Tokyo Olympics: దుమ్మురేపుతున్న చీర్4ఇండియా: 'హిందుస్థానీ వే' సాంగ్
ఒలంపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల కోసం.. ఏఆర్ రెహమాన్, అనన్య బిర్లా కలిసి రూపొందించిన హిందుస్థాని వే పాట దుమ్మురేపుతోంది. యూట్యూబ్ లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సింగర్ అనన్య బిర్లా కలిసి రూపొందించిన చీర్4ఇండియా: హిందూస్థానీ వే సాంగ్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించగా.. అనన్య బిర్లా పాడారు. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన రెండురోజులకే 5 మిలియన్ల మార్క్ ను దాటేసింది ఈ సాంగ్. అథ్లెట్లను ఉత్సహపరిచేలా ఉన్నా.. హిందూస్థాని వే పాట అందరినీ ఆకట్టుకుంటోంది. వీడియోలో చేసి ఈ వీడియోలో 1996 నుంచి ఇప్పటి వరకు ఒలంపిక్స్ పాల్గొన్న పలువురు క్రీడాకారులు కనిపిస్తారు.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ పాటను 15 జులైన విడుదల చేశారు. దేశ ప్రజలంతా ఈ పాటను తప్పకుండా విని, భారత అథ్లెట్లను ప్రోత్సహించాలని కోరారు. కరోనా ఎఫెక్ట్ తో భారత క్రీడాకారుల సన్నాహాలకు ఎదురైన ఇబ్బందులు, అధిగమించిన తీరు చూపేలా ఈ సాంగ్ ఉందని భారత ఒలింపిక్ సంఘం (IOA) చీఫ్ నరీందర్ బాత్రా చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత మంగళవారం సమావేశమయ్యారు. అథ్లెట్లలో స్ఫూర్తి నింపడం కోసం వారితో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలను అందుకుంటూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని మోదీ చెప్పారు. మీ వెనక దేశం మొత్తం అండగా ఉందని, క్రీడా వేదికపై భారత పతాకం రెపరెపలాడించాలని కోరారు.
ఇక టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మొత్తం 228 మంది బృందం వెళుతుంది. 119 మంది అథ్లెట్లు 85 విభాగాల్లో పోటీపడనున్నారు. 119 మంది అథ్లెట్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. ఈ రోజు కొంతమంది భారత క్రీడాకారులు టోక్యో వెళ్లనున్నారు. ఒలంపిక్స్ లో సత్తాచాటి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కరోనా వైరస్ కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన ఒలింపిక్స్ ఈ నెల 23 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 13న ఈ క్రీడా గ్రామాన్ని తెరిచారు. ఇప్పటికే వేలాది మంది అథ్లెట్లు, అధికారులు ఈ గ్రామానికి చేరుకున్నారు. కరోనా దృష్ట్యా కఠిన నిబంధనల నడుమ ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నారు. ఈ విశ్వక్రీడలకు దాదాపుగా 11వేల మంది, పారాలింపిక్స్‌కు 4,400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్ ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. క్రీడాగ్రామంలోకి వస్తున్న అథ్లెట్లలో 80% మందికి వ్యాక్సినేషన్ జరిగిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది. కరోనా వ్యాప్తి జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పాల్గొనే అథ్లెట్ల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.