Tirumala Laddu Row: 'శ్రీవారి భక్తులూ ఈ మంత్రం జపించండి' - భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి
Tirupati News: తిరుమలలో లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని.. భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. భక్తులు క్షమా మంత్రాలు జపించాలని సూచించారు.
TTD EO Key Suggestion To Devotees: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి కీలక సూచనలు చేశారు. లడ్డూ ప్రసాదంపై వివాదం నెలకొన్న వేళ పవిత్ర హోమాన్ని సోమవారం ఉదయం టీటీడీ నిర్వహించింది. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో, క్షమా మంత్రాలైన.. 'ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ' మంత్రాలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందాలని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న క్రమంలో.. లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. అనంతరం ఈవో, జేఈవో మీడియాతో మాట్లాడారు.
'ఇక అపోహలు వద్దు'
శ్రీవారి ఆలయంలో (Srivari Temple) ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం, నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలు, అపోహలు పక్కన పెట్టవచ్చని వెల్లడించారు. యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు చెప్పారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని పేర్కొన్నారు. 'ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశాం. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాం. లడ్డూ ప్రసాదం, ఇతర నైవేద్యాల విషయంలో ఇక ఎలాంటి అపోహలు వద్దు. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం.. పవిత్రోత్సవాలతో పోయింది. మార్చిన నెయ్యితోనే ఆ తర్వాత ప్రసాదాలు తయారుచేశాం. తెలిసీ తెలియక చేసిన దోషాలు ప్రోక్షణ, శాంతిహోమంతో తొలగిపోతాయి.' అని వివరించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ప్రధానార్చకులు శ్రీ గోవిందరాజ దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీరామకృష్ణ దీక్షితులు, శ్రీ సీతారామ దీక్షితులు, వేదపారాయణదారులు, రుత్వికులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టుకు పంచాయతీ
అటు, ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ, బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని.. లేదా నిపుణులతో విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. అటు, ఈ వివాదంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మరో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని పిటిషన్‌లో కోరారు. ఎలాంటి ఆధారాలు చూపించకుండానే సీఎం ఆరోపణలు చేశారని అన్నారు.