Tirumala Bramhosthavam: తిరుమల ఆనంద నిలయం గురించి ఈ విషయాలు తెలుసా!
Tirumala Bramhosthavam: తిరుమల శ్రీవారి ఆలయం అందరికి గుర్తు ఉంటుంది.. మరీ దేవదేవుడు కొలువైన ఆనందం నిలయం చూసిన భక్తులు దాని గురించి తెలుసుకున్నారా.. అయితే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే.
Tirumala Bramhosthavam: తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు పరితపిస్తాము. స్వామివారిని దర్శనం చేసుకుని అంతయూ నీవే హరి పుండరీకాక్ష అంటూ శరణు కోరి బయటకు వచ్చి ఆనంద నిలయం చూసి ఆనంద పడతారు. శ్రీవారి దర్శనం దొరకనివారు కూడా ఆనందనిలయాన్ని చూసి దర్శించుకున్నాం అన్నంత ఆనందంలో తిరిగి వెళతారు. అలాంటి ఆనంద నిలయం గురించి ఈ స్టోరీలో తెలసుకుందాం...
శ్రీనివాసుని నిలువెత్తు విగ్రహం కొలువైన .. బంగార వర్ణం లో మెరిసిపోతూ కనిపించే గోపురం ఆనంద నిలయం. విష్ణుదేవుని ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి క్రీడాచలాన్ని భూలోకానికి తీసికొని వచ్చినట్లు, దానిని సువర్ణముఖరీనదికి ఉత్తరం వైపున్న శేషాచల కొండలలో ప్రతిష్ఠించినట్లు ఆ క్రీడాద్రి మీద భూవరాహస్వామి శ్వేతవరాహకల్పం నుంచి నివసిస్తున్నట్లు అనేక పురాణాలు పేర్కొన్నాయి.
Also Read: తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
శ్రీ వేంకటాచలమాహాత్మ్యం గ్రంథంలో ఒక కథ ఉంది .. ఓరోజు వాయుదేవుడు - ఆదిశేషుడు పందానికి దిగాడు. ఆదిశేషుడు మేరుపర్వత పుత్రుడైన ఆనందపర్వతాన్ని చుట్టుకున్నాడు..తనని కదిలించేందుకు వాయుదేవుడు ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. చివరకు శేషుడు ఆనందాద్రిని భూలోకంలో సువర్ణముఖరీనది ఉత్తర ఒడ్డుకు తోశాడు. పశ్చాత్తాపంతో శేషాచలపర్వతంగా మారాడు శేషుడు. ఆతని శిరస్సు మీద ఆనందపర్వతం ఆనందనిలయ విమానంగా మారిపోయింది. ఇది ఆనందనిలయ విమానపుట్టుక రహస్యం.
ఆనందాద్రి పరమానందం బ్రహ్మానందం కలిగించేది. ఆ కొండపై ఋషులు తపమాచరించి ఆనందమే పరబ్రహ్మస్వరూపంగా తెలుసుకున్నారు.
ఆనందనిలయంలో ఉండే మహామణిమండపం ప్రత్యేకతే వేరు. ఈ పేరును పురాణాల నుంచి గ్రహించిన చంద్రగిరి మాధవదాసర్(మల్లనమంత్రి) బంగారువాకిలి ముందు మండపం నిర్మించినపుడు(క్రీ.శ.25-8-1417) దానికి వాడుకున్నాడు. అందువల్ల అది మహామణి మండపమైంది. విఖనస మహర్షి శిష్యుడైన మరీచి విమానసహిత దేవాలయంలోని మూర్తిని పూజించడం అత్యుత్తమమైందని తెలిపారు. ఈ ఆనందనిలయ విమానాన్ని తొలుత ‘మరీచిసంహిత’ ననుసరించి తొండమానుచక్రవర్తి నిర్మించినట్టు తెలుస్తోంది. చారిత్రకాంశాలకు వస్తే వేరువేరు కాలాలలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, శ్రీమంతులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమాలన్నిటిలోకి క్రీ.శ.1250- 55 లలో జరిగిన మరమ్మతు ముఖ్యమైనది. తిరుప్పుల్లానిదాసర్ అనే అతడు వీరనరసింగయాదవరాయల అనుమతితో జీర్ణోద్ధరణకు పూనుకున్నాడు. పాతశాసనాలన్నింటినీ కాపీచేసి జీర్ణోద్ధరణ తర్వాత కొత్త నిర్మాణాల మీద మళ్లీ చెక్కించారు.
దీనిని తూచా తప్పకుండా నిర్వహించిన తిరుప్పుల్లాని దాసర్‌ను అభినందించి, ఆతనినే ఆదర్శంగా తీసికొని తానుకూడా తులాభారంలో తనను తూచమని తన యెత్తు బంగారం ఆలయానికి ఇచ్చి ఆనందనిలయ విమానానికి బంగారుమలామా చేయించమన్నాడు వీరనరసింగదేవ యాదవరాయలు. ఆ విధంగా ఆలయంలో తులాభారం వేయడం తొలుత ప్రవేశపెట్టారు. తొలిసారి బంగారుమలామా ఆనందనిలయ విమానానికి దక్కింది. దర్శనానికి వచ్చిన పాండ్యచక్రవర్తి మొదటి జటాదర్శన్ సుందరపాండ్యుడు తన ఉభయంగా ఆ విమానం మీద బంగారు కలశం ప్రతిష్టించారు. ఈ విశేషాలతో కూడిన ఆ శిలా శాసనాలు (పాత) మొదటి శా.సం.లో 49, 91 శాసనాలుగా ఉన్నాయి.
Also Read: ఏడాదిలో రోజుల సంఖ్య కన్నా తిరుమలేశుడి ఉత్సవాల సంఖ్యే ఎక్కువ!
రాజవంశీయుల సేవ..
చంద్రగిరికోటలో ఉన్న రంగనాథ యాదవరాయల తర్వాత సాళువ మంగిదేవుడు.... విజయనగర సంగమ వంశరాజులకు సామంతుడుగా మారినప్పుడు తిరుమల ఆలయాన్ని దర్శించాడు. ఆనందనిలయ విమానం కళావిహీనమై కనబడింది. వెంటనే దానికి బంగారుపూత పూయాలని ఆదేశించాడు. క్రీ.శ. 1361 సం|| నాటి ఈ సంఘటన తెలుగులో శాసనబద్ధమైంది. (TTD శాసనసంపుటి 1, నం.179,180) తిరుమల ఆలయంలో మొట్టమొదటి తెలుగుశాసనం ఇదే. దాదాపు 50సం||ల తర్వాత రెండవ దేవరాయల మంత్రి- అమాత్యశేఖర మల్లన లేదా చంద్రగిరి మాధవదాసర్ క్రీ.శ. 25-8-1417లో తిరిగి బంగారు పూత పూయించాడు. బంగారువాకిలి ముందు మహామణిమండపాన్ని నిర్మించినప్పుడే విమాన జీర్ణోద్ధరణ చేసి ఉంటాడని అంచనా. అసలు శాసనం కొంత శిథిలమైంది. కానీ అందులో మొట్టమొదటిసారిగా ‘ఆనందవిమానం’ అను పేరు కనబడింది. (తిరుమల తిరుపతి దేవస్థాన శాసనసంపుటి 1, నం.196, 198) 100 సం||ల తర్వాత క్రీ.శ. 9-9-1518 సం||లో శ్రీకృష్ణదేవరాయలు 30 వేల వరహాలు చెల్లించి బంగారుమలామా చేయించాడు. (తిరుమల తిరుపతి దేవస్థాన శాసన సంపుటి.3 నం.81)
ఐదవసారి కాంచీపురానికి చెందిన కోటి కన్యాదానము లక్ష్మీ కుమార తాతాచార్యులు క్రీ.శ.1630 సంవత్సరం రెండవ వెంకటపతిరాయల కాలంలో బంగారుపూత పూయించగా, ఆరవసారి మహంత్ ప్రయోగదాస్‌జీ కాలంలో ఆయన సోదర శిష్యుడు అధికార రామలక్కన్‌దాస్ క్రీ.శ. 1909లో బంగారుమలామా చేయించాడు. తిరుమల తిరుపతి దేవస్థాన శాసనాలలో ఇదే చిట్టచివరి శిలాశాసనం.
Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!
1958, 2006, 2018లో TTD వారు స్వయంగా ఆనందనిలయ దివ్యవిమానానికి సొబగులద్ది సంప్రోక్షణలు చేశారు. ఇప్పటికి 9 సార్లు ఆ దివ్యవిమానానికి మరమ్మతులు చేశారు.
ఆనందనిలయం శ్రీవారికి ఆవాసం మాత్రమే కాదు ఆపన్నులపాలిటి కొంగుబంగారం. ఆపదమొక్కులవారంతా ఆ విమానం చుట్టూ అంగప్రదక్షిణ చేసి ఇష్టసిద్ధిని పొందుతుంటారు. అన్ని ఉత్సవాలు, అభిషేకాలు విమాన ప్రదక్షిణతోనే ఆరంభమౌతాయి. కొన్నిసార్లు శ్రీవారి దర్శనం కలగనప్పుడు స్వామిని పోలిన విమాన వేంకటేశ్వరుని దర్శించి తరిస్తారు భక్తులు. ఈ సారి మీరు తిరుమలకు వెళ్లినప్పుడు తప్పకుండా తిరుమల ఆనంద నిలయాన్ని, విమాన వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి.
Also Read: లడ్డూ సహా శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఇవే - శుక్రవారం చాలా ప్రత్యేకం!