ఏ తులసి ఇంట్లో పూజలో పెట్టుకోవాలి? రామ తులసా? శ్యామతులసా?
ఉదయం నిద్ర లేవగానే తులసీ దర్శనం చేసుకుంటే సమస్త తీర్థాలను దర్శించిన ఫలితం దక్కుతుందట. తులసిని నాటినా, రోజూ నీరు పోసినా, పోషించినా మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
ప్రతి హిందూ ఇంట్లోనూ తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. తులసికి పూజ జరగని ఇల్లు దాదాపుగా ఉండదనే చెప్పాలి. తులసిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీకంలో కళ్యాణం కూడా జరిపిస్తుంటారు. అయితే తులసి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రామ తులసి, రెండోది శ్యామ తులసి. ఈ రెండింటిలో ఉండే తేడాలు ఏమిటి? ఇంట్లో ఆయురారోగ్య, ఐశ్వర్య, ఆనందాలతో సమృద్ధిగా ఉండాలంటే ఏ రకమైన తులసి మొక్కను ఇంట్లో పెట్టుకుని పూజించాలి?
విష్ణుభక్తికి తులసి దళాలు ప్రతీక. ఎన్ని రకాల నైవేద్యాల నివేదించినా రాని ఫలితం విష్ణుమూర్తికి ఒక్క తులసిదళం సమర్పించి పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. రుక్మిణి శ్రీకృష్ణుని గెలుచుకున్నది కూడా కేవలం ఒక్క తులసీదళంతోనే. తులసి కోట ఉండే ప్రదేశం తీర్థ స్థలమని, గంగాతీరంతో సమానమైన పవిత్రత కలిగి ఉంటుందని పండితులు చెబుతారు.
లక్ష్మీనారాయణుడు కొలువుండే స్థానంగా తులసిని భావించి ప్రతి హిందువు తమ ఇంట్లో తులసిని పెంచుకుంటారు. ఇంట్లో తులసి ఉండే పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా వ్యాపిస్తుందని నమ్ముతారు. తులసి మొక్కలో లక్ష్మీ నారాయణులిద్దరు కొలువుంటారని నమ్మకం. తులసిని పూజిస్తే ఉభయ దేవతల అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి.
తులసిలో రెండు రకాలు ఉంటాయని అందరికీ తెలియదు. ఈ విషయం తెలసిన వారు చాలా తక్కువ మంది. ఒకటి రామతులసి కాగ, రెండోది శ్యామ తులసి. ఈ రెండు తులసి మొక్కలకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. అందుచేత శాస్త్రోక్తంగా ఇంట్లో ఏ తులసి మొక్కను నాటాలి. రామ తులసి , శ్యామ తులసి మధ్య తేడాలు తెలుసుకుని పూజించుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
రామతులసి
రామతులసి ముదురు ఆకుపచ్చ రంగు ఆకులను కలిగి ఉంటుంది. దీని ఆకులు విశాలంగా ఉంటాయి. రామ తులసి రాముడికి చాలా ప్రీతిపాత్రమని చెబుతారు. అందుకే దీనికి రామతులసి అనే పేరు వచ్చింది. రామ తులసి ఆకులు మధురంగా ఉంటాయి. దీన్ని ఇంట్లో నాటుకోవడం చాలా శుభప్రదం. ఇది ఇంట్లో ఉంటే సంతోషం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. పూజకు కేవలం రామతులసిని మాత్రమే ఉపయోగించాలి.
శ్యామ తులసి
భాగవతాన్ని అనుసరించి శ్యామ తులసి శ్రీ కృష్ణుడికి ప్రీతి పాత్రమైంది. అందుకే దీన్ని కృష్ణ తులసి అని కూడా అంటారు. శ్యామ తులసి ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. లేదా కొద్దిగా ఊదా రంగులో కనిపిస్తాయి. రామతులసితో పోలిస్తే తక్కువ తీపితో ఉంటుంది. శ్వాససమస్యలు, చెవికి సంబంధించిన అనారోగ్యాలకు, చర్మ సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ఇంట్లో ఏ తులసి శుభప్రదం?
శాస్త్ర ప్రకారం రామ, శ్యామ తులసులు రెండింటికి వాటి ప్రాముఖ్యత ప్రత్యేకంగా ఉంటుంది. కనుక రెండు మొక్కలు ఇంట్లో నాటుకుంటే మరీ మంచిది. అయితే చాలా మంది రామ తులసిని ఎక్కువ మంది ఇంట్లో పెట్టుకుంటారు. తులసిని నాటేందుకు గురు, శుక్ర, శని వారాలు అత్యంత అనుకూలమైన రోజులు. ఈ రోజుల్లో తులసి నాటితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో ఆ ఇల్లు సమృద్దిగ ఉంటుంది. ఏకాదశి, ఆదివారం, గ్రహణం రోజున, సోమవారం, బుధ వారం తులసిని కొత్తగా ఇంట్లో నాటకూడదు.