Shoe Rack Vastu Tips: చెప్పులు ఈ దిక్కున వదులుతున్నారా? దరిద్రం మిమ్మల్ని వదలదు
చెప్పులు ఉండాల్సిన చోట లేకపోతే దురదృష్టం వెంటాడుతుందని వాస్తు హెచ్చరిస్తోంది. మరి ఏ దిక్కున పెడితే మేలు జరుగుతుంది?
వాస్తు కేవలం ఇంటి నిర్మాణం మాత్రమే కాదు. ఇంటి అమరిక, ఏవస్తువు ఏ స్థానంలో ఉండాలి వంటి వాటన్నింటిని చర్చిస్తుంది. ఇంటికి సంబంధించిన చిన్న విషయం నుంచి అతి పెద్ద విషయం వరకు ప్రతి ఒక్క అంశాన్ని పరిగనణలోకి తీసుకుని రూపొందించిన శాస్త్రం కనుక వాస్తును అనుసరించడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు. చిన్న చిన్న నియమాలను నిర్లక్ష్యం చెయ్యడం వల్ల ఇంట్లో నివసించే వ్యక్తులు పెద్ద మూల్యం చెల్లించాల్సి రావచ్చు. అలా నిర్లక్ష్యం చేసే విషయాల్లో చెప్పులు పెట్టుకునే చోటు కూడా ఒకటి. చెప్పులు ఉండాల్సిన చోట లేకపోతే దురదృష్టం వెంటాడుతుందని వాస్తు హెచ్చరిస్తోంది. అదృష్టాన్ని ఎప్పుడూ మన వెంటే ఉంచుకోవాలనుకుంటే తప్పకుండా చెప్పుల స్టాండ్‌కు సంబంధించిన వాస్తు నియమాలను అనుసరించడమే మంచిది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
చెప్పులు ఎప్పుడూ చిందర వందరగా ఉండకూడదు. ఇలా చెప్పులు చిందరవందరగా పారేస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు వస్తాయట. తూర్పు, ఉత్తర దిక్కులను శాస్త్రం పవిత్రంగా భావిస్తుంది. ఈ దిక్కులు దేవుడి నెలవులని నమ్మకం. కనుక అటువైపు చెప్పులు వదల కూడదు. ఈ దిక్కున చెప్పులు పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి.
ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలి. అది మంచి అలవాటు కాదు. తప్పకుండా చెప్పుల కోసం ఒక షూర్యాక్ చేయించుకోవాలి. అక్కడ మాత్రమే చెప్పులు వదలాలి. ఇంట్లో షూ రాక్ పెట్టుకోవడానికి సరైన దిక్కు నైరుతి అని వాస్తు చెబుతోంది. కనుక అక్కడ మాత్రమే చెప్పులు వదలాలి.
చిన్న ఇళ్లలో నివసించే కొందరు షూరాక్ పెట్టుకునేందుకు సరైన చోటు లేకపోవడం వల్ల బెడ్ రూమ్ లో పెట్టుకుంటారు. ఇది ఆ కుటుంబానికి హానికరం. ఇలా చెయ్యడం వల్ల భార్యా భర్తల మధ్య గొడవలు రావచ్చు. దాంపత్య జీవితం ప్రమాదంలో పడుతుంది. ఇంట్లో శాంతి కరువవుతుంది. కనుక చెప్పుల రాక్ ఎప్పుడూ కూడా బెడ్ రూమ్ లో ఉండకూడదు.
ఇంటి ముఖద్వారం చాలా పవిత్రమైంది. ఇక్కడి నుంచే ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కనుక తప్పనిసరిగా ముఖద్వారం పరిసరాలు శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా బావించి పూజిస్తారు కూడా. అందుకే ముఖద్వారం వద్ద చెప్పులు, షూ ర్యాక్ పెట్టుకోవడం మంచిదికాదు. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అలిగి వెనక్కి వెళ్లిపోతుందని అంటారు. కనుక ముఖద్వారం ముందు చెప్పులు వదల కూడదు.
డబ్బు, నగలు దాచుకునే అల్మారా లేదా బీరువా లేదా కంబోర్డ్ ను చాలా పూజనీయంగా చూసుకోవాలి. ఈ బీరువాలు, అల్మారా ల కింద చెప్పులు వదల కూడదు. అసలు ఆ గదిలోకే చెప్పులతో రాకుండా ఉండడం మంచిది.
ఇలా చెప్పులు వదలాల్సిన చోటు, చెప్పుల ర్యాక్ పెట్టుకోవాల్సిన చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల ఇల్లు శుభ్రంగా, అందంగా కనిపించడం మాత్రమే కాదు, ఇంట్లో సుఖ శాంతులకు అడ్డంకులు ఉండవు. కనుక చెప్పుల విషయంలో చిన్న జాగ్రత్తలు పాటించడం మంచిది.
Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?