అన్వేషించండి
Advertisement
Sri Lanka vs Afghanistan: లంకను ముంచేసిన అఫ్గానిస్థాన్, ప్రపంచకప్‌లో మూడో విజయం
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో అఫ్గాన్ సంచలనాలు కొనసాగుతున్నాయి. తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గానిస్థాన్....పాకిస్తాన్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గాన్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ మహా సంగ్రామంలో తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గానిస్థాన్....పాకిస్తాన్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఇప్పుడు శ్రీలంకను కూడా చిత్తు చేసి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తమ వరుస విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఏదో అగ్ర జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లు సునాయసంగా గెలిచేసింది. అఫ్గాన్ చేతిలో ఓటమితో ప్రపంచకప్‌లో లంకేయుల సెమీస్ అవకాశాలకు తెరపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్ఘానిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్... 45.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో అఫ్గాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండగా... లంక ఆశలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
సమష్టిగా రాణించి అఫ్గాన్ బౌలర్లు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బ్యాటర్లకు అఫ్గాన్ ఆదిలోనే షాక్ ఇచ్చింది. స్కోరు బోర్డుపై 22 పరుగులు చేరగానే కరుణరత్నే పెవిలియన్ చేరాడు. 21 బంతుల్లో 15 పరుగులు చేసిన కరుణరత్నేను ఫరూకీ అవుట్ చేసి అఫ్గాన్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత నిసంక, కుశాల్ మెండీస్ జోడి లంక స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. రెండో వికెట్‌కు 62 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడంతో లంక కోలుకుంది. మరింత ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను ఒమ్రజాయ్ విడదీశాడు. 60 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులతో అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న నిసంకను ఒమ్రజాయ్ అవుట్ చేశాడు. దీంతో 84 పరుగుల వద్ద లంక రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం కుశాల్ మెండీస్... సధీర సమరవిక్రమ మరో మంచి భాగస్వామ్యం నమోదు చేశారు. సాఫీగా సాగుతున్న లంక ఇన్నింగ్స్‌ను ఈసారి ముజిబుర్ రెహ్మన్ దెబ్బకొట్టాడు. 50 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేసిన మెండీస్‌ను ముజీబర్ రెహ్మన్ అవుట్ చేశాడు. 134 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి లంక పటిష్టంగానే కనిపించింది. కానీ కాసేపటికే ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సధీర సమరవిక్రమను అవుట్ చేసి ముజీబుర్ రెహ్మన్ లంకకు షాక్ ఇచ్చాడు. స్కోరు బోర్డుపై మరో అయిదు పరుగులు చేరాయో లేదో సమరవిక్రమ పెవిలియన్ చేరాడు. తర్వాత కూడా వరుస విరామాల్లో లంక వికెట్లను కోల్పోయింది. 26 బంతుల్లో 14 పరుగులు చేసిన ధనుంజయ డిసిల్వను స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌల్డ్ చేసి లంకను మరింత కష్టాల్లోకి నెట్టాడు.
ఆచితూచి ఆడుతున్న చరిత్ అసలంకను కూడా ఫరూకీ అవుట్ చేయడంతో 180 పరుగులకు లంక ఆరు వికెట్లు కోల్పోయింది. అసలంక 28 బంతుల్లో 22 పరుగులు, మాథ్యూస్ 26 బంతుల్లో ఒక సిక్సు, ఒక ఫోర్‌తో 23 పరుగులు, తీక్షణ 31 బంతుల్లో 3 ఫోర్సు, ఒక సిక్సుతో 29 పరుగులతో రాణించడంతో లంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బ్యాటర్లలో ఒక్కరు కూడా అర్ధశతకం సాధించలేదు. అఫ్గాన్ బౌలర్లలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఫరూకీ కేవలం 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చాడు. ముజీబుర్ రెహ్మన్ 2, ఒమ్రజాయ్ 1, రషీద్ ఖాన్ ఒక వికెట్ నేలకూల్చారు.
సునాయసంగా ఛేదన
242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కానీ ఆదిలోనే అఫ్గాన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరకముందే ఫామ్‌లో ఉన్న గుర్బాజ్‌ను మధుశంక బౌల్డ్ చేశాడు. కానీ ఈ ఆనందం లంకకు ఎక్కువసేపు నిలువలేదు. తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ లంక బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటూ లక్ష్యం దిశగా కదిలారు. ఇబ్రాం జర్దాన్ 39, రహ్మత్ షా 62, హస్మతుల్లా షాహిదీ 58, అజ్మాతుల్ల ఒమ్రాజాయ్ 73 పరుగులతో రాణించడంతో అఫ్గాన్ కేవలం 45.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి మరో 28 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్ని అందుకుంది. లంక బౌలర్లలో మధుశంక 2, రజత ఒక వికెట్ తీశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement