Krishna Janmashtami 2021: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!
అందంగా లేనా అని అడగని ఆడపిల్ల ఉండదేమో. అది పురాణాల్లో అయినా…ప్రస్తుతం అయినా... ద్వాపరయుగంలో ఓసారి సత్యభామ…శ్రీకృష్ణుడిని ఇదే ప్రశ్న అడిగిందట. అప్పుడు కన్నయ్య ఏం సమాధానం చెప్పాడో తెలుసా....
శ్రీకృష్ణుని అష్టభార్యల్లో సత్యభామ పాత్ర చిత్రణ తెలుగు సాహిత్యంలో విశిష్టమైన గుర్తింపు దక్కించుకుంది. వీరనారిగా, సరస శృంగారాభిమానవతిగా, విభునికి తనపైనున్న ప్రేమకారణంగా గర్వం మూర్తీభవించినదానిలా సత్యభామ పాత్రను చిత్రీకరించారు. పోతన భాగవతంలో నరకాసుర వధ సందర్భంగా సత్యభామ పాత్రను అందమైన పద్యంగా చెప్పారు.
పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరుగన్ కన్నులు కెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహముల్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్
అర్థమయ్యేలా చెప్పాలంటే నరకునితో యుద్దం చేసే సమయంలో… ఆమె హరునికి ప్రియశృంగారమూర్తిగా, శత్రువుకు భీకర యుద్ధమూర్తిగా ఒకేమారు దర్శనమిచ్చిందట. అంత అందమైన సత్యభామకి అంహకారం కూడా అంతకుమించే ఉందని పారిజాతాపహరణంలో చెబుతారు.అయితే ఓసారి సత్యభామకి ఓ సందేహం వచ్చింది. శ్రీకృష్ణుడిని ఉద్దేశించి స్వామీ.. రామావతారంలో సీత మీ భార్యకదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా?’అని అడిగింది.
అక్కడే ఉన్న గరుత్మంతుడు ప్రభూ నాకంటే వేగంగా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రయాణించ గలరా అన్నాడు
పక్కనే ఉన్న సుదర్శన చక్రం కూడా…‘పరంధామా...ఎన్నో యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాలు తెచ్చిపెట్టాను నాతో సరితూగేవారెవ్వరు అన్నది…
ముగ్గురి మాటల విన్న శ్రీకృష్ణుడు వారికి సరైన సమాధానం చెప్పాలనుకున్నాడు. దీర్ఘంగా ఆలోచించిన నందగోపాలుడు … సత్యా నువ్వు సీతగా మారిపో నేను రాముడినవుతా అన్నాడు. గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతా రాములు తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కొనిరా…సుదర్శన చక్రమా…నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు అని ముగ్గురికీ మూడు బాధ్యతలు అప్పగించాడు.
Also read: రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే
గరుత్మంతుడు వెంటనే హనుమంతుని వద్దకు వెళ్లి..సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. ఆనందంతో పులకించిపోయిన ఆంజనేయుడు నేను నీవెనుకే వస్తాను నువ్వు పద అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు ….ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలం అవుతుందో అనుకుంటూ రివ్వున ఆకాశానికి ఎగురుతాడు. అయితే అంతకు ముందే ఆంజనేయుడు ద్వారక చేరడం చూసి గరుత్మంతుడు సిగ్గుతో తలదించుకుంటాడు.
Also Read: మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం
ఇంతలో హనుమా అన్నపిలుపు విని రాముడివైపు చూసిన వాయుపుత్రుడితో… లోపలకి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’ అని అడగ్గా.. నోటి నుంచి చక్రాన్ని తీసి…ప్రభూ ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో నోట్లో పెట్టుకుని మీ ముందుకొచ్చా అన్నాడు. అప్పుడు సుదర్శనుడు కూడా నేలచూపులు చూడకతప్పలేదు. ఇంతలో రాముడి పక్కనున్న స్త్రీని చూసిన ఆంజనేయుడు… ‘స్వామీ మీ పక్కన ఉండాల్సింది నా తల్లి సీతమ్మ కదా…ఈవిడ ఎవరు అన్నమాట విని సత్య భామకు కూడా గర్వ భంగమైంది. అలా కృష్ణుడు ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచివేసి వినయానికి ఉన్న విలువేంటో తెలియజేశాడు.