Ind Vs Aus 4 th Test: డ్రా దిశగా బాక్సింగ్ డే టెస్టు- పట్టుదలగా ఆడుతున్న జైస్వాల్, పంత్.. పెరిగిన ఉత్కంఠ
మెల్ బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు డ్రా దిశగా సాగుతోంది. భారత బ్యాటర్లు రెండో సెషన్లు వికెట్ కాపాడుకుంటూ ఆడటంతో పరుగుల రాక నెమ్మదించగా, ఆట డ్రా దిశ వైపు వెళుతోంది.
Melbourne Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రా దిశ వైపు భారత్ తీసుకెళ్తోంది. సోమవారం ఆట ఆఖరైన ఐదోరోజు టీ విరామ సమయానికి 54 ఓవర్లలో 3 వికెట్లకు 112 పరుగులు చేసింది. ఈ టెస్టులో విజయానికి ఇంకా 228 పరుగులు కావాలి. ఆసీస్ కు 7 వికెట్లు కావాలి. అయితే ఈ టెస్టును ఈ రోజు డ్రా చేయాలనే ఉద్దేశంతోనే మొదలు పెట్టినట్లు కనిపించింది. అందుకే రెండో ఇన్నింగ్స్ మొదలైనప్పటి నుంచి భారత ఆటగాళ్లు డ్రా చేయడానికే మొగ్గు చూపారు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అజేయ అర్థ సెంచరీతో (159 బంతుల్లో 63 బ్యాటింగ్, 7 ఫోర్లు) అడ్డు గోడలా నిలబడి ఆసీస్ విజయానికి సైంధవుడిలా నిలిచాడు. అతనికి తన సహజ శైలికి బిన్నంగా రిషభ్ పంత్ (93 బంతుల్లో 28 బ్యాటింగ్, 2 ఫోర్లు) ఓపికగా ఆడుతూ సహకరిస్తున్నాడు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 228/9తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 234 పరుగులకు ఆలౌటైంది. నాథన్ లయన్ (55 బంతుల్లో 41, 5 ఫోర్లు) చివరి వికెట్ గా వెనుదిరిగాడు. అతన్ని ఔట్ చేసిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (5/57) పాంచ్ పటాకా పూర్తి చేసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ కు మూడు వికెట్లు, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.
మళ్లీ విఫలమైన రోహిత్..
నిజానికి కెరీర్ కు ఎంతో ముఖ్యమైన ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ తో పోలిస్తే ఓపికగా 40 బంతులు ఆడిన రోహిత్.. చివరికి కమిన్స్ బౌలింగ్ లో చెత్త షాట్ కు ప్రయత్నించి 9 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్లో కమిన్స్ భారత్ కు మరోసారి షాకిచ్చాడు. ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ను డకౌట్ చేశాడు. ఆఫ్ స్టంప్ పై పడిన బాల్.. గాల్లోనే ఔట్ స్వింగై బ్యాట్ అంచును ముద్దాడుతూ, స్లిప్ల్ ఖవాజా చేతుల్లో పడింది. ఇదే 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. దాదాపు 10 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన ఈ జంట.. ఆసీస్ బౌలర్లను సమర్థంగా అడ్డుకుంది.
మళ్లీ ఆ బలహీనతకే కోహ్లీ బలి..
ఈ సిరీస్ లో ఆఫ్ స్టంప్ పై కాస్త దూరంలో పడుతున్న బంతులకు ఔటవుతున్న కోహ్లీ.. మరోసారి అదే తరహాలో ఔటై అభిమానులకు నిరాశ కలిగించాడు. మిషెల్ స్టార్క్ ఆఫ్ స్టంప్ కు కాస్త ఊరించేలా బంతిని విసరగా, తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్ ఆడదామని భావించిన కోహ్లీ.. స్లిప్పులో క్యాచ్ ఇచ్చి 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో తన ఇన్నింగ్స్ కు తెరపడింది. ఆ తర్వాత జైస్వాల్-పంత్ మరో వికెట్ పడకుండా టీ విరామానికి వెళ్లింది. ఈ టెస్టులో ఇంకా 38 ఓవర్ల ఆట మిగిలి ఉండగా, భారత విజయానికి ఇంకా 228 పరుగులు కావాలి. అలాగే ఆసీస్ ఏడు వికెట్లు సాధించాలి.