(Source: Poll of Polls)
Ashes Test: బ్రిటన్, ఆసీస్ ప్రధానుల మాటల యుద్ధం
బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఆసీస్ తీరును బ్రిటన్ ప్రధాని విమర్శించగా, అందుకు ఆస్ట్రేలియా ప్రధాని ప్రతిస్పందించారు.
Ashes Test:
బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఆసీస్ తీరును బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ విమర్శించగా, అందుకు ఆస్ట్రేలియా ప్రధాని తీవ్రంగా ప్రతిస్పందించారు.
తాజాగా జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో వివాదాస్పద ఔట్ బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఇరు దేశాల ప్రధానులు పరస్పరం మాటల దాడికి దిగారు. ఇప్పటికే ఈ ఔట్‌పై పలువురు ఆటగాళ్లు, మాజీ క్రీడాకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, తొలుత యూకే ప్రధాని రిషి సునాక్ ఈ ఔట్‌పై స్పందించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరుపై విమర్శలు చేశారు. దీనిపై ఆసీస్ ప్రధాని ప్రతిస్పందిస్తూ, తమ జట్లపై గర్వంగా ఉందని గట్టిగా బదులిచ్చారు. క్రికెట్ అభిమాని అయిన రిషి సునాక్, శనివారం లార్డ్స్ మైదానం నుంచి ప్రిన్స్ విలియమ్‌తో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. మరోవైపు, ఆసీస్ ఆటగాళ్లతో గొడవపడ్డ మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని సునాక్ సమర్థించారు.
క్రీడాస్ఫూర్తికి విరుద్ధం: బ్రిటన్ ప్రధాని
బెయిర్‌స్టో వివాదాస్పద ఔట్‌పై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రతినిధి స్పందించారు. ఈ ఔట్ కేవలం ఆటలో భాగం మాత్రమే కాదని, క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఆస్ట్రేలియా లాగా తాము గెలవాలనుకోవట్లేదన్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అభిప్రాయాన్ని ప్రధాని కూడా అంగీకరించారని వెల్లడించారు. అయితే, దీనిపై ఆసీస్ ప్రధాని ఆల్బనీస్ వద్ద అధికారికంగా నిరసన వ్యక్తం చేయాలని సునాక్ భావించడం లేదని, ఇది కేవలం ఆటలో ఇరు దేశాల నేతల మధ్య స్నేహపూర్వక పోటీ మాత్రమేనన్న అభిప్రాయాన్ని సునాక్ ప్రతినిధి వ్యక్తం చేశారు. మరోవైపు, ఆసీస్ ఆటగాళ్లతో గొడవపడ్డ మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని సునాక్ సమర్థించారు.
నేను గర్వపడుతున్నా: అల్బనీస్
బ్రిటన్ ప్రధాని విమర్శలకు ఆసీస్ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ దీటుగా స్పందించారు. ఆస్ట్రేలియా పురుషులు, మహిళల క్రికెట్ జట్లపై తాను గర్వంగా ఉన్నానని చెప్పారు. తమ రెండు జట్లు ఇంగ్లాండ్‌పై యాషెస్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గాయని... అదే పాత ఆసీస్.. ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుందని అభిప్రాయ పడ్డారు. గెలిచిన వారిని సాదరంగా ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నామని అల్బనీస్ అన్నారు.
అసలేం జరిగిందంటే..
యాషెస్ సిరీస్ రెండో టెస్టు చివరి రోజు తొలి సెషన్ ఆటలో ఇంగ్లాండ్ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. బంతి డెడ్ కాలేదని భావించిన థర్డ్ అంపైర్.. బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. ఇక ఇరు దేశాల మధ్య మూడో టెస్టు గురువారం (జులై 6) నుంచి ప్రారంభం కానుంది.