IND vs PAK: సూపర్-4 తొలి మ్యాచులో డేంజరస్ ప్లేయర్స్! వీళ్లతో పెట్టుకుంటే మడతడిపోద్ది!
IND vs PAK: ఆసియాకప్-2022లో మరో హై వోల్టేజీ పోరుకు దాయాదులు రెడీ! రెండు జట్లనూ గాయాలు వేధిస్తున్న తరుణంలో కొందరు ఆటగాళ్లపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతకీ వారెవరు? మ్యాచులో ఎలా కీలకం అవుతారంటే?
Asia cup 2022, India vs Pakistan: ఆసియాకప్-2022లో మరో హై వోల్టేజీ పోరుకు దాయాదులు రెడీ! దుబాయ్ మైదానంలో భారత్, పాక్ తొలి సూపర్-4 మ్యాచులో తలపడుతున్నాయి. రెండు జట్లనూ గాయాలు వేధిస్తున్న తరుణంలో ఈ మ్యాచ్‌పై ఆసక్తి అంతకంతకూ పెరిగింది. కొందరు ఆటగాళ్లపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతకీ వారెవరు? మ్యాచులో ఎలా కీలకం అవుతారంటే?
మిస్టర్ 360
టీమ్‌ఇండియాలో ఇప్పుడు అత్యంత విలువైన ఆటగాడు ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది సూర్యకుమార్ యాదవ్! 360 డిగ్రీల్లో బంతుల్ని బౌండరీకి పంపించే అతడిపై ఎన్నో ఆశలున్నాయి. సూపర్-4 మ్యాచులో భారత్ గెలవాలంటే అతడు అత్యంత కీలకం. కఠినమైన దుబాయ్ పిచ్‌పై హాంకాంగ్ మ్యాచులో అతడి ఇన్నింగ్స్ ఉర్రూతలూగించింది. కోహ్లీ, రాహుల్ రన్స్ కొట్టేందుకు ఇబ్బంది పడుతుంటే అతడొచ్చి మ్యాచ్ స్వరూపం మొత్తం మార్చేశాడు. అందుకే సూర్య మోస్ట్ ఇంపార్టెంట్!
కుంగ్ ఫూ చేయాలి
ఐపీఎల్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్య ఇప్పుడు టీమ్‌ఇండియాకు సమతూకం తీసుకొస్తున్నాడు. పేరుకే ఆరో బౌలింగ్ ఆప్షన్ కానీ ప్రధాన పేసర్‌గా ఉపయోగపడుతున్నాడు. స్పాంజీ బౌన్స్, మంచి స్వింగ్ లభించే పిచ్‌లపై చురకత్తుల్లాంటి బౌన్సర్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. మిడిల్‌లో టపటపా వికెట్లు పడగొడుతున్నాడు. పరుగుల్నీ నియంత్రిస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లో ఎంతో ప్రశాంతత కనిపిస్తోంది. ఒత్తిడి చంపేస్తున్నా సునాయాసంగా సిక్సర్లు, బౌండరీలు బాదేస్తూ మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు.
స్వింగ్ కింగ్
భువనేశ్వర్ కుమార్‌పై టీమ్‌ఇండియా ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టే అతడూ రాణిస్తున్నాడు. ఆరంభ, ఆఖరి ఓవర్లలో వికెట్లు పడగొడుతున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే అతడి బౌలింగ్ జట్టుకు ఎంతో అవసరం. నకుల్ బాల్స్, బౌన్సర్లు, యార్కర్లు సంధించగలడు. ఆరు నెలలుగా అతడు వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. మ్యాచుకు సగటున 3 వికెట్లైనా తీస్తున్నాడు. అనుభవం, తెలివితేటలు, నైపుణ్యం అతడి బలాలు. లోయర్ మిడిలార్డర్లో బ్యాటుతో పరుగులు చేయడం బోనస్.
కొత్త పేస్ కింగ్
మహ్మద్ ఆమిర్, షాహిన్ అఫ్రిది లేని సిచ్యువేషన్లో పాకిస్థాన్‌కు దొరికిన అద్భుతమైన పేసర్ నసీమ్ షా! గాయపడ్డా జట్టు కోసం బౌలింగ్ చేసిన అతడి సంకల్పానికి అంతా ఫిదా అయ్యారు. చక్కని రనప్‌తో దుర్బేధ్యమైన లెంగ్తుల్లో బంతులు విసురుతున్నాడు. తొలి 4 ఓవర్లలోనే కనీసం 2 వికెట్లు తీస్తున్నాడు. స్వింగ్ చేయడమే కాకుండా యార్కర్ లెంగ్తుల్లో బంతులేయడం, బౌన్సర్లు సంధించడం అతడి ప్రత్యేకత. లీగు దశలో భారత్, హాంకాంగ్‌పై విలువైన టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టి ఆశలు రేపుతున్నాడు.
లెగ్గీతో కోహ్లీ, రోహిత్‌కు డేంజర్
టీ20 క్రికెట్లో ఎక్కువ మంది బ్యాటర్లు భయపడేది లెగ్ స్పిన్నర్లకే! పాక్‌లో నిఖార్సైన లెగ్గీ షాదాబ్ ఖాన్ ఉన్నాడు. లెగ్‌బ్రేక్‌లు వేయడం, ప్రత్యర్థిని బోల్తా కొట్టించడం, మిడిల్‌లో వికెట్లు తీయడం అతడి బలాలు. హాంకాంగ్ మ్యాచులో ఏకంగా 4 వికెట్లు తీసి ఫామ్‌లోకి వచ్చాడు. ఒకవేళ దుబాయ్ పిచ్‌పై టర్న్ లభించిందంటే టీమ్‌ఇండియాకు ముప్పు తప్పదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లోనూ అతడు మనల్ని కంగారు పెట్టాడు. పైగా బ్యాటుతో పరుగులూ చేస్తాడు.
రిజ్వాన్ రైజ్
పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. టీ20 ప్రపంచకప్ ఓపెనింగ్ మ్యాచులో అతడేం చేశాడో, టీమ్‌ఇండియా బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని ఎలా చంపేశాడో అందరికీ తెలుసు. ఆసియాకప్‌లో టీమ్‌ఇండియా 43, హాంకాంగ్‌పై 78* పరుగులు చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడి బ్యాటు స్వింగులో ఉందంటే బంతులు బౌండరీ అవతలే పడతాయి. మ్యాచ్ సిచ్యువేషన్‌ను బట్టి దూకుడుగా, నిలకడగా ఆడతాడు. అతడిని త్వరగా పెవిలియన్‌కు పంపకపోతే హిట్‌మ్యాన్ సేనకు తలనొప్పులు తప్పవు.