జులైలో ఎన్ని పండుగలో…
జులై మొత్తం పండుగల సందడే. చాతుర్మాస వ్రతం మొదలు బోనాలు, జగన్నాథుడి రథాయాత్ర ....బక్రీద్, గురుపూర్ణిమ వరకూ నెలంతా పండుగల సందడే..
జులైలో ఎన్ని పండుగలో…
జులై నెల ఎన్నో పండుగలు, వ్రతాలకు ప్రసిద్ధి. తెలంగాణ బోనాలు, పూరీ జగన్నాథుడి రథాయాత్ర, గురుపూర్ణిమ, బక్రీద్ తో పాటూ ఎన్నో పండుగలొచ్చాయ్. ఇదే నెలలోనే చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. అలాగే దేవశయని ఏకాదశి నుంచి దేవతలు 4 నెలలు నిద్రిస్తారని పండితులు చెబుతారు. అనంతరం నాలుగు నెలల తర్వాత వచ్చే ఏకాదశి నుంచి శుభకార్యాలు ప్రారంభమవుతాయి.
జులై 5- యోగిని ఏకాదశి, మతత్రయ ఏకాదశి
ఈరోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు . ఈరోజున వ్రతం చేయడం వల్ల భక్తులకు అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 88 వేల మంది బ్రాహ్మాణులకు అన్నదానం చేస్తే పుణ్యం పొందుతారని కృష్ణుడు చెప్పాడట.
జులై 7 ప్రదోష్ వ్రతం
ఈరోజున పరమేశ్వరుడిని ఆరాధించే పండుగగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల పిల్లలు దీర్ఘాయుష్షు పొందుతారు… కోల్పోయిన డబ్బు తిరిగి పొందుతారు.
జులై 8 మాస శివరాత్రి
ప్రతి నెల మాస శివరాత్రిని జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం ఉండటం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయంటారు.
జులై 11 బోనాలు ప్రారంభం
గోల్కొండ కోట నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు జులై 25 తేదీన సికింద్రబాద్, ఆగస్ట్ ఒకటో తేదీన లాల్ దర్వాజ బోనాలు ఉంటాయి. ఆషాఢ మాసంలో జరుపుకునే తొలి పండుగ ఇదే. ఈ సమయంలో ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. అంటే ఆ తల్లికి సమర్పించే నైవేద్యం. మహిళలు ఇంట్లో వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం వంటి వాటితో బోనాన్ని మట్టి లేక రాగి కుండల్లో తలపై పెట్టుకుని డప్పు కోలాహాలతో గుడికి వెళ్తారు. మరోవైపు జులై 11 నుండి ఆషాఢ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇవి జులై 18వ తేదీతో ముగుస్తాయి.
జులైలై 12 రథయాత్ర….
ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన జగన్నాథుని రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర ఉత్సవాలు సుమారు పదిరోజుల పాటు ఘనంగా జరుగుతాయి.
జులై15 స్కంధ పంచమి, కుమార షష్టి
ఈ మాసంలో ఆషాఢ శుద్ధ పంచమిని స్కంధ పంచమిగా చెబుతారు పండితులు. అలాగే ఆషాఢ షష్టిని కుమార షష్టిగా చెబుతారు. ఈ పవిత్రమైన రోజున సుబ్రహ్మాణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈరోజున కఠినమైన ఉపవాసం ఉండి, తర్వాతి రోజు ఆలయానికి వెళ్లి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం.
జులై 17 దక్షిణాయనం ప్రారంభం
జులై 20 దేవశయని ఏకాదశి
ఈరోజు నుంచే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని చెబుతారు.
జులై 21 బక్రీద్..
ముస్లింల ప్రధాన పండుగల్లో బక్రీద్ ఒకటి. ఈద్ జరిగిన రెండు నెలల తర్వాత సరిగ్గా చెప్పాలంటే 70 రోజుల తర్వాత జరుపుకుంటారు. త్యాగాన్ని స్మరించుకొని నమస్కరించే పండుగ. ఇస్లామిక్ క్యాలెండర్లో దీన్ని ఈద్ ఉల్-అజా అని పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ చివరి నెలల్లో జూ-అల్-హిజ్ జరుపుకుంటారు.
జులై 24 గురుపూర్ణిమ..
ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్షం పౌర్ణమి రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారు. ఈరోజు మహాభారత రచయిత వేద వ్యాస మహర్షి పుట్టినరోజు. ఆయన గౌరవార్థం గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.
జులై 27 సంకష్ట చతుర్థి
హిందూ పంచాంగం ప్రకారం, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్ఠ చతుర్థి అంటారు. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థిని వినాయక చతుర్థి అని పిలుస్తారు.