Asian Games 2023: స్వర్ణాల పంట! స్క్వాష్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన దీపిక, హరీందర్ జోడీ
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ ప్రకంపనలు సృష్టిస్తోంది. క్రీడాకారులు వరుసపెట్టి పతకాలు సాధిస్తున్నారు.
Asian Games 2023:
ఆసియా క్రీడల్లో భారత్ ప్రకంపనలు సృష్టిస్తోంది. క్రీడాకారులు వరుసపెట్టి పతకాలు సాధిస్తున్నారు. స్వర్ణాలు దక్కించుకుంటున్నారు. తాజాగా స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో టీమ్‌ఇండియా బంగారం గెలుచుకుంది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో దీపికా పల్లికల్, హరీందర్ పాల్ సింగ్ జోడీ 2-0 తేడాతో మలేసియాను ఓడించింది.
ఆర్చరీలో పతకాల జోరు కొనసాగుతోంది. కాంపౌండ్ ఆర్చరీలో పురుషుల జట్టు స్వర్ణం గెలిచింది. అభిషేక్, ఓజాస్, ప్రథమేశ్‌తో కూడిన జట్టు కొరియాను ఓడించింది. 235-230 స్కోరుతో అద్భుత విజయం సాధించింది.
బ్యాడ్మింటన్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ పతకం ఖాయం చేశాడు. పురుషుల సింగిల్స్‌లో అతడు సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో మలేసియాకు చెందిన ఎల్‌జే జియాను 21-16, 21-23, 22-20 తేడాతో ఓడించాడు. ఇక రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఉత్త చేతులతోనే వెనక్కి వస్తోంది. క్వార్టర్‌లో బింగ్జియావో చేతిలో ఓటమి చవిచూసింది. 16-21, 12-21 తేడాతో పరాజయం చవిచూసింది. 2014, 2018 ఆసియా క్రీడల్లో సింధు పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే.
రెజ్లింగ్‌లో మాన్సీ జోషి (57 కిలోలు) కాంస్య పతక పోరుకు సిద్ధమవుతుంది. రెపిచేజ్ మొదటి పోరులో రిపబ్లిక్ కొరియాకు చెందిన బార్క్ జియాన్‌గేను 2-0తో ఓడించింది. అంతిమ్ (53 కిలోలు), పూజా గెహ్లోత్ (50 కిలోలు), నవీన్ (130 కిలోలు గ్రీకో రోమన్) సైతం కాంస్య పోరుకు సిద్ధమవుతున్నారు.
ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 84 పతకాలు సాధించింది. ఇందులో 21 స్వర్ణ పతకాలు, 31 రజతాలు, 32 కాంస్యాలు ఉన్నాయి.