Tirumala: తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం... పల్లకీల్లో విహరించిన స్వామి వారు, ఉభయదేవేరులు
తిరుమలలో ఇవాళ శ్రీవారి ప్రణయ కలహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారు, ఉభయ దేవేరులు వేరు వేరు పల్లకీల్లో విహరించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు పల్లకిలో మహాప్రదక్షిణ మార్గంలో పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై ప్రదక్షిణంగా స్వామి వారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లతో స్వామి వారిని మూడు సార్లు తాడించారు. స్వామి వారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామి వారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందా-స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.
Also Read: శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం
టీటీడీ ఆధ్వర్యంలో 502 దేవాలయాల నిర్మాణం
టీటీడీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో దాదాపుగా 502 వేంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించామని టీటీడీ అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. ఇవాళ తిరుమలలో వెయ్యి మంది వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఫిషర్ మెన్ కాలనీల్లో ఆలయాలను అధికంగా నిర్మించామన్నారు. ఆ ప్రాంతంలోని దేవాలయాల నిర్వహణకు అదే కులానికి సంబంధించిన వారికి వేదాలు నేర్పించి అర్చకులుగా నియమించామన్నారు. గత బ్రహ్మోత్సవంలో రాష్ట్రంలోని వెనుకబడిన వారిని తిరుమలకు తీసుకుని వచ్చి శ్రీవారి దర్శనం కల్పించామని ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ద్వారా దర్శనం 10 రోజుల పాటు అందుబాటులో ఉందని, ఈ నేపథ్యంలో వెనుకబడిన షెడ్యూల్ కులాల వారికి వైకుంఠ దర్శనాలు కల్పించే ప్రయత్నం చేసామన్నారు. 13 జిల్లాల నుంచి సమరస ఫౌండేషన్ సహకారంతో భక్తులను ఎన్నిక చేసి స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా నుంచి వెయ్యి మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించామని తెలిపారు.
Also Read: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... ఆంక్షల నుంచి వీటికి మినహాయింపు