవాలు తప్పలేదు. వన్డేలలో భారత్ మాదిరే 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత బంగ్లా.. పాకిస్తాన్‌తో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 1999 వన్డే వరల్డ్ కప్ నుంచి 2015 ప్రపంచకప్ మధ్యలో బంగ్లాదేశ్ తాను ఆడిన ప్రతి ప్రత్యర్థితో ఏదో ఒక్క మ్యాచ్ లో అయినా గెలిచింది. కానీ పాకిస్తాన్‌ను మాత్రం ఓడించలేదు. అయితే 2015లో తొలిసారి ఆ ముచ్చట తీర్చుకున్న బంగ్లా ఇప్పటివరకూ పాక్‌తో 37 వన్డేలు ఆడితే ఐదు మ్యాచ్‌లు మత్రమే గెలిచింది. ఇప్పుడు బంగ్లాకు పాక్‌ను వారి స్వదేశంలోనే ఓడించే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ స్వదేశంలో జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఫేవరేట్‌గా ఉన్నా గత కొంతకాలంగా వన్డేలలో బంగ్లా పటిష్టంగా తయారైంది.
గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న బంగ్లాకు ఈ మ్యాచ్‌కు ముందే భారీ షాక్ తాకింది. ఈ టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్న నజ్ముల్ హోసేన్ శాంతో నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది. గాయం కారణంగా అతడు ఆడేది అనుమానమే. అతడి స్థానంలో ఈ టోర్నీకి ముందే జ్వరంతో ఇబ్బందిపడి కోలుకున్న లిటన్ దాస్ జట్టుతో చేరే అవకాశముంది. అదే జరిగితే బంగ్లా బ్యాటింగ్ బలోపేతమైనట్టే. దాస్ వస్తే ఓపెనర్‌గా వచ్చి గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మెహిది హసన్ మిరాజ్‌ను ఆడిస్తారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అఫ్గాన్‌తో ఇదే లాహోర్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో బంగ్లా.. 334 పరుగుల భారీ స్కోరు చేసి మంచి టచ్‌లోనే ఉంది. దీనినే కంటిన్యూ చేయాలని షకిబ్ అల్ హసన్ సేన భావిస్తున్నా ఫుల్ స్వింగ్‌లో ఉన్న పాకిస్తాన్ బౌలర్లు ఆ ఛాన్స్ ఇస్తారా..? అన్నది ఆసక్తికరం.
పాక్‌ను ఆపతరమా..?
వన్డేలలో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుతో ఉన్న బాబర్ ఆజమ్ సేన స్వదేశంలో మరింత పవర్ ఫుల్. లాహోర్ లోని గడాఫీ స్టేడియం బ్యాటర్లకు అనుకూలించేదే అయినా ఆ జట్టు పేస్ త్రయం షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లు పీక్స్ ఫామ్‌లో ఉన్నారు. వారే పాక్ టీమ్ బలం, బలగం. బ్యాటింగ్‌లో ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్‌లను నిలువరించడం టస్కిన్ అహ్మద్ నేతృత్వంలోని బంగ్లా బౌలర్లకు సవాలే. స్వదేశంలో బంగ్లాదేశ్‌కు ఇంతవరకూ తలవంచని పాకిస్తాన్.. ఇప్పుడు మరింత స్ట్రాంగ్ గా ఉండటంతో ఆ రికార్డును రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నది. ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌లో ఆడబోయే చివరి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్ తర్వాత టోర్నీ మొత్తం శ్రీలకంకు షిఫ్ట్ అవుతుంది. దీంతో ఈ టోర్నీలో చివరి మ్యాచ్‌ను సొంత అభిమానులకు మరిచిపోని కానుకగా ఇవ్వాలని పాక్ చూస్తున్నది.
తుది జట్లు (అంచనా):
పాకిస్తాన్ : ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీర్ అష్రఫ్, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్
బంగ్లాదేశ్ : మహ్మద్ నయీమ్, మెహిది హసన్ మిరాజ్, లిటన్ దాస్, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫీకర్ రహీమ్, తౌహిద్ హృదయ్, షమిమ్ హోసేన్, అఫిఫ్ హోసేన్, టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్
మ్యాచ్ వెన్యూ, టైమింగ్స్ :
- లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.
లైవ్ చూడండిలా..
- ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో స్టార్ నెట్‌వర్క్స్‌తో పాటు మొబైల్స్‌లో అయితే డిస్నీ హాట్ స్టార్‌లలో ఉచితంగా చూడొచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial