Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలు 2025 - పాలను నీళ్లను వేరుచేసే హంస వాహనంపై శ్రీనివాసుడి దర్శనం జ్ఞానాన్ని అందిస్తుంది!
Srivari Brahmotsavam 2025 : బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సాయంత్రం హంస వాహనంపై సరస్వతి అలంకారంలో దర్శనం ఇచ్చారు మలయప్పస్వామి!

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సెప్టెంబర్ 25 గురువారం రాత్రి శ్రీమలయప్పస్వామి సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడవీధుల్లో విహరించారు.

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామి జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనం అయిన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ ఉన్న హంస స్వభావం ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.

భక్తులలో అహంకారాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే శ్రీనివాసుడు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సెప్టెంబర్ 26 శుక్రవారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, శుక్రవారం రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలు జరుగుతాయి.

ఇక తిరుమలలో శ్రీవారి భక్తులకు మరింత వేగంగా దర్శనం జరిగేలా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ICCC సెంటర్ ప్రారంభించారు. తిరుమలకు వచ్చే భక్తులకు వెయిటింగ్ సమయం తగ్గించేలా అత్యుత్తమ విధానాలు అనుసరించారలని భక్తులకు సూచించారు. అంతకుముందు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం రెడీ అనలటిక్స్, మెషీన్ లెర్నింగ్ సహాయంతో వెయిటింగ్ లో ఎంత మంది భక్తులు ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా క్యూలైన్ నిర్వహణ చేపడతామని సంబంధిత అధికారులు CMకు వివరించారు. భక్తులు వేచిఉండే క్యూ కాంప్లెక్సులల ఆధ్యాత్మిక వీడియోలు, శ్రీవారి చరిత్ర ప్రదర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి దగ్గరే ఆపేసేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలి. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించిన CC కెమెరాల సాయంతో అలిపిరి నుంచే రద్దీని గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. శ్రీవారి ఏడుకొండలు ఏడు రంగులతో గ్రీనరీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. TTD నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించాలి' అని చంద్రబాబు సూచించారు.

తిరుమలలో భక్తుల రద్దీని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ICCC సెంటర్.. AI, క్వాంటమ్ రెడీ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలతో పనిచేస్తుంది. 6 వేల CC కెమెరాల ద్వారా 3డీ మ్యాపింగ్ చేస్తుంది. అలాగే రెడ్ స్పాట్లు గుర్తిస్తుంది..తద్వారా రద్దీని తగ్గించే చర్యలు చేపట్టేలా చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా AI సాంకేతికతను ఉపయోగించి భక్తుల రద్దీని అంచనా వేస్తారు, భక్తుల భద్రతను పర్యవేక్షిస్తారు. క్యూ లైన్లలో పరిస్థితి, దర్శనానికి పట్టే సమయం తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తారు.
Navaratri Day 5: నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారం - పూజా విధానం, నైవేద్యం వివరాలు ఇవే!
Day 5 Navratri 2025: నవరాత్రి ఐదో రోజు స్కందమాత అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక, ఈరోజు పఠించాల్సిన శ్లోకం ఇదే!
నవరాత్రులు ఆధ్యాత్మికంగానే కాదు.. మానసిక శారీరక ఆరోగ్య సాధన కూడా - అందుకే పూజలో ఈ 3 తప్పులు చేయకండి!.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















