Javelin Throw Day: నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం... ఆగస్టు 7న జావెలిన్ త్రో డేగా ప్రకటన
టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఆగస్టు 7న స్వర్ణ పతకం గెలిచాడు. ఆ గౌరవార్థం ఇక నుంచి ఏటా ఆగస్టు 7న జావెలిన్ త్రో దినోత్సవం ( Javelin Throw Day)నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ వందేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకం సాధించాడు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. ఏకంగా స్వర్ణం సాధించి యావత్తు భారత్‌కు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా గౌరవార్థం భారత అథ్లెటిక్స్ సమాఖ్య(IAF) ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తాజాగా వెల్లడించింది IAF.
ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే... టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఆగస్టు 7న స్వర్ణ పతకం గెలిచాడు. ఆ గౌరవార్థం ఇక నుంచి ఏటా ఆగస్టు 7న జావెలిన్ త్రో దినోత్సవం ( Javelin Throw Day)నిర్వహించనున్నట్లు ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ ముగించుకుని భారత ఆటగాళ్లు సోమవారం దిల్లీ చేరుకున్నారు. ఈ టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లందరినీ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలోనే అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రణాళిక సంఘం చైర్మన్ లలిత్ భానోత్ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో యువత జావెలిన్ త్రోని కెరీర్‌గా ఎంచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్ మరిన్ని పతకాలు సాధిస్తుందని జోస్యం చెప్పారు.
ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొదటిసారే నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. ఫైనల్ కోసం నిర్వహించిన అర్హత రౌండ్లో కూడా నీరజ్ తన సత్తా చాటాడు. తొలి రెండు ప్రయత్నాల్లోనే ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఈటెను విసిరాడు. దీంతో అతడికి స్వర్ణం ఖాయమైంది.
నా పతకం మిల్కా సింగ్‌కు అంకితం
జావెలిన్ త్రోలో గెలిచిన స్వర్ణ పతకాన్ని నీరజ్ చోప్రా... మిల్కాసింగ్‌కు అంకితమిచ్చాడు. తన పతకాన్ని మిల్కాసింగ్‌కు అంకితం ఇవ్వడం గురించి అడిగితే... ‘మిల్కాసింగ్ అథ్లెటిక్స్ కెరీర్‌కు సంబంధించిన వీడియోలు చూశా. భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఒలింపిక్ పోడియంపై నిలవాలని అతడు ఎప్పుడూ కోరుకునేవాడు. 1960 రోమ్ ఒలింపిక్స్ అతడు త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు. నేను స్వర్ణం గెలిచినప్పుడు, జాతీయ గీతాన్ని వినిపిస్తున్నప్పుడు అతడి మాటలన్నీ గుర్తొచ్చాయి. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయా. కానీ నేను పతకం సాధించిన రోజు చూసేందుకు అతడు లేకపోవడం కొంచెం బాధేసింది. పోడియంపై పతకం తీసుకునేందుకు నిలబడ్డప్పుడు మిల్కా గురించి, ఆయన కోరిక గురించే ఆలోచించా. అందుకే నా పతకాన్ని అతడికి అంకితం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. పీటీ ఉష మేడమ్ కూడా ఒలింపిక్ పతకం కోసం కల కన్నారు. ఇప్పుడు నేను ఆమె కోరికను నెరవేర్చా’ అని నీరజ్ చెప్పుకొచ్చాడు.