Sri Ramanujacharya : రామానుజాచార్యుల పైనా కీర్తనలు రాసిన అన్నమయ్య
శ్రీ వేంకటేశ్వరుడి పరమ భక్తుడైన అన్నమాచార్యులు…శ్రీ రామానుజా చార్యులకు ఏకలవ్య శిష్యుడు. గురువుని ప్రత్యక్షంగా చూడకపోయినా గురువుగా భావించి ఆయనపై కీర్తనలు రచించారు తాళ్లపాక అన్నమయ్య. ఆ కీర్తన మీకోసం.
సమాజంలో రావాల్సిన సంస్కరణలు తొలుత మతాలు, ఆలయాల నుంచే ఆరంభం కావాలని ఆకాంక్షించారు విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి చాటిన రామానుజాచార్యులు. అందుకే ఆలయాల్లోని అస్తవ్యస్త పరిస్థితులను, అక్రమాలను సరిదిద్దారు. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్న ఆగడాలను అరికట్టారు. తన నిర్వహణలోని శ్రీరంగనాథ దేవాలయం నుంచే సంస్కరణలు ఆరంభించారు. మూఢాచారాలకు స్వస్తి పలికారు. కుల వివక్ష లేకుండా భగవంతుణ్ణి దర్శించుకునేలా, పెరుమాళ్ల ఉత్సవంలో అందరూ పాల్గొనేలా విధి విధానాలను సవరించారు. అలాగే తిరుమల ఆనందనిలయంలో వైఖానస ఆగమం ప్రకారం ఆచార వ్యవహారాలు, పూజాదికాలు రూపొందించింది కూడా రామానుజాచార్యులే! వారు నిర్దేశించిన ప్రకారమే శ్రీవారి ఉపచారాలు, ఉత్సవాలు నేటికీ నిర్వహిస్తున్నారు. అందుకే అన్నమాచార్యులు కూడా రామానుజాచార్యులను గురువుగా స్వీకరించారు.
Also Read: రామానుజాచార్యుల దివ్యశరీరం ఇంకా భద్రపరిచే ఉంది... మీరు చూశారా...
శ్రీ వేంకటేశ్వరుడి పరమభక్తుడు, పదకవితాపితామహుడు అయిన అన్నమయ్య తిరుమలలో ఘనముని అనే గురువు వద్ద వైష్ణవమతాన్ని స్వీకరించారు. కానీ వైష్ణవమత ప్రచారకర్త, విశిష్టాద్వైత సిద్ధాంతవేత్త అయిన రామానుజాచార్యులనే పరమగురువుగా భావించారు. ప్రత్యక్షంగా చూడకపోయినా, ఆయన బోధనలనే అనుసరించారు. రామానుజులపై కీర్తనలు కూడా రచించారు. ‘గురుకృప వల్లనే వేద రహస్యాలు తెలుసుకోగలిగాను. అహంకారాన్ని పోగొట్టి శరణాగత తత్త్వాన్ని అలవరచారు’ అంటూ ‘గతులన్ని ఖిలమైన కలియుగమందును... గతి ఈతడే చూపె ఘన గురు దైవము’ అంటూ సంకీర్తించారు.
రామానుజులపై అన్నమయ్య కీర్తన
సంపుటం: 2-372
గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి యీతఁడే చూపె ఘనగురుదైవము ॥పల్లవి॥
యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి-
మీతనివల్లనే కంటి మీతిరుమణి
యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
మీతఁడే రామానుజులు యిహపరదైవము ॥గతు॥
వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు
చలిమి నీతఁడే చూపె శరణాగతి
నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రధారణము
మలసి రామానుజులే మాటలాడే దైవము ॥గతు॥
నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు
దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను
దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రి దైవము ॥గతు॥
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ముచ్చింతల్ దివ్య క్షేత్రంలో ఫిబ్రవరి 2 నుంచి 14వ వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.
12 రోజుల పాటూ జరగనున్న ఉత్సవాల్లో ఏ రోజు ఏంటి..
ఫిబ్రవరి 3న అగ్ని ప్రతిష్ట, అష్టాక్షరి జపం
ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ రాక, రామానుజాచార్య మహా విగ్రహావిష్కరణ
ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ధర్మసమ్మేళనం
ఫిబ్రవరి9న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాక
ఫిబ్రవరి10న సామాజిక నేతల సమ్మేళనం
ఫిబ్రవరి11న సామూహిక ఉపనయనం
ఫిబ్రవరి 12న విష్ణు సహస్రనామ పారాయణం
ఫిబ్రవరి13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాక
ఫిబ్రవరి14న మహా పూర్ణాహుతి
Also Read: శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో కొలువుతీరనున్న శ్రీరామానుజాచార్యుల విగ్రహం ప్రత్యేకతలివే…