ఏడు సంఖ్య మంచిదేనా? మన పురాణాలు, శాస్త్రలు ఏం చెబుతున్నాయి?
అంకెలు దేనికవే ప్రత్యేకం. కానీ ఏడు అంకెకు హిందుత్వంలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఆచారాలు, నమ్మాకాలను అనుసరించి హిందూమతంలో ఏడు సంఖ్య చాలా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.
ఏడు (7) అంకెకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఏడును పవిత్రమైన అంకెల్లో ఒకటిగా భావిస్తారు. సంస్కృతంలో ఏడును సప్త అంటారు. ఎన్నో దైవిక భావనలకు, వేదాంత సిద్ధాంతాలకు ఏడు ప్రతీకగా నిలుస్తోంది.
వారంలో రోజులు ఏడు. ఇంద్రధనస్సులో రంగులు ఏడు, స్వరాలన్నీ కలిసి సప్త స్వరాలుగా మనందరికీ తెలుసు. సప్తతి అంటే డెబ్బై అని అర్థం. సప్తక అంటే ఏడుగురు మనుషుల సమూహం. సప్తాహం అంటే వారం రోజుల కార్యక్రమం. హిందుత్వంలో ఏడుతో ముడి పడి ఉన్న కొన్ని విషయాలు తెలుసుకుందాం.
యోగ శాస్త్ర ప్రకారం మన శరీరంలో ఉండే చక్రాలు ఏడు. వీటినే శక్తి స్థానాలుగా పరిగణిస్తారు.
- మూలాధార చక్రం ఇది పెరీనియం దగ్గర ఉంటుంది. మలద్వారం, జననేంద్రియాల మధ్య ఖాళీ స్థలాన్ని మూలాధారం అంటారు.
- రెండో చక్రం స్వాధిష్టానం జననేంద్రియానికి కాస్త పైన ఉంటుంది.
- మణిపూరకం ఇది నాభికి కొద్దిగా దిగువన ఉంటుంది.
- అనాహాత రిబ్ కేజ్ రెండు పార్శ్వాలు కలిసే చోట ఉంటుంది.
- విశుద్ధి గొంతులోని కుత్తిక దగ్గర ఉంటుంది.
- కనుబొమ్మల మధ్య ఉండే చక్రం ఆజ్ఞ.
- చివరిది సహస్రారం లేదా అస్ర్బహ్మరంద్ర అని పిలిచే చక్రం. ఇది తల పైన ఉటుంది. అప్పుడే పుట్టిన పాపాయి తల మీద మృదువుగా ఉండే మాడు ప్రదేశంగా చెప్పుకోవచ్చు.
సప్తపురి (ఏడు పవిత్ర పట్టణాలు)
హిందువులకు ఆధ్యాత్మికంగా చాలా ప్రాధాన్యత కలిగిన ఏడు పట్టణాలు ఉన్నాయి. అవి అయోధ్య, మధుర (ఉత్తరప్రదేశ్), కాశీ (వారణాశీ) కంచి (కాంచీపురం), అవంతిక (ఉజ్జయిని), ద్వారక (ద్వారకావతి), మాయాపురి (హరిద్వార్)
సప్త సముద్రాలు (ఏడు పవిత్ర సముద్రాలు)
- లావా సముద్రం, ఇక్షు సముద్రం, సుర సముద్రం, ఘృత సముద్రం, పాల సముద్రం, సుద్ధోదక సముద్రం ఇలా ఏడు సముద్రాలు ఉంటాయి.
- సప్తనది (ఏడు పవిత్ర నదులు)
- గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు, కావేరి
సప్తలోకాలు (ఏడు పవిత్ర ప్రపంచాలు)
ఈ విశ్వంలో 14 లోకాలు (చతుర్దశ భువనాలు) ఉన్నట్టు చెబుతారు. భూమితో సహా పైన ఏడు కింద ఏడు లోకాలు ఉన్నట్టుగా హిందుమత విశ్వాసం. భూమి పైన ఉండే వాటిని ఊర్థ్వలోకాలు అంటారు. ఇవి భూ లేదా భూర్ లోక (భూమి), భువర్ లోక, సవర్లోక, మహర్లోక, జనలోక, తపోలోకా, సత్యలోకాలు ఉండగా, భూమి కింద (అధోలోకాలు) అతల, విఠల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు ఉంటాయి.
సప్తఋషులు (ఏడుగురు గొప్పఋషులు)
సప్తఋషులు అనేది వేద జ్ఞానాన్ని, పవిత్ర గ్రంథాలలో ఉన్న విషయాలను ఇహలోక చైతన్యాన్ని అందించడానికి బాధ్యత తీసుకున్న గొప్ప ఋషులను సప్త ఋషులుగా పరిగణిస్తారు. ప్రతి మన్వంతరానికి ఈ ఏడుగురు ఋషుల కూటమి ఉంటుంది .స్వయంభువ మన్వంతరంలో వారు మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులాహ, క్రతువు, వశిష్ట అని వీరు ఏడుగురు ఋషులు. వీరిని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. ఇప్పుడు కొనసాగుతున్న వైవస్వత మన్వంతరంలో అత్రి, వశిష్ట, కాష్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని అనే ఋషుల కూటమి ఉంది. సప్తఋషి మండల ఏడు నక్షత్రాల సమూహం. ఇది భూమికి ఉత్తర దిశలో స్పష్టంగా కనిపిస్తుంది. గాలిపటం ఆకారంలో ఉంటుంది.
సప్తధాతు
మానవ శరీరం సప్తధాతు నిర్మితం. అవి రస (ద్రవ), రక్త (రక్తం), మాంస (మాంసం), మేడ (కొవ్వు), అస్థి (ఎముకలు), మజ్జా (మజ్జ), శుక్ర (వీర్యం). ఏడు లోహ పదార్థాలు సువర్ణ (బంగారం), రజత (వెండి), కాంస్య (కాంస్య), తామ్ర (రాగి), సీసా (లెడ్), వంగా (టిన్), లోహ (ఇనుము) అని సప్త లోహాలు.
ఇవి మాత్రమే కాదు వివాహంలో అగ్ని చుట్టూ చూసే ఏడు ప్రదక్షిణలు సప్తపది, దేవీ లీలలు వివరించే ఏడు వందల శ్లోకాలు సప్తశతి, దుర్గా దేవి ఏడు అవతారాలు సప్తమాతృక, సూర్య జయంతం రథ సప్తమి, ఆయన రథానికి అశ్వాలు ఏడు, అందుకే సప్తాశ్వ రథ మారూఢం అని కొలుస్తారు. ఉత్తర క్రియల్లో ఏడు విధాలు దానిని సప్తాన అంటారు. ఏడు రకాల వ్యసనాలను సప్తవ్యసనాలని చెప్పారు. వారంలో ఏడవ రోజు శని వారం, పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత ఏడో రోజు సప్తమి సాధారణంగా పవిత్రమైన తిథి. దీనిని భద్ర తిథి అంటారు. ఈ తిథి ఆదివారం రోజున వస్తే భాను సప్తమిగా పరిగణిస్తారు.