Vaibhav Suryavanshi: టీమిండియా భవిష్యత్తు "వైభవో"పేతం, 13 ఏళ్లకే సచిన్ రికార్డు చెరిపేసిన చిచ్చరపిడుగు
Vaibhav Suryavanshi: సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతున్న వైభవ్. తాజాగా సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర క్రియేట్ చేశాడు.
Vaibhav Suryavanshi: ఇప్పుడు భారత దేశవాళీ క్రికెట్ లో వైభవ్ సూర్యవంశీ.. ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కేవలం 13 ఏళ్ల వయసులోనే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న వైభవ్.. తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించుకుని.. సచిన్ రికార్డును బద్దలు గొట్టేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అండర్ 19 టెస్టులో కేవలం 47 బంతుల్లో 81 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టులో భారత అండర్-19 జట్టు ఆధిపత్యం చెలాయించిందంటే దానికి వైభవ్ ఇన్నింగ్సే కారణం. వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ 14 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 47 బంతుల్లో 81 పరుగులతో అజేయంగా నిలిచాడు. 172.34 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్ 2 సిక్సర్లు, 13 బౌండరీలు బాదాడు. అంతకుముందు 71.4 ఓవర్లలో ఆస్ట్రేలియాను 293 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. 2026 అండర్ 19 ప్రపంచ కప్ లో చోటు దిశగా వైభవ్ పయనిస్తున్నాడన్న చర్చ ఆరంభమైంది. బ్రియాన్ లారా తన ఆరాధ్యదైవమని వైభవ్ వెల్లడించాడు.
సచిన్ రికార్డు బద్దలు
ఈ ఇన్నింగ్స్ తో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. సచిన్ టెండూల్కర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అండర్ 19 మ్యాచులో 13 సంవత్సరాల 187 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. వైభవ్ ఇప్పుడు సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఒకవేళ వైభవ్ 100 పరుగుల మార్క్‌ను అధిగమించినట్లయితే అండర్ 19 క్రికెట్ లో సెంచరీ చేసిన అతను అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు.
రంజీలోనూ చరిత్రే
బీహార్ జట్టుకు దేశవాళీలో ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడిగా వైభవ్ ఖ్యాతి గడించాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో ముంబైతో జరిగిన మ్యాచులో వైభవ్ బీహార్ తరఫున బరిలోకి దిగాడు. 1942–43లో 12 ఏళ్ల 73 రోజుల వయసులో అలీముద్దీన్ అరంగేట్రం చేసి అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.ఈ క్రమంలోనే సచిన్, యువరాజ్ రికార్డులను కూడా వైభవ్ బద్దలు కొట్టాడు. రంజీ ట్రోఫీలో సచిన్ అరంగేట్ర వయస్సు 15 ఏళ్ల 230 రోజులు కాగా యువరాజ్ సింగ్ వయసు 15 ఏళ్ల 57 రోజులు.
లారానే ఆరాధ్య ధైవం: వైభవ్
లారా బ్యాటింగ్ శైలి తనకు ముచ్చట కలిగిస్తుందని వైభవ్ సూర్యవంశీ అన్నాడు. లారా 400 నాటౌట్ ఇన్నింగ్స్‌ను ఎన్నోసార్లు చూశానని చెప్పాడు. లారాలో నాకు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే.. అతను మ్యాచ్‌ని మధ్యలో వదిలిపెట్టడని అన్నాడు. తన వికెట్ ను లారా అంత తేలిగ్గా వదలుకోడని కూడా చెప్పాడు. మ్యాచ్‌ని చివరి వరకు తీసుకెళ్లి గెలిపించే విధానం..లారాను ప్రత్యేకంగా నిలుపుతుందని వైభవ్ అన్నాడు.
Also Read: క్రికెట్ ప్రపంచంలో అశ్విన్ ఒక్కడే, టెస్ట్ చరిత్రలో భారత జోడి రికార్డు