Vastu Tips: వాస్తు ప్రకారం లివింగ్ రూమ్ ఇలా ఉండాలి - లేదంటే కుటుంబంలో కలహాలు తప్పవు
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, లివింగ్ రూమ్ ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం లివింగ్ రూమ్ ఎలా ఉండాలో తెలుసుకుందాం.
Vastu Tips: మనదేశంలో చాలా మంది వాస్తును ఫాలో అవుతుంటారు. ఇంటి స్థలం నుంచి మొదలు పెడితే...ఇల్లు కట్టిన తర్వాత చెప్పుల స్టాండ్ పెట్టే స్థలం వరకు ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారమే ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తులో ఏమాత్రం తేడా ఉన్నా..ఆ ఇంట్లో అశాంతి నెలకొంటుంది. అందుకే ఏ చిన్న పని మొదలు పెట్టాలన్నా వాస్తు చూస్తుంటారు. ఇంట్లోని ప్రతి మూల ప్రతికూల లేదా సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉండాలని చెబుతారు. లివింగ్ రూమ్ ఆరోగ్యంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే సానుకూల శక్తిని ఉత్పత్తి చేసేందుకు లివింగ్ రూమ్‌లో ఈ మార్పులు చెయ్యాలి.
లివింగ్ రూమ్ కోసం వాస్తు చిట్కాలు:
ప్రవేశద్వారం:
ఇంటికి ప్రధానగుమ్మం చాలా ముఖ్యం. ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఉండాలంటే ప్రధాన ద్వారం వాస్తు ప్రకారం సరిగ్గా ఉండాలి. ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలోనే ఉండాలి. ప్రధాన గుమ్మం ముందు అందమైన నేమ్ ప్లేట్, పూలతోరణం, ప్రకాశవంతమైన వెలుతురు ఉండాలి. అయితే ప్రధాన ద్వారనికి దగ్గర షూ రాక్ పెట్టకూడదు.
దిశ:
వాస్తు ప్రకారం లివింగ్ రూమ్ ఉత్తరం, తూర్పు, ఈశాన్య లేదా వాయువ్య దిశగా ఉండాలి. డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా రెండూ కూడా దగ్గరగా ఉండాలి. డైనింగ్ ఏరియా లివింగ్ రూమ్ కు తూర్పు లేదా ఆగ్నేయంలో వంటగదికి పక్కనే ఉండాలి.
ఫర్నిచర్:
లివింగ్ రూమ్ లో గుండ్రని ఫర్నిచర్ ఉంచకూడదు. బేసి సంఖ్యలో ఉండకూదు. చదరపు లేదా, దీర్ఘచతురస్రాకార వస్తువులతో డెకరేట్ చేయడం మంచిది. సింథటిక్ కు బదులుగా చెక్క ఫర్నిచర్ అయితే సానుకూల శక్తిని ప్రసరిస్తుంది. లివింగ్ రూమ్ సోఫాలను పశ్చిమ లేదా నైరుతి మూలలో ఏర్పాటు చేయాలి. గదిలోని ఆగ్నేమ గోడపై టీవీని ఉంచాలి.
అలంకార వస్తువులు:
లివింగ్ రూమ్ ఎప్పుడూ కూడా అందంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. చిందరవందరగా ఉంచకూడదు. పనికిరాని వస్తువులను గదిలో నుంచి తీసివేయాలి. గోడలపై పెట్టే పోస్టర్లు కానీ.. ఇతర చిత్ర పటాలను కూడా సంతోషంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. నిరాశను కలిగించే కళాఖండాలు, అలంకరణ వస్తువులను ఉంచకూడదు. పగిలిన గాజులు, పగిలిన అద్దాలు, విద్యుత్ ఉపకరణ వంటి వస్తువులు ఉంటే వెంటనే వాటిని తీసివేయండి. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని ప్రసారం చేస్తాయి. మనీప్లాంట్, స్పైడర్ మొక్కలు, గాలిని శుద్ధి చేసే మొక్కలతో లివింగ్ రూమ్ ను అందంగా తీర్చిదిద్దండి.
లివింగ్ రూమ్ కోసం రంగులు:
వాస్తు ప్రకారం కొన్ని శక్తులు రంగులకు ఆకర్షితులవుతాయి. లివింగ్ రూమ్‌కు తెలుపు, క్రీమ్, లేత గోధుమ రంగు వంటి రంగులు వేయడం మంచిది. ఆకుపచ్చ, పసుపు వంటి షేడ్స్ ను వేయకపోవడమే మంచిది.
Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.