Tirupati Laddu Row: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు
Supreme Court: తిరుమల తిరుపతి లడ్డూ వివాదం కోర్టు మెట్లు ఎక్కింది. సమగ్ర విచారణ కోరుతూ బీజేపీ, వైసీపీ నేతలు ఇద్దరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Tirumala Laddu: తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పుడు తాజాగా ఈ వివాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒక పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని అభ్యర్థించారు. లేదంటే నిపుణులతో విచారణ చేయాలని కోరారు.
తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను బీజేపీ లీడర్ సుబ్రమణ్యస్వామి వేశారు. ఎలాంటి ఆధారాలు చూపించకుండానే సీఎంగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేసారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సుబ్రమణ్య స్వామి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎక్స్ వేదికగా సుబ్రహ్మణ్యస్వామి ఈ పిటిషన్ విషయాన్ని తెలియజేశారు. తిరుపతి తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు. లడ్డూ కలుషితమైందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ఈ వివాదంపై దర్యాప్తు చేసేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిల్ వేసినట్టు పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ తిరుమల లడ్డూ వివాదంపై సురేష్ ఖండేరావు అనే వ్యక్తి కూడా పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ తిరుమల లడ్డూ వివాదంపై మూడు పిటిషన్లు సుప్రీం కోర్టులో విచారణకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వివాదంపై సీబీఐ లేదా మరే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌లపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి మొదలైంది.